SURYA GHAR SCHEME IN TELANGANA
ఈ కేంద్ర ప్రభుత్వ స్కీములో రూ.60వేల రాయితీ - వెంటనే వివరాలు తెలుసుకోండి.
సూర్య ఘర్ ముఫ్తి బిజిలీ యోజన పథకం - ప్రతి ఇంటికి సౌర వెలుగులు - 2 కిలోవాట్లపై రూ.60వేల రాయితీ
Surya Ghar Scheme : సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన పథకం ద్వారా సౌర విద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటే, ఇంటింటా సౌర విద్యుత్ కాంతులు విరజిమ్మడం కష్టమేమీ కాదు. పైదా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించి లాభాలు కూడా అర్జించవచ్చు. దీంతో నెలనెలా కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ పథకం కింద గరిష్ఠంగా 3 కిలో వాట్ల ప్రాజెక్టుల వరకు కేంద్రం రాయితీ ఇస్తుంది. ఇలా కేంద్రం ఇచ్చిన రాయితీ పోనూ, మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకునే వీలు సైతం ఉంది.
ఈ సూర్యఘర్ ముఫ్తి బిజిలీ పథకం గురించి జాతీయ పోర్టల్‌లోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థల వివరాలను కేంద్రం అందుబాటులో సైతం ఉంచింది. 2 కిలోవాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు సుమారు రూ.1.10 లక్షలు(ఇన్‌స్టలేషన్ ఛార్జీలతో కలిపి) ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఇందులో కేంద్రం ఇచ్చే రాయితీ రూ.60 వేలు కాగా, మిగిలిన రూ.50 వేలు వినియోగదారులు భరించాలి. 2 కిలోవాట్ల ప్రాజెక్టు ద్వారా నెలకు సుమారు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా.
అందులో ఇంటి అవసరాలకు వాడుకొనగా మిగిలినది గ్రిడ్‌కు వెళుతుంది. ఇలా ప్రతినెలా గ్రిడ్‌కు అందించిన విద్యుత్‌ను లెక్కించి, డిస్కంలు యూనిట్‌కు రూ.2.09 చొప్పున వినియోగదారులకు చెల్లించనున్నాయి. ఆ ప్రాజెక్టులను డిస్కంలే సబ్‌రెస్కో(రూరల్ ఎలక్ట్రిక్ సఫ్లై కంపెనీ)ల మాదిరిగా పర్యవేక్షిస్తాయి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ముందుగా వినియోగదారులు జాతీయ పోర్టల్‌లోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో కరెంటు బిల్, బ్యాంకు వివరాలు, చిరునామా నమోదు చేయాలి.
రూ.1000 ఫీజు చెల్లించి డిస్కంకు దరఖాస్తు సమర్పించాలి.
రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎం-ప్యానల్ చేసుకున్న కంపెనీల వివరాలు అందులో కనిపిస్తాయి. వాటిలో ఒక కంపెనీని ఎంచుకోవాలి. వెండార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాక రాయితీ పోనూ, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా పొందే ఆప్షన్‌ను అక్కడ ఎంచుకోవచ్చు.
దేశీయంగా తయారైన సోలార్ ప్యానళ్లను వాడిన వారికే సబ్సిడీ అనేది అందుతుంది.
ప్రాజెక్టు ఏర్పాటు పూర్తయ్యాక ఫొటోలు అప్‌లోడ్ చేయాలి.
వాటి పరిశీలన తర్వాత డిస్కంలు స్మార్ట్‌మీటర్‌ను సమకూరుస్తాయి.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక 15 రోజుల్లో కేంద్రమిచ్చే రాయితీ సొమ్ము వినియోదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
డిస్కంలు ఇచ్చే స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతినెలా గ్రిడ్‌కు ఎంత కరెంటు అందుతుందో తెలుసుకోవచ్చు.
ఒకవేళ ఈ ప్రాజెక్టుల ద్వారా తక్కువ విద్యుత్ ఉత్పత్తి అయినా, వినియోగదారులకు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత పద్ధతిలోనే కరెంటు వాడుకోవచ్చు.
COMMENTS