ONLINE SCAMS IN TELUGU
మీరు ఆన్లైన్లో డబ్బులు పంపిస్తున్నారా? - సైబర్ నేరగాళ్లు ఉన్నారు జాగ్రత్త!
ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బు సంపాదన గురించి యాడ్స్ - పెద్ద మొత్తంలో నగదు మోసాలు - నివారించడానికి ఇలాంటి సూచనలు పాటించాలంటున్న పోలీసులు.
Prevention Tips in Telugu for Cyber Crime : ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు ఆశచూపి దోచుకుంటున్నారు. స్నాప్‌డీల్, ఓఎల్‌ఎక్స్ ద్వారా వల విసిరి డబ్బులు గుంజడం, ఉద్యోగాల పేరుతో వల వేయడం ఇలా అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నుంచి నగదు కాజేసి ఆర్థికంగా కుంగదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఈ తరహా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
మోసాలు ఇలా జరుగుతాయి! :
మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఓ బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బు సంపాదన గురించి యాడ్ చూశారు. అందులో ఉన్న కాంటాక్ట్ నంబరుకు ఫోన్ చేశారు. అతను బాధితురాలితో మీకు ఒక లింకు పంపిస్తున్నాం, క్లిక్ చేస్తే కొన్ని వస్తువులు కనిపిస్తాయి అని చెప్పాడు. ముందుగా మీరు మీ డబ్బుతో ఆ వస్తువులను కొనుగోలు చేయండి, ఆ తర్వాత కమీషన్‌తో కలిపి మీకు డబ్బులు తిరిగి చెల్లిస్తాం అని నమ్మించాడు. మొదట రూ.100తో ఒక వస్తువు ఆర్డర్ చేయగా మోసగాడు కమీషన్‌తో కలిపి రూ.150 తిరిగి బాధితురాలికి చెల్లించాడు. కమీషన్ రావడంతో నమ్మిన బాధితురాలు ఈసారి రూ.13 వేలతో వస్తువులను ఆర్డర్ చేశారు. సైబర్ నేరగాడు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంవల్ల తాను మోసపోయినట్లు బాధితురాలు ఆలస్యంగా తెలుసుకోవాల్సి వచ్చింది.
సింగరేణికి ఓ వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా లోన్‌పే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. యాప్‌లో తన వివరాలన్నీ పొందుపరిచి, ప్రాసెసింగ్ ఫీజు, టాక్స్ పేరిట డబ్బులు చెల్లించాలని సైబర్ నేరగాడు కోరాడు. బాధితుడు పలు దఫాలుగా సుమారు లక్ష రూపాయలు చెల్లించి మోసపోయాడు.
మంచిర్యాలకు చెందిన మరో వ్యక్తి ఫోన్‌పే కస్టమర్ కేర్ కోసం గూగుల్‌లో వెతికాడు. సైబర్ నేరగాడు సమస్య పరిష్కారం కోసం ఎనీ డెస్క్ అనే అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పాడు. బాధితుడు అతడు చెప్పిన విధంగా చేశాడు. క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకున్న నేరగాడు బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.50 వేలు మాయం చేశాడు.
పోలీసుల సూచనలు
మొబైల్‌కు వచ్చిన ఓటీపీ, ఇతర బ్యాంకు ఖాతాల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పకూడదు.
తెలియని వైఫైల ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ జరపకూడదు.
వ్యక్తిగత రుణాలు, ఉద్యోగాలు కల్పిస్తామనే ఫోన్లు, లింక్‌లకు స్పందించవద్దు.
డెబిట్‌కార్డు, ఫోన్ హ్యాక్ అయిందనే అనుమానం వచ్చిన వెంటనే ఆన్లైన్ కొనుగోళ్లను నిలిపివేయాలి.
ముఖ్యంగా తెలియని వ్యక్తులకు ఫోన్‌పే ద్వారా నగదు పంపవద్దు, తీసుకోవద్దు.
కేసుల వివరాలు :
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది మార్చి 31 వరకు సైబర్‌క్రైం 90 కేసులు నమోదు కాగా, రూ.69.39 లక్షలు బాధితులు నష్టపోయారు. 1930కి ఫిర్యాదు చేయడం ద్వారా పోలీసులు రూ.23.34 లక్షలు నేరస్థులకు వెళ్లకుండా బాధితుల సొమ్మును రక్షించారు.
రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేరుతోనే నకిలీ ఖాతా సృష్టించిన సైబర్ నేరగాళ్లు పలువురి వద్ద నుంచి నగదును అడుగుతున్నట్లు రిక్వెస్టు పోస్టులు పెట్టారు. ఫేస్‌బుక్, వాట్సప్, తదితర మాధ్యమాల ద్వారా ప్రముఖుల పేర్లు, సమాజంలో గుర్తింపు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని వారి పేర్లతో డబ్బులు కావాలంటూ రిక్వెస్టులు పంపుతున్నారు.
టోల్‌ఫ్రీ నంబర్ "1930" :
సైబర్‌క్రెం పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసే లోపే నేరగాళ్లు డబ్బులను ఖాతాల నుంచి లాగేసుకుంటారు. ఇలాంటి మోసాలను అరికట్టి నేరగాళ్ల అకౌంట్లను నిలిపివేసేలా, కేంద్రప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది. ఖాతాల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే హెల్ప్‌లైన్ నంబరు 1930కి ఫోన్ చేయాలి.
COMMENTS