JANMANREGA APP FOR MGNREGS
'ఉపాధి హామీ' డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలా? - ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఉపాధి కూలీలకు ప్రయోజనకరంగా 'జన్‌మన్‌రేగా యాప్' - కూలీ డబ్బులు జమయ్యాయా లేదా? సులభంగా తెలుసుకునే అవకాశం.
Janmanrega App For Mgnrega Labourers : జాతీయ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన కూలీలందరికి ఏడాదికి 100 రోజుల పని కల్పిస్తున్నారు. పారదర్శకత పెంచి అక్రమాలకు తావివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంస్కరణలు తీసుకొస్తున్నాయి. కూలీల వేతనాలు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుడికి బ్యాంకు అకౌంట్, పోస్టాఫీస్ ఖాతాలు తెరిచి నేరుగా చెల్లిస్తున్నారు. అయితే ఒకరికే రెండు మూడు అకౌంట్లు ఉండటంతో ఎందులో జమ చేశారో తెలుసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో ఉపాధి కూలీలకు ప్రయోజనకరంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘జన్‌మన్‌రేగా’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
'జన్‌మన్‌రేగా’ యాప్ ప్రయోజనాలు :
2023 ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజుల పని దినాలను పూర్తి చేసిన కూలీలను మాత్రమే ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా నమోదు చేస్తున్నారు. పలువురు ఉపాధి కూలీలు తమ పేర్లు అర్హుల జాబితాలో కనిపించకపోవడంతో తాము పని దినాలు పూర్తి చేశామో? లేదో తెలుసుకునేందుకు అధికారులను తరచూ సంప్రదిస్తున్నారు. కూలీ బిల్లుల చెల్లింపులను సరి చూసుకుంటున్నారు. అయితే వీరంతా ఆఫీసులు, తమ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా ‘జన్‌మన్‌రేగా’ యాప్ సాయంతో స్మార్ట్ ఫోన్‌లోనే సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఉపాధి హామీ సిబ్బంది సూచిస్తున్నారు.
'జన్‌మన్‌రేగా యాప్ డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
మీ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ను సందర్శించి ‘జన్మన్ రేగా’ అని టైప్ చేసి, యాప్ డౌన్‌లోడ్ అవుతుంది.
వివరాలు మిగతా భాషలతో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంటాయి. ముందుగా రాష్ట్ర, జిల్లా, పంచాయతీ, కుటుంబం, జాబ్ కార్డు నంబర్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీకు ఉపాధి హామీ పథకం కూలీ పేరు కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే అతను ఏ ఏడాదిలో ఎన్ని పనిదినాలు చేశాడు? ఏ బ్యాంకు అకౌంట్లో నగదు జమ అయిందో పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఒక వేళ నగదు జమ కాకపోతే అందుకు గల కారణాలను తెలియజేస్తారు.
"యాప్ వివరాలు తెలుగులో ఉండటం వల్ల చాలా మంది కూలీలు ఇప్పటికే దీనిని వినియోగిస్తున్నారు. అవగాహన లేనివారికి సమావేశంలో యాప్ గురించి తెలియజేస్తున్నాం. ఆన్‌లైన్ వినియోగంపై పట్టు సాధించినట్లయితే మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలుగుతుంది. పనిదినాల వివరాలు తెలుసుకునేందుకు ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు"- బి.సుధాకర్, ఏపీవో, కనగల్
COMMENTS