HOW TO IDENTIFY ORIGINAL SILK SAREE
మీరు కొనే పట్టువస్త్రాలు నాణ్యమైనావా? లేదా నకిలీవా? - ఇలా సింపుల్‌గా గుర్తించండి
పట్టువస్త్రాల నాణ్యతను ఎలా గుర్తించాలి? - సిల్క్‌మార్క్ లేబుల్ అంటే ఏమిటి? దీనిని ఎవరు జారీ చేస్తారు?
How To Easily Identify Original Silk Saree : పెళ్లి, నూతన గృహప్రవేశం ఇలా శుభకార్యమేదైనా పట్టువస్త్రాలు ధరించడమనేది మన సంప్రదాయం. అందులోనూ చేనేత వస్త్రాలకు మరింత ప్రాధాన్యం ఇస్తుంటారు. రూ.వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన చేనేత చీరలు పట్టుతో తయారు చేసినవా? లేదంటే నాసిరకమైనవా అనేది గుర్తించడం కాస్త కష్టమే.
దురాశకు పోయే కొంతమంది వ్యాపారులు నకిలీ పట్టువస్త్రాలను అసలైనవిగా విక్రయించే అవకాశముంది. గద్వాల జిల్లాలో తయారయ్యే పట్టు వస్త్రాలు గద్వాల చేనేత జరీ చీరల పేరుతో భారీ క్లాత్ షాప్‌లలో విక్రయిస్తుంటారు. మగ్గాలపై నేత మరుగునపడి పవర్‌లూమ్స్ వచ్చిన తర్వాత అసలు, నకిలీ వస్త్రాలను గుర్తించడం కష్టతరంగా మారింది. గద్వాల, నారాయణపేట ప్రాంతాల్లో చేనేత చీరల వ్యాపారం చేసే వారు అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తుతుంటే గద్వాల చీరలను మగ్గాలపై నేసే నేతన్నలు మాత్రం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నారు.
నాణ్యమైనవిగా ఇలా గుర్తించాలి :
పట్టుచీరులు, వస్త్రాలు కొనుగోలు చేసే కస్టమర్లు నకిలీతో మోసపోవద్దని కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో సిల్క్‌మార్క్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ సిల్క్‌మార్క్ సంస్థ ద్వారా సిల్క్‌మార్క్ లోగోను రూపొందించారు. దీనికి సంబంధించిన లేబుల్ పట్టువస్త్రంపై ఉంటే అది అసలైనది. పట్టుచీరపై సిల్క్‌మార్క్ లేబుల్‌కు క్యూఆర్ కోడ్ కూడా అటాచ్ చేసి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే ఆ వస్త్రం ఎక్కడ తయారైంది? ఎవరు దానిని తయారు చేశారు? అనే వివరాలనేవి కనిపిస్తాయి. వస్త్రానికి సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నంబర్ కూడా కనిపిస్తుంది.
లేబుల్ ఇలా ఇస్తారు :
హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ సిల్క్ బోర్డు ఆఫీసులో పట్టు చీరలు నేసే కార్మికులు, చేనేత సహాకార సంఘాలు, మాస్టర్‌వీవర్లు తమ ఐడీ కార్డుతో సిల్క్‌మార్క్ లేబుల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు దరఖాస్తుదారుడి ఇంటికి వచ్చి పరిశీలించి నివేదికను ప్రధాన కార్యాలయానికి(హెడ్ ఆఫీస్‌కు) పంపిస్తారు. దీనికి చేనేత కార్మికుడు రూ.4,130, మాస్టర్ వీవర్స్ లేదా ఉత్పత్తిదారుడు రూ.18,050లు చెల్లించి రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో లేబుల్ రూ.5.90 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దుకాణాల్లో నకిలీ లేబుళ్లు అతికించి విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే నేరుగా సెంట్రల్ సిల్క్‌బోర్డు కార్యాలయానికి కంప్లైంట్ చేయవచ్చు. పరిశీలించి విక్రయదారుడు, తయారీదారుడిపై సిల్క్‌బోర్డు రూల్స్ మేరకు చర్యలు తీసుకుంటారు.
COMMENTS