VILLAGERS TAKE LOAN FROM HANUMAN
ఆ ఊరంతా అప్పుల అప్పారావులే! ఎక్కడ లోన్ తీసుకుంటారో తెలిస్తే షాక్!!
దేవుడి వద్ద అప్పులు చేస్తున్న గ్రామస్థులు- 25 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
Villagers Take Loan From Hanuman : మనలో చాలా మంది సాధారణంగానే అప్పు తీసుకోవడానికి ఆలోచిస్తుంటారు. అప్పు ఉండడం ఎందుకని అనేక మంది వెనకడుగు వేస్తుంటారు. కానీ, ఈ ఊరిలో మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్పులు చేస్తుంటారు. అది కూడా వ్యక్తులు, బ్యాంకులు వద్ద కాదు. ఏకంగా హనుమంతుడి వద్దే అప్పు చేస్తుంటారు ఇక్కడి గ్రామస్థులు. ఇంకా తీసుకున్న అప్పుకు తప్పనిసరిగా వడ్డీ కూడా చెల్లిస్తుంటారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుందో తెలుసా?
మధ్యప్రదేశ్లోని రత్లాంకు సమీపంలోని బిబ్రౌడ్ గ్రామంలో హనుమంతుడి వద్ద అప్పు తీసుకోవడాన్ని మంచిదని భావిస్తుంటారు. ఈ సంప్రదాయం గత 25 ఏళ్లుగా కొనసాగుతుంది. గ్రామస్థులకు ఎవరికైనా సరే కనీసం రూ.3,000 నుంచి గరిష్టంగా 7వేల వరకు ఇస్తుంటారు. ఇంకా గ్రామస్థులు హనుమంతుడి వద్ద తీసుకున్న రుణాలను తప్పనిసరిగా తీరుస్తుంటారు. తీసుకున్న అప్పును ఏడాదిలోపు కచ్చితంగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. దీని పర్యవేక్షణకు గ్రామస్థులంతా కలిసి ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ నిర్వహణకు ఉపయోగిస్తుంటారు.
"25 ఏళ్ల క్రితం ఆలయంలో హోమయాగాల కార్యక్రమం నిర్వహించగా చాలా ఆదాయం వచ్చింది. అయితే, ఈ నగదును ఎక్కడా ఖర్చుచేయకుండా గ్రామస్థులకే రుణం ఇవ్వాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఫలితంగా అప్పటి నుంచి గ్రామస్థులకు రుణాలు ఇవ్వడం ప్రారంభమైంది. గ్రామంలో చాలా మంది హనుమంతుడి వద్ద అప్పు తీసుకుని ప్రారంభిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని భావిస్తారు."
--కైలాశ్ గుర్జార్, ఆలయ కమిటీ అధ్యక్షుడు
కేవలం గ్రామస్థులకే అవకాశం
"హనుమంతుడి వద్ద నుంచి తీసుకున్న అప్పుతో ఎంతో ఐశ్వర్యం కలుగుతుంది. వ్యాపారం, వాణిజ్యం అభివృద్ధి చెందింది. ఫలితంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ అప్పు చేసేందుకు వస్తుంటారు." అని గ్రామస్థుడు శాంతిలాల్ తెలిపారు. మరోవైపు దీనిని గమనించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హనుమంతుడి వద్ద అప్పు తీసుకునేందుకు వస్తున్నారు. కానీ, ఈ అవకాశం కేవలం బిబ్రౌడ్ గ్రామస్థులకు మాత్రమే ఉందని నిర్వాహకులు స్పష్టం చేశారు.
COMMENTS