If you give a vehicle to minors, that's all.. New traffic rules come into force in Hyderabad
Traffic Rules: మైనర్లకు వాహనం ఇస్తే ఇక అంతే.. హైదరాబాద్‌లో అమల్లోకి నూతన ట్రాఫిక్ నియమాలు
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు బాగా పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొంత వరకు మైనర్లు వాహనాలను నడపడం వల్ల జరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మైనర్లకు వాహనాలు ఇచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీన్ని అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. ఇప్పటిదాకా అమల్లో ట్రాఫిక్ నిబంధనలు మార్చి కొన్ని కీలక సవరణలు చేశారు.
హైదరాబాద్ నగర రోడ్లపై మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతటా ఈ ప్రమాదకరమైన పద్ధతిని అరికట్టడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం నుంచి ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ డ్రైవ్ సమయంలో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన రిజిస్ట్రేషన్ రద్దుతో సహా ఉల్లంఘనదారులపై అవసరమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు వాహనం నడపడాన్ని నిషేధించారు. మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే వాహన యజమాని, సాధారణంగా తల్లిదండ్రులు లేదా నమోదిత యజమాని కూడా జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. అలాగే వారు పోలీసులు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
వాహనాలు నడుపుతూ మైనర్లు పట్టుబడితే 1988 ఎంవీ చట్టంలోని సెక్షన్ 199ఏ ప్రకారం బాల నేరస్థులకు జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. అలాగే వాహన రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు చేస్తామని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఇది కాకుండా బాల నేరస్థుడికి 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు లెర్నర్స్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హత ఉండదని తెలిపారు.
జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్), డి జోయెల్ డేవిస్ తల్లిదండ్రులు, సంరక్షకులు తమ మైనర్ పిల్లలకు వాహనాలు నడపేందుకు ఇవ్వద్దని అభ్యర్థించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా చట్టాలను ఉల్లంఘించేవారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
COMMENTS