INDIRAMMA ILLU APP
ముందు యాప్‌లో ఇల్లు నమోదు చేసుకుంటేనే - ఆ తర్వాతే బిల్లులు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు - యాప్‌లో ఇల్లు నమోదైతేనే బిల్లులు.
Indiramma Illu Special App : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇళ్ల నిర్మాణాలు, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తప్పనిసరిగా 400 చదరపు అడుగుల విస్తీర్ణం, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించాల్సిందే. ఇళ్లు నిర్మించుకుంటేనే బిల్లులు చెల్లిస్తారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు తావులేకుండా చూస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది.
దశలవారీగా ఫొటోలు అప్లోడ్ చేయండి :
అధికారులు క్షేత్రస్థాయిలో యాప్‌ద్వారా ఫొటోలు తీసి, అప్లోడ్ చేస్తారు.
ముగ్గు పోసినప్పుడు తీసిన లొకేషన్‌కు, తర్వాత వివిధ దశలలో తీసిన లొకేషన్ సరిపోలితేనే బిల్లులు చెల్లించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఒక యాప్ ఇవ్వగా, వారు ముగ్గుపోసిన ఇళ్లను ఫొటోలు తీసి పంపిస్తున్నారు.
తాజాగా టెక్నికల్‌గా ఇళ్లు నిర్ణీత కొలతల ప్రకారం నిర్మిస్తున్నారా లేదా, 400 చదరపు అడుగు విస్తీర్ణం ఉందా లేదా అనే దానిని ధ్రువీకరించేందుకు ఈ ఇళ్లకు సంబంధించిన అధికారులకు ఈ యాప్‌లను అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది.
అధికారులు పునాది వరకు పూర్తయిన ఇళ్లను పరిశీలించి వాటి కొలతలు తీసుకుని సరిగా ఉంటే ఫొటో అప్లోడ్ చేస్తారు.
గృహనిర్మాణ శాఖ డీఈలు సూపర్ చెక్ చేసి సరిగా ఉంటే బిల్లుల చెల్లింపునకు పంపిస్తారు.
నిర్ణీత కొలతల ప్రకారం లేని వాటిని తిరస్కరిస్తారు.
లబ్ధిదారులు సరిచేసుకుంటే మళ్లీ పరిశీలించే అవకాశం ఉంది.
అయితే యాప్‌లో నమోదు తర్వాత లబ్ధిదారులకు మొదటి విడత బిల్లులు చెల్లించనున్నారు.
త్వరలోనే చెల్లింపులు :
జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రారంభించిన ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి యాప్‌లో అప్లోడ్ అనంతరం, అంగీకారం తర్వాతనే బిల్లుల చెల్లింపులు ఉంటాయని యాదాద్రి భువనగిరి జిల్లా గృహనిర్మాణ శాఖ పీడీ ఎల్.విజయసింగ్ తెలిపారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లోని 22 ఇళ్ల నిర్మాణాలకు పునాది దశలో అప్లోడ్ పూర్తి జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారులకు నేరుగా మొదటి విడత చెల్లింపులను త్వరలో చేపట్టే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
COMMENTS