SBI YOUTH FOR INDIA FELLOWSHIP 2025
డిగ్రీ పాసైన వారికి SBI బంపరాఫర్ - సెలక్ట్ అయితే రూ.3.37 లక్షలు పొందవచ్చు! - దరఖాస్తుకు మరికొద్ది రోజులే!
"యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025-26"కి దరఖాస్తులు కోరుతున్న ఎస్‌బీఐ - ఎంపికైతే నెలకు రూ.19 వేలు స్టైఫండ్!
SBI Youth for India Fellowship 2025 : డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు మంచి ఫెలోషిఫ్ పొందే అవకాశం కల్పిస్తోంది భారతీయ స్టేట్ బ్యాంక్(SBI). గ్రామాల్లో మార్పు కోసం కృషిచేయాలనుకొనే యూత్ కు ఈ ఛాన్స్ ఇస్తోంది. ప్రతీ సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం పేరు "యూత్ ఫర్ ఇండియా". మరి, ఇందులో భాగమైనవారు ఏమేం పనులు చేయాలి?, ఫెలోషిప్ పొందడానికి ఎవరు అర్హులు? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రామాల స్థితిగతులు, అక్కడి ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై కొన్ని ఎన్జీవోలు, యువతతో అధ్యయనం చేయిస్తూ, వారికి ఆర్థిక తోడ్పాటు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే 2025-26 సంవత్సరానికి అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది ఎస్‌బీఐ. ఈ ఫెలోషిప్ వ్యవధి 13 నెలలు. అంటే, ఎంపికైన అభ్యర్థులు గ్రామీణ సమస్యలపై 13 నెలలపాటు పని చేయాల్సి ఉంటుంది.
అర్హతలు :
దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఏదైనా డిగ్రీలో (2025, అక్టోబర్ ఒకటి నాటికి) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఏజ్ విషయానికొస్తే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే రోజుకు సదరు అభ్యర్థి వయసు 21 - 32 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో మమేకం కావాలనుకొనే వారికి ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తారు.
ఎందుకంటే ఫెలోషిప్ టైమ్‌లో అభ్యర్థులు పల్లెటూర్లలో పర్యటించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే?
భారతీయ స్టేట్ బ్యాంక్(SBI) "యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్" ప్రోగ్రాంకు ఎంపికయ్యే అభ్యర్థుల ప్రక్రియ దశల వారీగా ఉంటుంది.
రిజిస్ట్రేషన్ అండ్ ఆన్‌లైన్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక చేస్తారు.
ముందుగా అభ్యర్థులు తమ వివరాలతో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
రెండో స్టేజ్‌లో సెలక్షన్ బోర్డు అడిగే అంశాలపై ఆన్‌లైన్ అసెస్‌మెంట్ అందించాల్సి ఉంటుంది. అందులో గ్రామీణాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అభ్యర్థి సూచనలను అడుగుతారు.
అనంతరం సెలక్షన్ బోర్డుతో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. వీటన్నింటి ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్‌తోపాటు ప్రోగ్రామ్ వివరాలు, ఫెలోషిప్‌లో నిబంధనలతో కూడిన వివరాలను అందజేస్తారు. అంతకముందు ఓరియంటేషన్ కార్యక్రమం కూడా కల్పిస్తారు.
స్టైఫండ్ వివరాలిలా :
SBI ఫెలోషిప్‌కి ఎంపికైన వారికి వసతి కోసం నెలకు రూ.16,000 చొప్పున స్టైఫండ్ అందిస్తారు.
అలాగే, స్థానికంగా ప్రయాణ ఖర్చులకు 2 వేల రూపాయలు, ప్రాజెక్టు సంబంధిత ఖర్చుల కోసం నెలకు మరో రూ.1000 చొప్పున చెల్లిస్తారు.
అదేవిధంగా, ఫెలోషిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇతర అలవెన్సుల రూపంలో రూ.90,000 అందజేస్తారు. అంటే, ఎంపికైన అభ్యర్థులు మొత్తంగా 13 నెల ఇంటర్న్‌షిప్ ఫెలోషిప్ కింద రూ.3,37,000 స్టైపెండ్ పొందవచ్చు.
సెలక్ట్ అయిన అభ్యర్థులకు తమ ఇంటి నుంచి బయల్దేరడం మొదలు ప్రాజెక్టు చేసే ప్రదేశానికి చేరుకొనే వరకు ప్రయాణానికి 3ఏసీ రైలు ఛార్జీల ఖర్చులు, శిక్షణా కార్యక్రమాల కోసం ప్రయాణాలకు అవసరమైన ఖర్చుల్ని సైతం చెల్లిస్తారు.
వైద్య, వ్యక్తిగత ప్రమాద బీమా ఫెసిలిటీ కూడా ఈ ఫెలోషిప్‌లో ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ : ఈ ఫెలోషిప్‌నకు అప్లై చేసుకోవడానికి "ఏప్రిల్ 30" చివరి తేదీగా ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన వారికి గ్రామీణాభివృద్ధి కోసం ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియాతో కలిసి పనిచేసే ఎన్జీవోలు దిశానిర్దేశం చేస్తాయి. అంతేకాదు, క్షేత్రస్థాయిలో తమకు అప్పగించిన పనిని అభ్యర్థులు అర్థం చేసుకోడానికి కూడా ఎన్జీవో కేంద్రాలు హెల్ప్ చేస్తాయి. అనంతరం ప్రోగ్రామ్ లక్ష్యానికి అనుగుణంగా ఎంపికైన అభ్యర్థులు కృషి చేయాల్సి ఉంటుంది.
COMMENTS