INDIRAMMA HOUSES CEMENT AND STEEL
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ - ఇక చౌకగా సిమెంట్, స్టీల్!
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక సమాచారం - సిమెంట్, స్టీల్ ధరల తగ్గింపుపై ఆయా కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు.
Cement and Steel at Low Prices for Indiramma Houses : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకుంది. రాష్ట్ర ప్రజలకు అతి తక్కువ ధరకు ఇందిరమ్మ ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అటువైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కొంత మేరకు ఇసుకను ఉచితంగా లబ్ధిదారులకు అందిస్తుండగా, తాజాగా ఇళ్ల నిర్మాణం కోసం కావాల్సిన సిమెంట్, స్టీల్(ఉక్కు)ను లబ్ధిదారులకు మార్కెట్ ధర కంటే తక్కువకు అందించాలని ఆయా కంపెనీల ప్రతినిధులతో సర్కార్ చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు సఫలం అయితే ఆ రెండు తక్కువ ధరకు లభించనున్నాయి. ఈ క్రమంలో లబ్ధిదారులకు మంచి శుభవార్తను అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవల సిమెంట్, స్టీల్ ధరలు అమాంతం పెరగగా, ఒక్కో సిమెంట్ సంచిపై బ్రాండ్‌ను బట్టి రూ.50 నుంచి రూ.80 వరకు పెంచారు. అలాగే టన్ను స్టీల్‌పై కూడా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పెంచారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 4.50 లక్షల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా అందిస్తామని సర్కాు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇళ్లకు ఉపయోగించే సిమెంట్, స్టీల్ కూడా తక్కువ ధరకే దొరికేలా చూస్తామని హామీ ఇచ్చింది. పెరిగిన ఈ రెండింటి ధరలకు ఒక్కో లబ్ధిదారుడికి అదనంగా రూ.17 వేల వరకు ఖర్చు అవ్వనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యం అవుతుందని పలువురు లబ్ధిదారులు గుసగుసలు ఆడుకుంటున్నారు.
ధర తగ్గిస్తారా? లేక అలాగే ఉంటుందా? :
గత వారమే సిమెంట్, స్టీల్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపగా, రాష్ట్రంలో మొత్తం 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాలకు 40.50 లక్షల టన్నుల సిమెంట్, 68 లక్షల టన్నుల స్టీల్ అవసరం అవుతాయని ఆయా పరిశ్రమల ప్రతినిధుల దృష్టికి అధికార యంత్రాంగం తీసుకెళ్లినట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్ బస్తాను రూ.260కి, టన్ను స్టీల్ రూ.47 వేలకు అందించాలని ప్రభుత్వం కోరింది. త్వరలోనే యాజమాన్యాలతో మాట్లాడి ధర తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆయా కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ వారంలో దీనిపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకుని ధర తగ్గింపుపై సంస్థల ప్రతినిధులతో పాటు ప్రభుత్వం ఓ ప్రకటనను సైతం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలు ధర తగ్గింపునకు ముందుకు వస్తే నేరుగా లబ్ధిదారులకే అందించే విధంగా ఏదైనా ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని లేదా స్థానిక అధికారుల నుంచి లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందించాలనే రాష్ట్ర ప్రభుత్వం భావనలో ఉంది.
COMMENTS