CHILD MARRIAGES ON RISE IN TG
పదహారేళ్లకే ఆడపిల్ల జీవితం నాశనం - రాష్ట్రంలో పెరుగుతున్న మైనర్ వివాహాలు
పదహారేళ్లకే ఆడపిల్లకు పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు - వేసవిలో పెరుగుతున్న పెళ్లిళ్లు - అధికారుల అప్రమత్తంగా ఉంటేనే ఆడపిల్ల బాల్యం సుఖమయం.
Child Marriages in Telangana : ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ భారాన్ని ఎంత వేగంగా దించుకుందామనే చూసే తల్లిదండ్రులే ఎక్కువ మంది. పదోతరగతి పూర్తయినా, పదహారేళ్ల వయసు దాటుతున్నా వారిని ఎప్పుడు ఇంటి నుంచి పెళ్లి చేసి పంపించేద్దామా అనే అభిప్రాయం కన్నవాళ్లలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కనీస వివాహ వయసు 18 ఏళ్లు నిండకముందే పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు రోజుకు సగటున మూడు జరుగుతున్నాయి. ఇందులో అత్యధిక కేసులు ఉభయ జిల్లాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం.
గతేడాది వందకి పైగా బాల్య వివాహాలను సమగ్ర శిశు అభివృద్ధి పథకం అధికారులు అడ్డుకున్నారు. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు మరెన్నో ఉన్నాయి. ప్రస్తుతం పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. వేసవిలో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తు అప్రమత్తం కావాలి. అప్పుడే, మరెందరో బాలికల భవిష్యత్తు అంధకారం కాకుండా ఉంటుంది.
స్థానిక కమిటీలదే కీలకపాత్ర :
బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిరోధానికి ప్రతి గ్రామంలో పలు శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీలను నియమించారు.
ఇవి స్థానిక బాలికల వివరాలను సేకరించి వారిపై పర్యవేక్షణ ఉంచుతాయి.
వేసవి నేపథ్యంలో వివాహాలు అధికంగా జరిగే గ్రామాల్లో ఆయా కమిటీలు ప్రత్యేక దృష్టిసారించాలి.
బాలికలకు వివాహం నిశ్చయమైనట్లు గుర్తిస్తే, వెంటనే ఆయా కుటుంబాలకు అధికారులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి.
అధికారులు హెచ్చరించినా :
అధికారులు హెచ్చరించినా ఓ తల్లిదండ్రులు మైనర్ అయినా కుమార్తెకు ఇటీవల వివాహం జరిపించారు. ఐసీడీఎస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది. ఏడో తరగతి చదివే బాలికకు వివాహం నిశ్చయమైందని ఓ వ్యక్తి చైల్డ్‌లైన్ నంబరు 1098 నంబరుకు ఫోన్ చేశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మైనర్లకు వివాహం చేసినా, బాలల హక్కులకు భంగం కలిగినా, అఘాయిత్యాలకు పాల్పడినా ఫిర్యాదు చేస్తే తక్షణం ఐసీడీఎస్ అధికారులు వస్తారు. ఆ వివరాలను వారు గోప్యంగా ఉంచుతారు.
కారణం :
- పేదరికం, అప్పుల కారణంగా గ్రామాల్లో ఆడపిల్లలకు తక్కువ వయసులోనే పెళ్లి చేయాలని నిర్ణయిస్తున్నారు.
- యుక్త వయసులో ప్రేమ పట్ల ఆకర్షితులవుతారనే భయం, పరువుపోతుందనే బాధతో పది, ఇంటర్ పూర్తవగానే కొందరు వివాహ సంబంధాలు అన్వేషిస్తున్నారు.
- సామాజికంగా వేళ్లూనుకున్న లింగ వివక్ష, బంధుమిత్రుల ప్రభావంతో ముక్కుపచ్చలారని వారికీ మూడు ముళ్లు వేయిస్తున్నారు.
- ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో తమ పిల్లలకు ఎలాంటి వేధింపులు, చేదు అనుభవాలు ఎదురుకాకముందే ఓ ఇంటికి కోడలిని చేయాలనే ఆత్రుత కనిపిస్తోంది.
COMMENTS