Are you actually making money? - Or losing it? - Know this.
అసలు మీరు డబ్బు సంపాదిస్తున్నారా? - లేక పోగొట్టుకుంటున్నారా? - ఇలా తెలుసుకోండి.
తక్కువ కాలంలో ధనవంతులు కావాలనే ఆలోచనలు పక్కన పెట్టండి - ఈ మార్గాలను పాటించి ఆర్థికంగా స్థిరపడండి అంటున్న నిపుణులు.
Money Saving Tips in Telugu To Become Rich : 'బెట్టింగులు వేస్తే డబ్బులు వచ్చేస్తాయి. ట్రేడింగ్ చేసేద్దాం, మనకు అంతా తెలుసు. ఇలా రూ.10 పెడితే అలా రూ.100 వచ్చేస్తాయి.' ఇలా ఎంతో మంది ఆలోచనలు సాగుతున్నాయి. సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. కొందరైతే అప్పులు చేసి మరీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని పొరపాట్లు మనల్ని ఆర్థికంగా విజయం సాధించకుండా చేస్తుంటాయి. కానీ, వాటిని సరి చేసుకోవాలనే విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోం. ఫలితం ఎంత కష్టపడ్డా డబ్బు మిగలదు. దీంతో అనుకున్న లక్ష్యాలను చేరడం కష్టమవుతుంది. సాధారణంగా మనం ఎలాంటి పొరపాట్లు చేస్తుంటాం, వాటిని సరిద్దిద్దుకోడానికి ఏం చేయాలో ఒకసారి చూద్దాం.
ఒక్క రోజులోనే ధనవంతులు కావాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ, నిజానికి అది సాధ్యపడుతుందా? ఈ ఆలోచన మీకు కష్టాలనే తెచ్చిపెడుతుంది.
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, బంగారం, స్థిరాస్తులు ఇవన్నీ పెట్టుబడి మార్గాలు. బెట్టింగులు, ఆన్‌లైన్ గేములు ఇవన్నీ డబ్బును పోగొట్టుకునేవి. ఒక లక్ష్యంతో మదుపు చేయడం ప్రారంభించండి. మీరు అనుకున్నట్లుగానే ధనవంతులవుతారు. క్రెడిట్ కార్డులను అధికంగా వినియోగించి, వాటికి బిల్లులు కట్టకపోవడం, కనీస బిల్లు చెల్లించడం లాంటివి కొంతమందికి అలవాటు.
మీ క్రెడిట్ పరిమితిలో 15-20 శాతం మాత్రమే వినియోగించండి. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే వడ్డీ రూపంలో 36 శాతం వరకూ చెల్లించాల్సి వస్తుంది. సంపాదించింది వడ్డీలకే పోతే, ఇక మనం ఎప్పుడు డబ్బు కూడబెడతాం చెప్పండి! మళ్లీ తీసుకున్న వాటికి అసలు కట్టాలి. అందుకే కార్డులను వీలైనంత తక్కువగా వాడటం అలవాటు చేసుకోండి.
బెట్టింగులు వేసేటప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకుంటారు కదా. డబ్బు పోగొట్టుకునేందుకు తొందర పడటం కాదు, పెట్టుబడులు పెట్టేందుకు ఈ సూత్రం అమలు చేస్తే దీర్ఘకాలంలో సంపద పెరుగుతుందని ఆలోచించాలి.
అవసరమైన ప్రతిసారీ అప్పు చేయడం మంచిది కాదు. కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపోయే డబ్బు ముందుగా మీ దగ్గర ఉంచుకోవాలి. అప్పుడే పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా, అవి పెరిగేందుకు తగిన సమయం పెట్టగలం.
ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఒక తప్పనిసరి అవసరంగా గుర్తించాలి. లేకపోతే అనారోగ్యం వచ్చినప్పుడు ఉన్న డబ్బంతా ఆసుపత్రికే కట్టాల్సి వస్తుంది. రోజూ మూడు టీ/కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు కనీసం రూ.50 ఖర్చు చేస్తారు అనుకుందాం. ఇందులో నుంచి ఓ రూ.25 పక్కన పెడితే చాలు. పొదుపు మొదలైనట్లే.
ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆరోగ్య బీమా తీసుకోవచ్చు.
భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం ఆర్థిక పతనానికి ప్రధాన కారణమవుతుంది. స్థిరమైన నిర్ణయాలు మీ డబ్బు విలువను పెంచుతాయి. ఒక కచ్చితమైన వ్యూహంతో పెట్టుబడులు పెట్టేందుకు యత్నించండి. సంపాదనలో కచ్చితంగా 30-40 శాతం పెట్టుబడులకు కేటాయించండి. 50 శాతం ఇంటి ఖర్చులకు, మిగతాది మీ ఖర్చులకు వాడుకోండి.
డబ్బును పోగొట్టుకోవడం కాదు, కాపాడుకోవడం తెలిసినప్పుడే ఆర్థికంగా విజయం సాధిస్తాం.
COMMENTS