THINGS STUDENTS DO IN SUMMER
వేసవి సెలవులు - ఈ 50 రోజుల్లో ఇలా చేస్తే బంగారు భవితకు బాటలు.
పాఠశాలలకు వేసవి సెలవులు - ఈ 50 రోజులను సద్వినియోగం చేసుకోవాలి అంటున్న నిపుణులు.
Students Should Use Summer Holidays for Future : స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చాయి. సమయం దొరికితే చాలు విద్యార్థులు ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతుంటారు. అవే కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు, మెదడుకు పదును పెట్టేందుకు ఈ 50 రోజులను సద్వినియోగం చేసుకుంటే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. బంధాలు, అనుబంధాల విలువ తెలుసుకునేందుకు, జీవితాలను మార్చే పుస్తకాలను చదివేందుకు, జ్ఞాన సముపార్జనకు న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటుగా మార్చుకునేందుకు వేసవి సెలవులు ఉపయోగపడతాయని స్పష్టం చేస్తున్నారు.
అనుబంధాల గురించి తెలియజేయాలి :
నిత్యం నిద్ర లేవగానే కాలంతో పాటు కుటుంబమంతా పరుగెత్తాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఆప్యాయత, అనుగారాలు, బంధాలు, అనుబంధాలకు తావే లేకుండా పోతుంది. వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బంధాలు, అనుబంధాల గొప్పదనాన్ని చెప్పొచ్చు. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లవచ్చు. ఉమ్మడి కుటుంబాలు, సామూహిక వేడుకలు జరుపుకోవచ్చు. విహార యాత్రలకు వెళ్లవచ్చు.
కొత్త ప్రదేశాలకు వెళ్లటం వల్ల అనేక చారిత్రక విషయాలను తెలుసుకునే అవకాశముంటుంది. సంప్రదాయాలు, సంస్కృతులను తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఉదయం, సాయంత్రం పూట ఆరు బయట స్నేహితులతో కలిసి ఆటలు ఆడుకోవాలి. సామాజిక సేవాగుణం అలవర్చుకునేందుకు స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. సంగీతం, నృత్యం ఇతర వాటిలో శిక్షణ తీసుకునేందుకు వేసవి సెలవులు చక్కగా ఉపయోగపడతాయి.
పదో తరగతి విద్యార్థులు చేయాల్సినవి ఇవి :
10వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఈ 50 రోజులు అత్యంత కీలకమైన సమయం. లక్ష్యం వైపు తొలి అడుగు వేసేందుకు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇంటర్‌లో ఏ కోర్సు తీసుకోవాలి, లక్ష్యం వైపు పయనించేందుకు ఎలాంటి కాలేజీని ఎంచుకుంటే బాగుంటుంది అనే అంశాలను శోధించాలి. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు మరింత జాగరూకతతో వ్యవహరించాలి. తదుపరి ఏ కోర్సు చదివితే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి, లక్ష్యం దిశగా అడుగులు సజావుగా పడాలంటే ఎలాంటి నైపుణ్యాలను నేర్చుకోవాలి అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి.
నేటి పిల్లలు, యువతకు కష్టసుఖాల విలువ తెలియటం లేదు. బంధాలు, కుటుంబ బాంధవ్యాలపై కనీస అవగాహన లేకుండా పోతుంది. అందుకే తల్లిదండ్రులు ఈ అంశాలపై దృష్టి సారించాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. పిల్లలను అమ్మమ్మ, నానమ్మల ఇళ్లకు తీసుకెళ్లి, కొన్నాళ్ల పాటు వారితో ఉండేలా చూడాలి. పిల్లలు చెడు వ్యసనాల బారినపడకుండా వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలి. ఆసక్తి ఉన్న ఆటల్లో శిక్షణ ఇప్పించాలి.
సబ్జెక్టులపై దృష్టి :
ఇప్పుడంతా కంప్యూటర్ యుగం నడుస్తుంది. కంప్యూటర్ కోర్సులు అభ్యసించేందుకు వేసవి సెలవులను వినియోగించుకోవాలి. సాధ్యమైనంత వరకు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ వాడినా కెరియర్‌కు ఉపయోగపడేలా చూసుకోవాలి. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో పట్టు సాధించేందుకు రోజూ కాస్త సమయం కేటాయించి ప్రాక్టీస్ చేయిస్తుండాలి.
COMMENTS