INDIAN MARITIME UNIVERSITY
సముద్రంలో జాబ్ చేయాలని అనుకుంటున్నారా? - ఈ చక్కటి అవకాశం మీ కోసమే.
సముద్రంలో చక్కని జాబ్ చేయాలని అనుకునే వారికి చక్కడి అవకాశం - ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష వివరాలు.
Indian Maritime University Entrance Exam Details : సముద్రంలో చక్కని జాబ్ చేయాలని అనుకుంటే మారిటైమ్ కోర్సులు మేటి మార్గం. స్వల్ప కాలంలోనే కడలి కేంద్రంగా కొలువుదీరి, ఆకర్షణీయ వేతనంతో పాటు ప్రపంచాన్నీ చుట్టేయవచ్చు. ఈ చదువులకు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ) పేరున్న సంస్థ. దీనికి దేశవ్యాప్తంగా క్యాంపస్‌లూ, అనుబంధ కాలేజీలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
కష్టపడే స్వభావం, సముద్రయానంపై ఆసక్తి ఉన్నవారు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ, అనుబంధ సంస్థలు అందించే కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
ఎన్నో ఉత్పత్తులు ఖండాలు, దేశాలు దాటి ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్నాయి. ఇందులో కీలకం రవాణా. తక్కువ ఖర్చుతో, ఎక్కువ పరిమాణంలో వస్తువులను చేరవేయడానికి జల రవాణాను మించిన మార్గం లేదు. భారతదేశంలో 12 మేజర్, 200కు పైగా నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. దేశం వెంబడి సుమారు 7500 కి.మీ. తీర రేఖ ఉంది. దేశ ఆర్థిక వృద్ధిలో సముద్ర రవాణా కీలక పాత్ర వహిస్తోంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా నౌకాయానానికి ప్రాధాన్యమూ పెరుగుతోంది. భారీ స్థాయిలో సామగ్రిని నీటి మార్గం ద్వారా దేశాలు, ఖండాలు దాటి లక్ష్య ప్రాంతాలకు చేర్చడంలో ఓడలు, నిపుణుల పాత్రే కీలకం. ఈ విభాగంలో సేవలు అందిస్తున్నవారు ఆకర్షణీయ జీతాలు పొందుతున్నారు.
షిప్పింగ్‌లో సుశిక్షితులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2008 సంవత్సరంలో తమిళనాడులోని చెన్నైలో ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీని నెలకొల్పింది. దీనికి నవీ ముంబయి, ముంబయి పోర్టు, విశాఖపట్నం, కోల్‌కతా, కొచిల్లో క్యాంపస్‌లు ఏర్పాటు ఉన్నాయి. ఇవే కాకుండా వీటికి దేశవ్యాప్తంగా అనుబంధ కాలేజీలు కూడా ఉన్నాయి. వీటిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్రతిభతో అవకాశం లభిస్తుంది.
వీటిని పూర్తి చేసుకున్నవారికి ఇంజినీరింగ్, డెక్ విభాగాల్లో పలు జాబ్స్ దక్కుతాయి. ఇంజినీర్, కెప్టెన్, డిజైనర్, షిప్ బిల్డర్, పోర్ట్ మేనేజర్, మెరైన్ ఆపరేషన్స్ మేనేజర్, లాజిస్టిక్స్ ఎక్స్‌పర్ట్, మెరైన్ ఇన్‌స్యూరెన్స్ స్పెషలిస్ట్, షిప్పింగ్ ఏజెంట్, మెరైన్ టెర్మినల్ మేనేజర్, మెరైన్ పైలట్, డెక్ ఆఫీసర్, మెరైన్ టెక్నీషియన్, మెరైన్ ఇంజినీర్, మెరైన్ సర్వేయర్, ప్రాజెక్ట్ మేనేజర్, కన్సల్టెంట్, రిసెర్చ్ సైంటిస్ట్, నేవల్ ఆర్కిటెక్ట్, తదితర హోదాలతో సేవలు అందించవచ్చు. ఇక్కడి స్టూడెంట్స్ ను పలు షిప్పింగ్ సంస్థలు ప్రాంగణ నియామకాల్లో అవకాశం కల్పిస్తున్నాయి. వీరు ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ 2 రకాల జాబులు పొందవచ్చు.
ఇవీ కోర్సులు : -
అండర్ గ్రాడ్యుయేషన్ : -
బీటెక్ : నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్
బీఎస్సీ : నాటికల్ సైన్స్
బీబీఏ : రిటైలింగ్ అండ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, మారిటైమ్ లాజిస్టిక్స్
డిప్లొమా : నాటికల్ సైన్స్ (కోర్సు వ్యవధి ఏడాది)
అర్హత : బీటెక్, బీఎస్సీ,డిప్లొమా కోర్సులకు ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో 60 % మార్కులు పొందాలి. అలాగే పదోతరగతి లేదా ఇంటర్మీడియట్ ఆంగ్లం సబ్జెక్టులో కనీసం 50 % మార్కులు ఉండాలి. బీబీఏ కోర్సులకు 60 % మార్కులతో ఇంటర్మీయట్ అన్ని గ్రూపుల విద్యార్థులూ అర్హులే.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ : -
ఎంటెక్ : డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్, మెరైన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్
ఎంబీఏ : ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్, పోర్ట్ అండ్ షిప్పింగ్ లాజిస్టిక్స్, పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్, మారిటైమ్ మేనేజ్‌మెంట్ (ఆన్‌లైన్)
అర్హత : ఎంటెక్ కోర్సులకు సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీలో 60 % మార్కులతో బీటెక్. ఎంబీఏ కోర్సులకు 50 % మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.
పీజీ డిప్లొమా : మెరైన్ ఇంజినీరింగ్ (కోర్సు వ్యవధి సంవత్సరం)
అర్హత : బీఈ, బీటెక్ 50 % మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్,నేవల్ ఆర్కిటెక్చర్.
ప్రవేశం : ఈ సంస్థల్లోని సీట్లకు వివిధ మార్గాల్లో ప్రవేశం పొందవచ్చు. బీబీఏ కోర్సులకు సీయూఈటీ యూజీ/ఇంటర్ మార్కులతో అవకాశం కల్పిస్తారు. పీజీలో కొన్ని కోర్సులకు సీయూఈటీ పీజీ/గేట్ స్కోరుతో అవకాశం ఉంటుంది. క్యాట్/ సీమ్యాట్/ మ్యాట్ స్కోరుతో ఎంబీఏ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంస్థ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఐఎంయూ సెట్)తోనూ అవకాశం కల్పిస్తారు. కొన్ని కోర్సులకు అకడమిక్ మార్కుల మెరిట్‌తోనూ చేర్చుకుంటారు.
ఐఎంయూ సెట్ : యూజీ కోర్సుల ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 10+2 స్థాయి ప్రశ్నలు వస్తాయి. ఎంబీఏ కోర్సులకు 120 ప్రశ్నలు ఉంటాయి. డేటా ఇంటర్‌ప్రెటేషన్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, రీజనింగ్ , వెర్బల్ ఎబిలిటీ అంశాల్లో ప్రశ్నలడుగుతారు. ఎంటెక్ కోర్సుల ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్, ఇంగ్లిష్ తోపాటు మెకానికల్ / నేవల్ ఆర్కిటెక్చర్ / మెరైన్ / సివిల్ వీటిలో ఏదో ఒక విభాగాన్ని ఎంచుకోవాలి. అన్ని పరీక్షలూ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. 2 సెట్ల మాదిరి ప్రశ్నలు వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిని పరిశీలిస్తే పరీక్షపై అవగాహన వస్తుంది. ఐఎంయూ ఎంఎస్ రిసెర్చ్, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులనూ అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి ప్రత్యేకంగా ప్రకటన వెలువడుతుంది. పరీక్ష, ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తారు.
ముఖ్య వివరాలు : -
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : వచ్చే నెల 2.
పరీక్ష తేదీ : వచ్చే నెల 2.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, అనంతపురం, తిరుపతి, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం.
పూర్తి వివరాలకు https://www.imu.edu.in/imunew/admissions-2025-26 వెబ్‌సైట్ ను సంప్రదించగలరు.
COMMENTS