ONE RUPEE DOCTOR IN ODISHA
ఈ డాక్టర్‌ను అభినందించాల్సిందే! ఒక్క రూపాయికే వైద్యం- పొదుపు చేసుకున్న డబ్బుతో ఆస్పత్రి ఏర్పాటు.
ఒక్క రూపాయికే వైద్యం- భర్తలాగే పేదలకు సేవ చేయాలని భార్య నిర్ణయం!
One Rupee Doctor In Odisha : నేటి కాలంలో వైద్య ఖర్చులు సామాన్యులు భరించలేని స్థాయిలో పెరిగిపోయాయి. భవిష్యత్‌లో మరింతగా పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒడిశాకు చెందిన ఓ వైద్యురాలు పేద ప్రజలకు కేవలం ఒక్క రూపాయికే అందించడానికి నడుం కట్టారు. తను పొదుపు చేసుకున్న డబ్బునే పెట్టుబడిగా పెట్టి ఓ దంత వైద్యశాలను ప్రారంభించారు. ఆమే ఒడిశా సంబల్పూర్ జిల్లాకు చెందిన డాక్టర్ శిఖా రామచందాని.
భర్త అడుగుజాడల్లో
'నా భర్త గత నాలుగేళ్లుగా కేవలం ఒక్క రూపాయి ఫీజు తీసుకుని పేదలకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆయనే నాకు స్ఫూర్తి. పేదల సేవకు నన్ను నేను అంకితం చేసుకోవాలనేది మా దివంగత అత్తగారి కల కూడా. ఆ స్ఫూర్తితోనే నేను ఈ వైద్యశాలను ప్రారంభించా' అని శిఖా రామచందాని పేర్కొన్నారు.
పేదల కోసం
డాక్టర్ శిఖా బుర్లాలోని విమ్సార్ వైద్య కళాశాల సమీపంలో, తన అధికారిక నివాసంలోనే దంత వైద్యశాలను ప్రారంభించారు. అక్కడ కేవలం ఒక్కరూపాయికే పేదలకు దంత వైద్యం చేయనున్నట్లు ఆమె చెప్పారు.
ఈ క్లీనిక్‌లో మొదటి పేషెంట్‌గా లహండా గ్రామానికి చెందిన రవీంద్ర సేథ్ చేరారు. ఆయన డెంటల్ స్కేలింగ్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నేడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో దంత చికిత్స చాలా ఖరీదైనదిగా మారిపోయింది. కానీ నేను ఇక్కడ కేవలం ఒక్క రూపాయికి చికిత్స చేశారు. ఈ దంపతుల ప్రయత్నం చాలా ప్రశంసనీయం' అన్నారు.
వైద్య సేవలు మరింత విస్తరిస్తాం!
డాక్టర్ శిఖా చెన్నైలో బ్యాచిలర్ ఆఫ్ డెంటర్ సర్జరీ (బీడీఎస్) పూర్తి చేశారు. ఇప్పుడు తాను పొదుపు చేసుకున్న రూ.3 లక్షలతో ఈ క్లీనిక్ స్థాపించినట్లు తెలిపారు.
'ప్రస్తుతం స్కేలింగ్, క్లీనింగ్, దంతాల తొలగింపు లాంటి ప్రాథమిక దంత చికిత్సలు మాత్రమే అందిస్తున్నాం. త్వరలోనే డెంటల్ ఫిల్లింగ్, క్యాపింగ్, రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్, టూత్ ఇంప్లాంటేషన్ లాంటి సేవలు కూడా అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తున్నాం' అని డాక్టర్ శిఖా అన్నారు.
'నేను నా వ్యక్తిగత పొదుపుతో ఈ క్లీనిక్ ప్రారంభించా. దీనితో నిరుపేదలకు సేవ చేస్తా. మా అత్తగారి కలను నెరవేర్చడానికే ఈ క్లీనిక్ ప్రారంభించాలని అనుకున్నాను. ఎవరి నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోకుండా, సొంత ఖర్చుతోనే పేదలకు వైద్యం చేయాలని ప్రయత్నిస్తున్నాం' అని డాక్టర్ శిఖ పేర్కొన్నారు.
ఆయనే స్ఫూర్తి ప్రదాత
శిఖా భర్త డాక్టర్ శంకర్ రామచందాని. ఆయన వీఐఎంఎస్‌ఏఆర్ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తన తండ్రి పేదరికంతో పడిన ఇబ్బందులను గుర్తుంచుకుని, ఇక ఎవరికీ అలాంటి సమస్య రాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే ఒక్క రూపాయికే చికిత్స అందింతే వైద్యశాలను నెలకొల్పారు. ఆయన ప్రాథమిక ఆరోగ్య సేవలతో పాటు, చాలా ఖరీదైన ఈసీజీ, నెబ్యులైజర్ లాంటి పరీక్షలను కూడా కేవలం ఒక్క రూపాయితోనే చేస్తున్నారు.
"ఈ రోజుల్లో దంత సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. అదే సమయంలో దంత చికిత్స ఖర్చులు భరించలేనంతగా మారిపోయాయి. నేడు డెంటర్ ట్రీట్‌మెంట్‌కు కనీసం రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు అవుతోంది. ఇలాంటి సమయంలో నా భార్య పేదల కోసం క్లీనిక్ ప్రారంభించడం ఆనందంగా ఉంది" అని డాక్టర్ శంకర్ రామచందాని పేర్కొన్నారు.
కేవలం రూపాయికే వైద్య సేవలు అందించడం దీర్ఘకాలంలో సవాల్‌తో కూడుకున్న అంశం. అయినప్పటికీ పూర్తి నిబద్ధతతో దీనిని కొనసాగించాలని నిశ్చయించుకున్నాం అని డాక్టర్ శంకర్ రామచందాని అన్నారు.
COMMENTS