NATIONAL HIGHWAYS NEW POLICY
5 ఏళ్ల వరకు భూమి వాడకపోతే తిరిగి ఇచ్చేయాల్సిందే! - త్వరలో కొత్త చట్టం.
జాతీయ ప్రాజెక్టుల భూసేకరణపై త్వరలో కొత్త విధానం - కేంద్రం స్పష్టీకరణ - భూమి సేకరిస్తే ఆ పనులను ఐదేళ్లలో పూర్తి చేయాల్సిందే - లేదంటే భూమిని తిరిగి యజమానికి ఇవ్వాల్సిందే.
National Highways : కేంద్రం ఓ కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఈ విధానంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూమి సేకరిస్తే ఆ పనులను ఐదేళ్లలో పూర్తి చేయాల్సిందేనని, లేదంటే యజమానుల నుంచి సేకరించిన భూమిని తిరిగి వారికి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ప్రాజెక్టుల కోసం అప్పగించే స్థలాలకు పరిహారం మంజూరైన మూడు నెలల తర్వాత ఆ భూమిపై యజమానులు హక్కును కోల్పోతారని పేర్కొంది. ఇప్పటికే ఈ విధానానికి సంబంధించిన ముసాయిదా కూడా సిద్ధమైంది. దీన్ని చట్ట రూపంలో తీసుకొచ్చి అమలు చేయాలనే ఆలోచనలో ఉంది.
జాతీయ రహదారులతో పాటు పౌర విమానయానం, రైల్వేలు, రక్షణ, షిప్పింగ్, బొగ్గు, పర్యావరణం తదితర మంత్రిత్వ శాఖలకు చెందిన విభాగాల ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకూ ఇదే విధానాన్ని అనుసరించనుందని తెలుస్తోంది. భూ సేకరణ చేసిన పలుచోట్ల ఏళ్లుగా రోడ్లు నిర్మించకుండా ఖాళీగా ఉంచుతున్నారు. అభివృద్ధి కోసమని సేకరించిన ఈ భూములు నిరుపయోగంగా మారుతున్నాయి.
మరోవైపు రహదారుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్నిచోట్ల అవసరానికి మించి భూసేకరణ చేపడుతున్నారన్న విమర్శలు సైతం వస్తున్నాయి. ఇలాంటి వాటికి తావు లేకుండా భూసేకరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టడానికి కేంద్రం ఈ కొత్త విధానాన్ని తీసుకురానుంది. కేంద్రం తీసుకొచ్చే ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఇందుకు ప్రత్యేక వెబ్సైట్ను కూడా రూపొందించనుంది.
బిల్లు ఆమోదం పొందితే రహదారుల నిర్మాణం వేగం :
ఇందులో భూములు ఇచ్చిన యజమానులు, పరిహారం, విస్తీర్ణం వంటి వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రహదారుల నిర్మాణం వేగంగా జరగడంతో పాటు భూసేకరణ, పరిహారం విషయంలోనూ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
COMMENTS