VOTER REGISTRATION PROGRAMME
మీకు 18 ఏళ్లు నిండాయా? - వెంటనే ఈ కార్డుకు అప్లై చేసుకోండి
రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు నమోదు కార్యక్రమం - స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నమోదుకు ఆసక్తి.
New Voters Registration : ఏప్రిల్ 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు నమోదు చేసుకునే కార్యక్రమం ప్రారంభమైంది. కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో యంత్రాంగం ఆ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమైంది. రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఓటర్లను నమోదు చేయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వార్డు, డివిజన్ స్థాయిలో ఉండే ఆయా పార్టీల నాయకులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఓట్ల నమోదుపై ముఖ్యంగా దృష్టి సారించారు.
ఇక ఏటా నాలుగు సార్లు :
గతంలో అయితే ఏటా జనవరిలో మాత్రమే కొత్త ఓటర్ల నమోదుకు ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరులో ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఈనెలలో చేపట్టే కార్యక్రమాలకు ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. వీటన్నింటికీ తోడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తగు సూచనలు స్వీకరించడమే కాకుండా ఓటరు నమోదుకు సంబంధించిన నిబంధనలు గురించి వివరించారు.
ఏ విధంగా నమోదు చేసుకోవాలి :
18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు బూత్‌స్థాయి అధికారి వద్ద లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పుడు దీనిపై మండల స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో ఉన్నవారు అక్కడికి ఓటు బదిలీ చేసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు జాబితాలో మహిళలే ఎక్కువగా నమోదు అయ్యారు.
ఈసారి కూడా వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
యువత ఓటు నమోదుకు ముందుకు రావాలని, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
COMMENTS