NO FIRST AID KITS IN TGSRTC
బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెలేవీ? - చిన్నప్రమాదాలకు ఆసుపత్రే దిక్కా?
ఆర్టీసీ బస్సుల్లో అందుబాటులో ఉండడం లేని ప్రథమ చిక్సిత్స కిట్లు - ప్రయాణికులకు చిన్నపాటి గాయమైనా ఆసుపత్రికే తరలించాల్సిన పరిస్థితి.
First Aid Kits Are Not Available on TGSRTC Buses : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సమయంలో చిన్న గాయమైనా ప్రథమ చికిత్స చేసేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండడం లేదు. మోటరు వాహనాలు చట్టం ప్రకారం ఆర్టీసీ, విద్యాసంస్థల బస్సుల్లో ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) పెట్టెలు కచ్చితంగా ఉండాలి. అయితే, ఆర్టీసీ బస్సుల్లో చాలా వరకు కనిపించడం లేదు. కొన్ని బస్సుల్లో బాక్సులు ఉన్నా వాటిలో ప్రథమ చికిత్సకు అవసరమైనవి వస్తువులు ఉండడం లేదు. దీంతో ప్రయాణికులు గాయపడితే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లే వరకు చికిత్స అందడం లేదు.
తెలంగాణాలో ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సుమారు 55 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. 35 లక్షల కిలోమీటర్ల దూరం బస్సులు తిరుగుతాయి. ఈ క్రమంలో జరిగే ప్రమాదాల్లో బస్సులోఉన్న ప్రయాణికులు గాయపడుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో లోఫ్లోర్ బస్సుల్లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రయాణికులు పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ బస్సుల్లో ఉన్న ఆధునిక టెక్నాలజీ కారణంగా ఒక్కసారిగా వాయువేగంతో వెళ్తుంది. ఒకట్రెండు క్షణాల్లోనే బస్సు వేగం మొత్తాన్ని తగ్గించవచ్చు. ముందు తక్కువ , వెనక అధిక ఎత్తులో ఈ బస్సులు ఉండటంతో ఎక్కి, దిగేటప్పుడు పలువురు పడిపోతున్నారు.
బస్సులో ప్రయాణికులు గాయపడితే కండక్టర్ ప్రథమ చికిత్స చేయాలి. దాని గురించి వారికి అవగాహన ఉండాలి. అయితే, ప్రస్తుతం ఆసుపత్రికి వెళ్లేవరకు, అంబులెన్సు ఎక్కేవరకు కనీస వైద్యం అందించే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రయాణికులతోపాటు కండక్టర్లూ గాయాలపాలై ప్రథమచికిత్స అందక ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల హయత్‌నగర్ డిపో బస్సు ఉప్పల్‌లో ప్రయాణిస్తుండగా ఓ వాహనం అకస్మాత్తుగా అడ్డు వచ్చింది. దీంతో డ్రైవర్ బ్రేక్ వేయడంతో మహిళా కండక్టర్ పడిపోయి గాయపడ్డారు. కిట్టు లేకపోవడంతో బస్సులో ప్రథమ చికిత్స చేయలేదు. ఆమె తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో 4రోజుల పాటు చికిత్స తీసుకున్నారు.
- టించర్ అయోడిన్
- యాంటిసెప్టిక్ క్రీం
- దూది, కత్తెర
- కట్టు కట్టేందుకు కాటన్ బ్యాండేజ్
- గాయాలకు ఎలాస్టిక్, వాటర్‌ప్రూఫ్ ప్లాస్టర్
బస్సుల్లో పరిశీలించగా :
పలు ఆర్టీసీ బస్సులను పరిశీలించగా కొన్నింట్లో ఫస్టు ఎయిడ్ బాక్సులే లేవు. కొన్నింట్లో ఉన్నా అలంకారప్రాయంగా మారాయి. అందులో పూర్తస్థాయిలో వస్తువులు అసలు ఉండవు. ఆ పెట్టెల్లో టిమ్స్‌లో వాడే పేపర్ రోల్స్ పెడుతున్నారు. కొన్నింట్లో స్క్రూ డ్రైవర్ల వంటివి కనిపించాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం విద్యాసంస్థల బస్సుల్లోనూ ఫస్ట్ ఎయిడ్ కిట్‌లు ఉండాలి. కానీ, ఈ బస్సులు ప్రయాణించే దూరం తక్కువ అన్న కారణంతో పలు విద్యాసంస్థల యాజమాన్యాలు అటెండెంర్లకు ఫస్ట్ ఎయిడ్పై అవగాహన కల్పించడం లేదు.
COMMENTS