TOOTHBRUSH IN BATHROOM
టూత్‌బ్రష్ బాత్రూమ్లోనే పెడుతున్నారా? - అర్జెంటుగా ప్లేస్ మార్చకపోతే ప్రమాదమట!
బాత్రూంలో టూత్‌బ్రష్‌లు పెడుతున్నారా? - 70 శాతం ప్రమాదకరమైన వైరస్లు, బ్యాక్టీరియా బాత్రూంలోనే - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం.
Toothbrush in Bathroom : కొందరు బ్రష్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడపడితే అక్కడ మరిచిపోతుంటారు. ముఖ్యంగా బాత్రూంలో పళ్లు తోముకుని, అక్కడే బ్రష్‌ను విడిచిపెట్టి గబగబా స్నానం చేసి వచ్చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ప్రమాదంలో పడి ఆరోగ్యం దెబ్బ తింటుందన్న విషయం మరిచిపోతుంటారు. టూత్ బ్రష్‌ల నిర్వహణలో పలు జాగ్రత్తలు తీసుకోపోతే తీవ్ర నష్టమే జరుగుతుందని మిర్యాలగూడకు చెందిన దంత వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ హెచ్చరిస్తున్నారు.
పళ్లు తోమడం అనేది ప్రతి ఒక్కరి రోజు వారీ ప్రక్రియల్లో సాధారణమైన అంశమేనని, కానీ దంత ఆరోగ్యానికి, చక్కని చిరునవ్వుకు ఉపయోగపడేలా ఒక క్రమ పద్ధతిలో జాగ్రత్తలు పాటిస్తూ పళ్లను తోమాలని ఆయన సూచిస్తున్నారు. టూత్ బ్రష్‌ల నిర్వహణలో డాక్టర్ నాగేశ్వర్ పలు సలహాలు అందించారు. ఇప్పుడు అవేంటో ఒకసారి చూద్దాం.
టూత్ బ్రష్‌ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
టూత్ బ్రష్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూమ్లలో ఉంచకూడదు. ఎందుకంటే ఇంట్లో కంటే బాత్రూమ్లలోనే 70 శాతం అదనంగా ప్రమాదకర వైరస్లు, బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇలా బాత్రూంలలో బ్రష్‌లను ఉంచడం వల్ల బ్యాక్టీరియా బ్రష్‌ల ద్వారా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.
జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి అంటువ్యాధుల బారి నుంచి కోలుకున్న తర్వాత బ్రష్‌లను కచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. లేదంటే ఆయా వ్యాధుల వైరస్లు, బ్యాక్టీరియా పాతవాటిపై ఉండి మళ్లీ అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
రూట్ కెనాల్ వంటి దంత చికిత్సలు చేయించుకున్న తర్వాత పాత బ్రష్‌లను మార్చాలి. ఎందుకంటే చికిత్స చేసిన ప్రాంతంలో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి కొత్త టూత్ బ్రష్ వాడటం ఉత్తమమైనది.
బ్రష్‌ను వారానికోసారి వేడి నీటితో శుభ్రం చేయడం వల్ల దానిపై బ్యాక్టీరియా, వైరస్లు చేరకుండా కాపాడుకోవచ్చు.
ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకోసారి బ్రష్‌ను మార్చాలి. లేదంటే అది అరిగి, చిగుళ్లు దెబ్బతినే ప్రమాదం కూడా పొంచి ఉంది.
చిన్నపిల్లలు వాడే బ్రష్‌లను రెండు నెలలకోసారి మార్చాలి. ఎందుకంటే వీటిని పిల్లలు నమలడం, కొరకడం వంటివి చేస్తుంటారు. దీంతో వాటి నాణ్యత కోల్పోయి పళ్లకు హాని కలిగించే ప్రమాదం ఉంటుంది.
టూత్‌బ్రష్‌లను ఎక్కడిపడితే అక్కడ పెట్టకుండా ఉంచాలి.
COMMENTS