BHU BHARATI PROBLEMS
సాదాబైనామాలో పెద్దఎత్తున సమస్యలు - ఈనెల 5 నుంచి 28 జిల్లాల్లో సదస్సులు
భూభారతి పైలన్ ప్రాజెక్టు - సాదాబైనామాల్లో పెద్దఎత్తున సమస్యలు - హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలోనూ ఈనెల5 నుంచి సదస్సులు.
Bhu Bharati in Telangana : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్టులో రెవెన్యూశాఖకు వచ్చిన దరఖాస్తుల్లో తెల్లకాగితాలపై చేసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాలు(సాదాబైనామా) క్రమబద్ధీకరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున సమస్యలు నెలకొన్నాయని సమాచారం. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్వోఆర్-2025 భూభారతి చట్టం అమల్లో భాగంగా తొలుత 4 జిల్లాల్లోని ఒక్కో మండలంలో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. దీనికోసం ఏప్రిల్ 17 నుంచి 30 వరకు రెవెన్యూ సదస్సుల పేరుతో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి భూ యజమానుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా అర్జీల్లో చాలామేర సాదాబైనామా సమస్యలే ఉన్నాయని తెలుస్తోంది.
11,630 దరఖాస్తులు :
4 జిల్లాల్లో మొత్తం 11,630 దరఖాస్తులు వచ్చాయి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో 1,341, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 2,618, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 3,702, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో 3,969 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో సాదాబైనామా సమస్య పరిష్కరించాలంటూ 2,796 దరఖాస్తులు అందినట్లు రెవెన్యూశాఖ వెల్లడించింది. పాసుపుస్తకాల్లో విస్తీర్ణాల హెచ్చుతగ్గులు, అచ్చుతప్పులు, డిజిటల్ సంతకం తదితర సమస్యలకు సంబంధించి 3,446 దరఖాస్తులు అన్నింటినీ ఏరోజుకారోజు కంప్యూటర్లలో నమోదు చేసిన అధికారులు జూన్ రెండో తేదీలోపు ఈ మండలాల్లోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు.
ఈనెల 5 నుంచి మిగిలిన 28 జిల్లాల్లోనూ :
భూభారతిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పైలట్ మండలాల్లో రోజుకు రెండు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బృందాలు సదస్సులు నిర్వహించారు.తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో రెండు బృందాలు పాల్గొన్నాయి. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో రెవెన్యూశాఖ ప్రణాళిక రూపొందించింది.
ఈ మేరకు ఈ నెల 5 నుంచి మిగిలిన 28 జిల్లాల్లోనూ ఒక్కో మండలం చొప్పున పైలట్ ప్రాజెక్టుగా తీసుకునేందుకు నిర్ణయించింది. భూభారతి చట్టంతో రైతుల సమస్యల పరిష్కారానికి వీలుగా ఉన్న సెక్షన్లపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏప్రిల్ 17-30 మధ్య సదస్సులు (హైదరాబాద్ జిల్లా మినహా) నిర్వహించారు. బుధవారం నాటికి 555 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తిచేసినట్లు రెవెన్యూశాఖ తెలిపింది. మంత్రి పొంగులేటి 45 సదస్సుల్లో పాల్గొన్నారు.
ప్రజల నుంచి అనూహ్య స్పందన :
రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో తీసుకొచ్చిన భూభారతి చట్టం విప్లవాత్మక మార్పునకు నాంది పలకనుందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదగా గత నెల 14న ప్రారంభమైన చట్టంపై ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ఈ చట్టం ఉందన్నారు.కొత్త చట్టంతో జిల్లాల్లో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ధరణితో వారు అనుభవించిన బాధలను సదస్సుల్లో మంత్రి పొంగులేటి వ్యక్తం చేశారు. ఇకపై ఏ రైతూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా రెవెన్యూ కార్యాలయంలోనే సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. ప్రజల వద్దకే అధికారులు వచ్చి పైసా ఖర్చు లేకుండా పరిష్కరించే విధానం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. పైలట్ ప్రాంతాల్లో కోర్టుల్లో ఉన్న సమస్యలు కాకుండా మిగిలినవన్నీ జూన్ 2 నాటికి పరిష్కరిస్తామన్నారు. చట్టం తీసుకొస్తే సరిపోదన్నారు. అది పూర్తిస్థాయిలో అమలైనప్పుడే రైతులకు నిజమైన న్యాయం లభిస్తోందన్నారు. ఆదిశగా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
COMMENTS