PARENTING TIPS IN TELUGU
సెలవుల్లో పిల్లలపై ఓ కన్నేయండి - లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్‌కు బానిసైపోతారు.
సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు - చెడు స్నేహాలతో దారితప్పే ప్రమాదం.
Parents Should Take to Prevent Children From Addicted to Bad Habits : పది, ఇంటర్ పరీక్షలు పూర్తయి, ఇతర తరగతుల పరీక్షలు పూర్తవుతున్న నేపథ్యంలో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. చెడు స్నేహాలకు అలవాటు పడకుండా చూడాలని, షికార్లు, దురాలవాట్లు ఇతరత్రా అంశాలకులోనై దారితప్పే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. బాల్యంలో క్రమశిక్షణతో చదివి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకునే సమయంలో తప్పటడుగులు వేస్తే జీవితాంతం బాధపడక తప్పదని హెచ్చరించారు. పరిణతి చెందని వయసులో అనాలోచిత నిర్ణయాలతో చెడు ఆకర్షణలకు లోనై జీవితాలు నాశనం చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న క్రమంలో పిల్లల పట్ల అప్రమత్తంగ ఉంటూ వారిని ఓ కంట కనిపెడుతుండాలని నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
సెలవు రోజుల్లో యువకులు ఎక్కువగా స్నేహితులతోనే గడుపుతారు. ఆడుకునేందుకు, చదువుకునేందుకు స్నేహితుల దగ్గరికి వెళ్తున్నామంటూ ఇళ్ల నుంచి బయటకు వెళ్తున్నారు. క్లాస్‌మేట్ల ద్వారా చెడు స్నేహితులతో తిరుగుతున్నారు. ఈ క్రమంలో సరదా కోసం సిగరెట్లు, మద్యం అలవాటు చేసుకొని క్రమంగా మత్తు పదార్థాలను బానిసలుగా మారుతున్నారు. దురలవాట్లకు అలవాటు పడిన యువత ఇంట్లో అబద్దాలు చెప్పి డబ్బులు తీసుకోవడం, బయట అప్పులు చేసి నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
వ్యసనంతో చురుకుదనం కోల్పోయి :
ఎక్కువగా మైనర్లు సెల్‌ఫోన్లకు బానిసలవుతున్నారు. ఇంట్లో ఉన్నా కుటుంబ సభ్యులతో గడపడం తక్కువే. అంతర్జాలం అందుబాటులో ఉండటంతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు వ్యసనపరులుగా మారుతున్నారు. సెల్‌ఫోన్ ఆటల వ్యసనంతో చురుకుదం కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నా యువకులు లెక్క చేయడం లేదు. చాలామంది మైనర్లు సెల్‌ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. సెల్‌ఫోన్లో చూసిన ఈ చిత్రాల ప్రేరణతో అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలూ తారసపడుతూనే ఉన్నాయి. పలువురు యువకులు సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేకమైన పోస్టులు వైరల్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
అమ్మాయిలపై కన్ను :
మైనర్లయిన అమ్మాయిలు, యువతుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాలు, సెల్‌ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో యువకుల పట్ల ఆకర్షణకు లోనై ప్రేమగా భావించి దారితప్పుతున్నారు. కన్నవారి ప్రేమను మరిచి ప్రేమ పేరుతో ప్రియుడితో కలిసి పారిపోతున్న ఘటనలు అనేకం.
ఏదైనా మందలించి చెప్పాలి :
తల్లిదండ్రులు పిల్లలపై ప్రేమ పెంచుకోవడం సహజం. కొన్ని సందర్భాల్లో అతి ప్రేమ, గారాబం వారిని దారితప్పేలా చేస్తాయి. అర్హత, అవసరం లేకపోయినా అడిగిన ప్రతి వస్తువూ కొనివ్వడం, వాహనాలు చేతికి ఇవ్వడం మంచిది కాదు. అది వారిలోని సహజ ఆలోచనలను దెబ్బతీయడమే కాకుండా వారి క్రమశిక్షణ, బాధ్యతలనూ హరిస్తుంది. వారిని నిత్యం ఓ కంట కనిపెడుతూ ఉండాలి. తప్పు చేస్తే సున్నితంగా మందలించి, అందుకు సంబంధించిన కష్ట, నష్టాలను వివరించాలి. సమాజంలోని మంచి, చెడులను మనసును తాకే రీతిలో చెప్పాలి.
COMMENTS