ATM SAFETY PRECAUTIONS
ఏటీఎం దగ్గర మీ డబ్బులు తీస్తామని ఎవరైనా అన్నారా? - అలాంటి మాటలు నమ్మారో మునిగిపోయినట్లే.
డబ్బు విత్‌డ్రా చేసేందుకు ఏటీఎం దగ్గరికి వెళుతున్నారా? - కార్డు ఎప్పుడైనా యంత్రంలో ఇరుక్కుందా? - కార్డు వచ్చినా డబ్బులు రాలేదా? - అయితే మోసపోతున్నట్లు లెక్క.
ATM Card Frauds : ఎంత డిజిటల్ చెల్లింపులు పెరిగినా లిక్విడ్ క్యాష్ అనేది కూడా అవసరమే. డబ్బులు విత్‌డ్రా చేసేందుకు అందరూ ఏటీఎం వద్దకే వెళతారు. అక్కడ కొన్నిసార్లు అనూహ్యంగా కార్డు యంత్రంలో ఇరుక్కుపోతుంది. ఒకవేళ కార్డు బయటకు వచ్చినా సరే డబ్బులు రావు. మరోచోట ప్రయత్నిద్దామని అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఖాతా నుంచి సొమ్ము విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వస్తుంది. దీంతో కంగుతిని ఏం చేయాలో తెలియక కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు, మరికొందరు అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోతుంటారు.
హైదరాబాద్ మహానగరంలో నిత్యం ఎంతో మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. అలాగని ఇదేమీ సాంకేతిక సమస్య కాదు. ఇదంతా రాజధానిలోని ఏటీఎంల వద్ద మాటు వేసిన కేటుగాళ్ల నయా దందా. ఏటీఎం దగ్గర విత్‌డ్రా చేసుకునేవారికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ పిన్ తెలుసుకుని డెబిట్ కార్డులు కాజేస్తున్నారు. సాంకేతిక కారణాలతో డబ్బులు రావడం లేదని చెప్పి వేరే చోటులో డబ్బులు తీసుకోవాలని చెబుతూ మోసం చేస్తున్నారు. అక్కడి నుంచి బాధితులు వెళ్లిపోగానే డబ్బు డ్రా చేసుకుని అక్కడి నుంచి మాయం అయిపోతున్నారు. ఇలాంటి మోసాలకు ప్రయత్నిస్తున్న నేరగాళ్ల జాబితాను సిద్ధం చేసి పోలీసులు వెతుకుతున్నారు.
నగర శివార్లే వారి టార్గెట్ :
జల్సాలు, చెడు అలవాట్లకు బానిసైన కొందరు యువకులు ఏంటీఎం దగ్గర మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలు, జనం రద్దీ, భద్రత తక్కువగా ఉండే ఏటీఎంల దగ్గర ఎక్కువగా ఈ తరహా మోసాలు నమోదు అవుతున్నాయి. వీరిలో ఎక్కువగా బాధితులు వృద్ధులు, మధ్య వయసు ఉన్న మహిళలే ఉంటున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి :
డబ్బు డ్రా చేసేందుకు ఏటీఎంలకు వెళ్లినప్పుడు అపరిచిత వ్యక్తులు సాయం చేస్తామంటే వారి మాటలు నమ్మవద్దు.
పిన్, సీవీవీ నంబరు వంటివి ఎవరితోనూ షేర్ చేయకూడదు.
పిన్ ఎంటర్ చేసేటప్పుడు ఇతరులకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
డబ్బు తీసుకున్నాక ఖాతాలోని నగదు నిల్వ, లావాదేవీల వివరాలను పరిశీలించాలి.
విత్‌డ్రా చేసిన తర్వాత డబ్బులు బయటకు రాకపోయినా, ఇతర సమస్యలు ఏమైనా గుర్తించినా వెంటనే బ్యాంకును సంప్రదిస్తే ఉత్తమం.
ఉదాహరణలు :
తిరుమల గిరి పోలీసులు తాజాగా ఇద్దరు మోసగాళ్లను అరెస్టు చేశారు. వారు ఏటీఎంలో వినియోగదారులు డబ్బు డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నోట్లు బయటకు రాకుండా డిస్పెన్సర్‌కు టేపు అతికించారు. సమస్య ఉందనుకొని వినియోగదారులు వెళ్లిపోతారు. ఆ తర్వాత నిందితులు టేపు తొలగించి నగదును తీసుకుంటారు. నిందితులు ఇలా 12 సార్లు ఈ తరహా మోసాలకు పాల్పడ్డాక అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
శంషాబాద్‌లో ఓ వ్యక్తి ఏటీఎం నుంచి డబ్బు తీసేందుకు ప్రయత్నించగా సాయం చేస్తానంటూ నేరగాడు నమ్మించి పిన్ తెలుసుకున్నాడు. మాటలతో మభ్యపెట్టి కార్డు కొట్టేశాడు. డబ్బు రావడం లేదని ఇంకోచోట ప్రయత్నించాలని చెప్పాడు. ఖాతాదారుడు వెళ్లిపోగానే రూ.15 వేలు విత్‌డ్రా చేసుకొని అక్కడి నుంచి పరారీ అయ్యాడు.
COMMENTS