RAJIV YUVA VIKASAM SCHEME
ఫ్రీగా ఇచ్చే ఇన్కమ్ సర్టిఫికెట్ రూ.1000 - ఎక్కడ, ఎందుకో తెలుసా?
తహసీల్దార్ కార్యాలయాల్లో వసూళ్ల పర్వం - రాజీవ్ యువవికాసంలో అక్రమార్కుల తీరు - ఉచితంగా ఇవ్వాల్సిన పత్రాల కోసం రూ.500 నుంచి రూ.1500 వరకు వసూళ్లు.
Bribe for Cast Income Certificate : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించడానికి రాష్ట్రప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. దీనికి ఈనెల 14వ తేదీతో గడువు తేదీ ముగియనుంది. ఇప్పటికే సుమారు 11 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా, గడువు సమీపిస్తుండటంతో ఇంకా చాలా మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవానికి క్యూ కడుతున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రేషన్‌కార్డు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఉంటే సరిపోతుందని సంబంధిత శాఖ తెలిపింది. దరఖాస్తు తేదీ సమీపిస్తుండటంతో చాలా మంది ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ రూ.1000లు ఇస్తే ఇన్కమ్ సర్టిఫికెట్ ఒక్క రోజులోనే ఇస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా వరంగల్, జనగామ, హనుమకొండ జిల్లాల్లోని పలు మండలాల్లో చేతివాటం దందా సాగుతోందని రెండు రోజుల కిందట ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో వారు చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అయినా వారు స్పందించకపోవడం గమనార్హం.
వరంగల్ - ఖమ్మం నేషనల్ హైవేపై ఉన్న ఓ మండల కేంద్రంలో రాజేశ్ అనే యువకుడు ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం మీ సేవ ద్వారా సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. సాధారణంగా వారం రోజులకు ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్‌కు గడువు సమీపిస్తుండడంతో అక్కడి ఆపరేటర్‌కు రూ.1000 ఇచ్చి మీసేవ ద్వారా ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు.
జనగామ జిల్లాలో హైదరాబాద్ - భూపాలపట్నం నేషనల్ హైవేపై ఉన్న ఓ తహసీల్దార్ కార్యాలయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రానికి రూ.1000, కమ్యూనిటీ సర్టిఫికెట్‌కు రూ.500 వరకు కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్, ఆపరేటర్‌లు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోకపోవడంతో బాధితులు కలెక్టరుకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.
ఉచితంగా ఇవ్వాల్సిన పత్రాలు :
నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీ, ఈడబ్ల్యూఎస్ యువకులకు స్వయం ఉపాధి కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్రవ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఏప్రిల్ 14న చివరి గడువు కావడంతో దరఖాస్తు చేసేవారు రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాలని ప్రభుత్వం పేర్కొనడంతో సంబంధిత పత్రాల కోసం అర్హులు మీసేవ ద్వారా అప్లై చేస్తున్నారు. ఇదే అదనుగా మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, పలు తహసీల్దార్ కార్యాలయాలలో ఉండే సిబ్బంది దరఖాస్తుదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన పత్రాల కోసం భారీగా డబ్బులు(రూ.500 నుంచి 1000 వరకు) తీసుకుంటున్నారు.
"నాకు రేషన్ కార్డు లేకపోవడంతో ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీ సేవలో 9వ తేదీన దరఖాస్తు చేశాను. సర్టిఫికెట్ రావడానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో అక్కడ పనిచేస్తున్న ఆపరేటర్‌కు రూ.1000 చెల్లించి మీ సేవ ద్వారా తీసుకొని దానిని దరఖాస్తు చేశాను" -రాజేశ్, హనుమకొండ వాసి
భారీగా స్పందన :
ప్రభుత్వం ప్రకటించిన వివిధ యూనిట్లకు రాయితీలు వర్తిస్తుండటంతో బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ల కింద దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి.
ఒక్క వరంగల్ జిల్లాలోనే బీసీ కార్పొరేషన్ కింద 2357 యూనిట్లను మంజూరు చేసే విధంగా లక్ష్యాన్ని పెట్టుకున్నారు. గురువారం వరకు 16వేల 396 దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్ కింద 3442 యూనిట్లకు గాను 7 వేల 310 దరఖాస్తులు వచ్చాయి.
ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ఈ ఏడాది రూ.186 కోట్లను రాయితీగా ప్రభుత్వం లబ్దిదారులకు అందజేయనుంది. అర్హుల ఎంపికకు జిల్లా స్థాయిలో కమిటీకి కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీవో, పురపాలికల్లో మున్సిపల్ కమిషనర్‌లు ఛైర్మన్‌లుగా ఉంటారు.
ఈ నెల 14న దరఖాస్తుల గడువు ముగిసిన అనంతరం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత అర్హులను ఎంపిక చేయనున్నట్లు వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ తెలిపారు.
COMMENTS