SAFETY PRECAUTIONS FOR AIR COOLER
కూలర్లు వాడేవారికి హెచ్చరిక - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోతాయ్!
వేసవిలో ఎయిర్ కూలర్లు వాడుతున్నారా? - అవి ఇనుముతో చేసినవా? - అయితే ప్రాణాలు పోతాయ్ ఈ జాగ్రత్తలు పాటించకపోతే
Safety Precautions for Cooler : అసలే వేసవి కాలం. ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మధ్య తరగతి వారు ఎక్కువగా కూలర్లను వినియోగిస్తారు. కానీ ఇవే ప్రమాదకరంగా మారి చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఎందుకంటే పిల్లలకు వేసవి సెలవులు కావడంతో వారంతా ఇంటి దగ్గరే ఉంటూ ఆటలాడుతుంటారు. వీరు అనుకోకుండా కూలర్లను ముట్టుకొని విద్యుదాఘాతానికి గురవుతున్నారు. అందుకే కూలర్లు పాతబడినప్పుడు వాటిని రిపేర్‌కు తీసుకెళితే ఉత్తమం.
చాలా మంది వినియోగదారులు ఇంటి బయట కిటికీకి అమర్చుకోవడానికి సులువుగా ఉంటుందని ఇనుప కూలర్లను ఏర్పాటు చేసుకుంటారు. వాస్తవానికి ఇతర కూలర్లతో పోల్చితే ఇలాంటి వాటి ధర కూడా కాస్త తక్కువగా ఉండటంతో వీటిని తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వీటిని ఒక్క సీజన్లో వినియోగించగానే పెయింట్ కోటింగ్ పోయి ఇనుము తుప్పుపట్టడం, విద్యుత్ తీగలు దెబ్బతినడం వంటివి జరిగి కూలర్‌లోకి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ విషయాన్ని గమనించక చాలా మంది విద్యుదాఘాతానికి గురవుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పిల్లలతో పాటు పెద్దలకూ వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదనే విషయం గుర్తించాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే విద్యుదాఘాతం ఉండదు :
ఇనుప కూలర్ వాడేవారు ఒక ఏడాది వినియోగించిన తర్వాత వాటిని విప్పి పెయింట్ వేయాలి.
అందులోని విద్యుత్ తీగలు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి
కనెక్షన్ ఇచ్చినప్పుడు కూలర్ ఇనుముకు విద్యుత్ సరఫరా అవుతుందా లేదా అని టెస్టర్‌తో చెక్ చేసుకోవాలి.
ఐదేళ్లు దాటిన వాటిని వాడకపోవడమే మంచిది.
చిన్నారులు ఉన్నచోట మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇనుప వస్తువుల నుంచి విద్యుత్తు తొందరగా సరఫరా అవుతుంది. ఇదే విద్యుదాఘాతానికి చాలాసార్లు కారణం.
ఏం కాదులే అనే ధోరణిని వదిలి, విద్యుత్ పరికరాలను సరిచూసుకోవాలి.
వేసవిలోనే కూలర్ విద్యుదాఘాతాలు ఎక్కువగా జరుగుతాయి.
కూలర్‌తో చనిపోయిన ఘటనలు :
గతేడాది వేసవి సెలవుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గంగాస్థాన్‌కు చెందిన దంపతుల ఆరేళ్ల కుమార్తె ఆర్మూర్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఆడుకుంటూ వెళ్లి కూలర్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతంతో చిన్నారి మృతి చెందింది.
నిరుడు జూన్‌లో ఆలూర్ గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారిని కూలర్ రూపంలో మృత్యువు కబలించింది. చిన్నారి ఆడుకుంటున్న క్రమంలో కూలర్‌కు తాకడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
COMMENTS