NEEDLE FREE INJECTIONS
సూది లేకుండానే ఇంజెక్షన్లు - ఇకపై నొప్పి ఉండదట! ఇప్పటికే వాడుతున్న వైద్యులు.
నొప్పి లేని ఇంజెక్షన్లు గురించి నిపుణులు ఏమంటున్నారంటే?
Needle Free Injections : మనలో కొంత మంది సూది మందు అనగానే భయపడిపోతారు. ట్యాబ్లెట్లు వేసుకుంటామని సూదీ మాత్రం వద్దంటారు. ఇంకా చిన్న పిల్లలైతే సూది అనగానే ఆమడ దూరం పరిగెడతారు. ముఖ్యంగా డయాబెటిస్, ఇతర జబ్బులతో బాధపడుతున్నా వారు తరచూ ఇంజెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారందరికి గుడ్‌న్యూస్. ఈ సమస్యకు పరిష్కరంగా సూది లేకుండా, నొప్పి తెలియకుండా ఇచ్చే పెయిన్లెస్ ఇంజెక్షన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. సూది లేకుండా ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీటి వల్ల కలిగే ప్రయోజనాలను National Library of Medicine వెల్లండింది.
సూది లేని ఇంజెక్షన్లు: సూది ఇంజెక్షన్‌తో పోలిస్తే సూది రహిత ఇంజెక్షన్లు తక్కువ నొప్పిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బాధితుడు కోలుకోవడానికి తక్కువ సమయం పడుతుందని వివరించారు. అంతే కాకుండా మానసిక ఒత్తిడి, మెడిసిన్ మోతాదును నియంత్రించడానికి ఈ పద్దతి సహాయపడుతుందని అంటున్నారు. సూది రహిత ఇంజెక్షన్ చాలా సమర్థంగా, సురక్షితంగా ఉంటుందని mednexus పేర్కొంది.
వారి కోసమే సూది లేని ఇంజెక్షన్లు : ఇంజెక్షన్‌పై ఉన్న భయంతో చాలా మంది సరైన చికిత్స తీసుకోకుండా తెలిసిన టాబ్లెట్లను మింగుతుంటారు. ట్రిపనోఫోబియాగా వ్యవహరించే ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా 50 శాతం పిల్లలు, 30శాతం పెద్దలు ఎదుర్కొంటున్నారని అధ్యయనాల్లో తేలింది. ఇలాంటి వారి కోసమే సూది లేని ఇంజెక్షన్లు తీసుకొస్తున్నామని 'ఇంటెగ్రి మెడికల్' అనే సంస్థ ప్రతినిధులు సంబంధిత వివరాలను వెల్లడించారు.
ఎలాంటి నొప్పి లేకుండా : 'ఎన్-ఫిస్' పేరిట సూది రహిత ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ఇంటెగ్రి మెడికల్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ పరికరం మొదట మందును అధిక వేగంతో చర్మంపై ఉండే రంధ్రాల్లోకి జొప్పిస్తుందని తెలియజేశారు. దీంతో ఎలాంటి నొప్పి లేకుండా కండరాల్లోకి ఔషధం వెళ్తుందని వివరించారు. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్‌ను దేశంలో వెయ్యి కన్నా ఎక్కువ మంది వైద్యులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఇంజెక్షన్లు టీకాలు తయారు చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో తమ ఉత్పత్తిని వినియోగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.
చిన్నపాటి షాక్‌లా : 'ఎన్-ఫిస్' లాగే సూది లేకుండా, నొప్పి తెలియకుండా ఇచ్చే పెయిన్లెస్ ఇంజెక్షన్‌ను ఇంతకు ముందు ఐఐటీ బాంబేకు చెందిన పరిశోధకులు 'షాక్ సిరంజీ' పేరుతో ఆవిష్కరించారు. ఈ ఇంజెక్షన్లుకు సూదులు లాంటివి పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఇవి చూడ్డానికి అచ్చం పెన్నులా ఉండే ఈ పరికరంపైన ఉన్న స్విచ్ నొక్కినప్పుడు సిరంజీలోని మందు బుల్లెట్లా వేగంగా దూసుకొచ్చి చర్మంలోకి చొచ్చుకుపోతుంది. దీంతో నొప్పి అసలు తెలియదు. చిన్నపాటి షాక్‌లా మాత్రమే అనిపిస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. మామూలు సూదులతో వచ్చే చిన్నపాటి వాపు కూడా రాదని తెలిపారు. ఇవి చర్మాన్ని తాకవు కాబట్టి ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశమూ ఉండదని అంటున్నారు. అలాగే, ఏటా టన్నుల కొద్దీ పేరుకుంటున్న బయోవేస్ట్ సమస్యకూ పరిష్కారం దొరికినట్టేనని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS