SIDDIPET MAN AIRPLANE MAKING
బ్యాటరీలతో ఎగిరే విమానం! - సిద్దిపేట యువకుని సాహస ప్రయత్నం.
విమానం తయారు చేసిన సిద్దిపేట యువకుడు - కీలక దశకు చేరుకున్న విమాన తయారీ.
Siddipet Man Airplane Making : సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు విమానం తయారు చేసి ఎగురవేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడి ప్రయత్నాలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. సుమారు 20 అడుగుల ఎత్తుకు ఎగురవేసి, 40 మీ. వరకు ముందుకు సాగేలా చేశాడు. అతడే బాసంగారి లక్ష్మీనరసింహ. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివర ఏడాది ఇంజినీరింగ్ చదువుతూ, తన నైపుణ్యానికి పదును పెడుతున్నాడు. గతేడాది మేలో ఒకసారి ట్రయల్ చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మరిన్ని మార్పులతో శనివారం జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతంలో మరోమారు ప్రయత్నించాడు. రెక్కలో మార్పులు చేసి, బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచి తను అనుకున్న ఫలితాన్ని అందుకున్నాడు. హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న లక్ష్మీనరసింహ చిన్నప్పటి నుంచే బ్యాటరీ ఆధారంగా నమూనాల రూపకల్పనను ఆసక్తిగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఇలా నమూనా విమానాన్ని తయారు చేసి దాన్ని కొంత వరకు ఎగిరించాడు.
విమాన తయారీకి రూ.1.50 లక్షలు :
ఆ యువకుడు ఏడాదిగా శ్రమిస్తూ విమానం ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. సుమారు ఆరున్నర కిలోల బరువున్న నమూనా తయారీకి డెప్రాన్ షీట్స్‌ను వినియోగించారు. ఆరు చిన్నపాటి టైర్లు, నాలుగు చొప్పున ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్, సర్వో, ప్రొపెల్లర్స్, మోటార్లు సహా రెండు లిథియం పాలీమర్ బ్యాటరీలు, పాలీ కవర్, రేడియం స్టిక్కర్స్, టేకు కలప వినియోగించారు. రూ.1.50 లక్షలు వెచ్చించి ఈ విమానాన్ని తయారు చేశారు. తాజా ప్రయత్నంలో కొంతదూరం ఎగిరి ముందుకు సాగింది.
నెలాఖరుకు కచ్చితంగా పూర్తిస్థాయిలో ఎగురవేస్తా :
బ్యాటరీతో నడిచే ఈ విమానం ట్రాన్స్‌మీటరు ఆధారంగా ఆపరేట్ చేయవచ్చు. ఇటీవల పలు ప్లేస్ నమూనాలు తయారీ చేశానని తెలిపారు. ఇంకా మెరుగుపర్చి ఈ నెల చివర్లో కచ్చితంగా పూర్తిస్థాయిలో ఎగురవేస్తానని లక్ష్మీనరసింహ ధీమా వ్యక్తం చేశారు.
COMMENTS