MERI PANCHAYAT APP
మీ ఊరిలో వేసిన రోడ్ ఎన్ని కోట్లో తెలుసా? - ఆ వివరాలు ఈ యాప్‌లో ఉన్నాయ్ బాస్ తెలుసుకో!
గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి వివరాలను తెలుసుకునేందుకు మేరీ పంచాయత్ యాప్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వం - ఆ వివరాలు ఎలా తెలుసుకోవాలంటే?
Meri Panchayat App : గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయత్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌తో ఆదాయ, వ్యయాల విషయంలో పారదర్శకత పాటించే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను పాలకవర్గం ఎలా ఖర్చు చేస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ను 2019 సంవత్సరంలోనే రూపొందించినా పలు కారణాలు, సాంకేతిక సమస్యలతో ప్రజలకు కొన్ని వివరాలను అందించలేకపోయింది మేరీ పంచాయత్ యాప్. ప్రస్తుతం ఈ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
అధికారులు, పాలకులను ప్రశ్నించే అధికారం :
రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటారు. ఆ నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మేరీ పంచాయత్ యాప్‌లో పొందుపరచాలని, తద్వారా గ్రామాల్లో పారదర్శక పాలన సాగుతుందని సంబంధిత అధికారులు అంటున్నారు. నిధుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉండడంతో గ్రామాల అభివృద్ధికి ఎలాంటి పనులను చేపడుతున్నారో ప్రతి ఒక్కరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మేరీ పంచాయత్ యాప్‌లో వివరాల నమోదు టైంలోనే జీపీఆర్‌ఎస్ ద్వారా గుర్తించే అవకాశం ఉండడంతో, అక్కడి పనులకు కేటాయించిన నగదును ఇతర చోట్ల వినియోగించేందుకు వీలు ఉండదు. పాలక వర్గాలు సైతం పొరపాట్లు చేయడానికి అవకాశం లేదు. అధికారులు, పాలకులు తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రజలకు ప్రశ్నించేందుకు వీలు ఉంటుంది.
గ్రామ సభల వివరాలు సైతం యాప్‌లో :
నిధులే కాదు సర్పంచి, కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు అన్నీ మేరీ పంచాయత్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నగదుతో ఏ పనికి ఎంత ఖర్చు చేశారు, ఆ పనులు ఏ దశలో ఉన్నాయనే వివరాలు యాప్‌లో నమోదై ఉంటాయి. ఆదాయ, వ్యయాలతో పాటు పంచాయతీలో నిర్వహించే గ్రామ సభల వివరాలు సైతం యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోని :
స్మార్ట్ ఫోన్‌లో ఉండే ప్లేస్టోర్ యాప్‌లో 'మేరీ పంచాయతీ' పేరుతో సెర్చ్ చేయగానే వచ్చే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ అవ్వాలి. ఆ వెంటనే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు కనిపిస్తాయి. వాటిని శోధించడం ద్వారా మనకు కావలసిన సమాచారం పొందవచ్చు.
COMMENTS