Hi-tech mass copying in government job written exam!
Hi-tech Mass Copying: దగ్గితే పక్క రాష్ట్రం నుంచి ఆన్సర్.. ప్రభుత్వ ఉద్యోగాల రాత పరీక్షలో హైటెక్ మాస్ కాపీయింగ్!
దొడ్డి దారుల్లో అయినా అనుకున్నది సాధించేందుకు నేటి యువత దేనికైనా వెనకాడట్లేదు. అలాంటి సంఘటనే ఇది. ఎంతో పకడ్భందీగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల రాత పరీక్ష నిర్వహిస్తున్న ఓ పరీక్ష కేంద్రంలో కేటుగాళ్లు చేసిన మాయ అధికారులను విస్తుపోయేలా చేసింది. ఏకంగా 2,600 కిలోమీటర్ల ఆవల ఉన్న పక్కరాష్ట్రం నుంచి సమాధానాలు అందించసాగిందో ముఠా. ఇక పరీక్ష రాసే అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా అమర్చుకున్న ఎల్రక్టానిక్ పరికరాల సాయంతో పరీక్ష రాసేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన ఓ రిక్రూట్‌మెంట్ పరీక్షలో జరిగిన మాస్ కాపీయింగ్ ఉదంతం ఇది. పోలీసుల ఎంట్రీతో మొత్తం గుట్టురట్టైంది. అసలేం జరిగిందంటే..
అరుణాచల్ ప్రదేశ్‌లోని నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలోని బోధనేతర పోస్టుల భర్తీకి సీబీఎస్‌ఈ మే 18న ఎంపిక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు ఇటానగర్‌లోని వీకేవీ చింపు, కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్ కేంద్రాల్లో మే 22న ల్యాబ్ అటెండెంట్ పరీక్ష రెండు షిఫ్టుల్లో జరిగింది. కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్‌లో నిన్న సాయంత్రం పరీక్ష రాస్తున్న సమయంలో ఓ అభ్యర్థి అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు సోదాలు చేశారు. తనిఖీల్లో ఆ విద్యార్థి వద్ద ఓ చిన్న ఎల్రక్టానిక్ పరికరం, అతి చిన్న మైక్రోఫోన్ దొరికాయి. దీంతో ఈ పరీక్ష కేంద్రంలో అభ్యర్ధులందరినీ చెక్ చేయగా.. ఏకంగా 23 మంది వద్ద సరిగ్గా ఇలాంటి పరికరాలే దొరికాయి. ఉదయం షిఫ్ట్‌లో పరీక్షలు రాసిన అభ్యర్ధుల వద్ద కూడా ఇలాంటి పరికరాలు ఉన్నట్లు తేలింది. అందరినీ పట్టుకున్నామని ఎస్‌పీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ తెలిపారు. వీరందరినీ సమీప హోటళ్లు, ఇళ్లలోనే ఉండగా.. అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 53 మంది పట్టుబడగా.. 29 డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాస్ కాపీయింగ్ వెనుకున్న మాస్టర్‌మైండ్ కోసం ప్రస్తుతం పోలీసులు వెదుకుతున్నారు.
మాస్ కాపీయింగ్‌కు సహకరించిన ముఠా 2,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా నుంచి ఆపరేట్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పరీక్ష రాసేందుకు సాయం చేస్తామంటూ ఓ ముఠా తమను సంప్రదించిందని, ఎగ్జామ్ హాల్స్‌లో ఎల్రక్టానిక్ పరికరాలను ఉపయోగించే తీరుపై వీరందరికీ ఆ ముఠా శిక్షణ ఇచ్చిమరీ పంపింది. వీరంతా ఎలక్ట్రానిక్ డివైజ్‌ను అండర్ వేర్‌లో దాచుకుని పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. అతిచిన్న ఇయర్ ఫోన్‌ను బయటకు కనిపించకుండా చెవి లోపల అమర్చారు. అభ్యర్ధులు తమకందించిన క్వశ్చన్ పేపర్ సెట్ ఏ, బీ, సీ, డీల్లో ఏదో అవతలి వారికి చెప్పాలి. దగ్గితే సమాధానం అడిగినట్లు అర్ధం.. అప్పుడు అవతలి వ్యక్తి నుంచి జవాబు వస్తుందని వీరి కోడ్ భాషను ఎస్‌పీ రాకెట్ వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే పరీక్ష పత్రం కూడా లీకై ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు జరుగుతుంది.
COMMENTS