HOW TO PREPARE MUTTON GRAVY CURRY
ఈ పేస్ట్ వేసి "మటన్ కర్రీ" వండితే గ్రేవీ కూడా అదుర్స్ - ముక్క మెత్తగా, జ్యూసీగా సూపర్ టేస్ట్!
- మటన్ కర్రీకి అసలైన ఫ్లేవర్ అందించే రెసిపీ - ఫ్యామిలీ మొత్తం ఇష్టంగా ఆస్వాదిస్తారు!
Mutton Gravy Curry: సండే వచ్చిందంటే మెజార్టీ జనాల ఇళ్లలో నాన్‌వెజ్ ఘుమఘుమలు అద్దిరిపోతాయి. ఇక మాంసాహారంలో మటన్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ధర ఎక్కువైన సరే వారానికి ఒకసారి అయినా మటన్ తినాల్సిందే. అయితే సండే మటన్ తెచ్చారంటే చాలా మంది రెగ్యులర్ పద్ధతిలో కూర వండేస్తుంటారు. తీరా పులుసు ఎక్కువ కావడమో, కూర పల్చగా కావడమో జరుగుతుంటుంది. అయితే ఈసారి మటన్ వండేటప్పుడు ఓసాిరి ఈ పద్ధతిలో చేయండి. ముక్క మెత్తగా ఉడకడమే కాకుండా జ్యూసీగా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ మటన్ కర్రీని ఎలా చేయాలో చూసేయండి.
మారినేషన్ కోసం:
మటన్ - 1 కేజీ
ఉప్పు - 1 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
పసుపు - టీస్పూన్
పెరుగు - పావు కప్పు
మసాలా కోసం:
ధనియాలు - 2 టీస్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
యాలకులు - 8
నల్ల యాలకులు - 2
మరాఠీ మొగ్గలు - 2
అనాసపువ్వు - 1
జాపత్రి - కొద్దిగా
మిరియాలు - 1 టీస్పూన్
లవంగాలు - 4
తోక మిరియాలు - అర టీస్పూన్
జాజికాయ - చిన్న ముక్క
గ్రేవీ కోసం:
బాదం పప్పులు - ఆరు
జీడిపప్పులు - 10
వేయించిన ఉల్లిపాయలు - 1 కప్పు
ఉడికించిన టమాటాలు - 2
కర్రీ కోసం:
నూనె - 10 టేబుల్‌స్పూన్లు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 15
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్‌స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం:
- మందుగా కూరకు అవసరమయ్యే ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి ఆయిల్లో వేయించి ఓ కప్పు కొలత వచ్చేలా చేసుకోవాలి. అలాగే టమాటాలను నీటిలో 5 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- మటన్‌ను శుభ్రంగా కడిగి నీటిని వడకట్టాలి. ముక్కల్లోంచి నీరు పూర్తిగా పోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసి బాగా కలిపి సుమారు 1 గంట సేపు మారినేట్ చేయాలి.
- మరో చిన్న గిన్నెలో బాదం, జీడిపప్పులు వేసి సరిపడా నీళ్లు పోసి గంట సేపు నానివ్వాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ధనియాలు, జీలకర్ర, సోంపు, యాలకులు, నల్ల యాలకులు, మరాఠీ మొగ్గలు, జాపత్రి, అనాసపువ్వు, లవంగాలు, మిరియాలు, తోక మిరియాలు, జాజికాయ వేసి లో ఫ్లేమ్‌లో దోరగా, మంచి వాసన వచ్చే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్‌లోకి వేసి మెత్తని పొడిలా చేసి ఓ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టాలి.
- అదే మిక్సీజార్‌లోకి నానబెట్టిన బాదం, జీడిపప్పులు, వేయించిన ఉల్లిపాయలు, ఉడికించిన టమాటాలు వేసి మెత్తని గ్రేవీ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నూనె, నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చినచెక్క వేసి ఓ నిమిషం పాటు వేయించాలి.
- పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం మారినేట్ చేసిన మటన్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
- ఈ టైమ్‌లో మటన్‌లోకి నీరు చేరుతుంది. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి నీరు ఇంకి నూనె పైకి తేలే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి.
- మటన్ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. అయితే ముక్కలను మారినేట్ చేసినప్పుడు ఉప్పు, కారం వేసుకున్నాం కాబట్టి ఈ సమయంలో చూసి వేసుకోవాలి.
- మసాలాలు మగ్గి నూనె పైకి తేలిన తర్వాత కూర ఉడికేందుకు సరిపడా వేడి నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. నీరు అనేది మీరు తినే గ్రేవీకి అనుగుణంగా పోసుకోవాలి.
- నీరు పోసి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి ఓసారి కలిపి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. సరిగా ఉడకకపోతే మరో రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్‌లో పెట్టి గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలు వేసిన మూత పెట్టి సుమారు 5 నుంచి 8 నిమిషాలు కుక్ చేసుకోవాలి.
- మసాలా మొత్తం ముక్కకు పట్టి నూనె పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగు చల్లుకుంటే సూపర్ టేస్టీగా, జ్యూసీగా ఉండే మటన్ కూర రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
చిట్కాలు:
- ఇక్కడ మటన్ అనేది లేతది తీసుకుంటే కూర తొందరగా ఉడకడంతో పాటు రుచి బాగుంటుంది.
- మసాలా దినుసులను లో ఫ్లేమ్‌లో వేయిస్తేనే లోపలి వరకు వేగి కూరకు మంచి వాసనను ఇస్తుంది.
- మీరు తినే ఉప్పు, కారానికి అనుగుణంగా వాటిని వేసుకోవాలి.
- మటన్ ఉడికించేటప్పుడు నీళ్లు తక్కువ పోస్తే జీడిపప్పు పేస్ట్ అడుగున అంటుకుంటుంది. అలా అని ఎక్కువ పోయొద్దు. ముక్క మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది.
COMMENTS