ICE APPLE BENEFITS IN TELUGU
వేసవిలో మాత్రమే లభించే ఐస్ యాపిల్స్ - ఇవి తింటే ఎన్ని లాభాలో!
వేసవిలో లభించే ఒక ప్రత్యేకమైన పండు తాటిముంజ - ఆసక్తి చూపుతున్న హైదరాబాద్‌వాసులు - మంచి గిట్టుబాటు కూడా అవుతుందని అంటున్న వ్యాపారులు
Ice Apple Benefits : వేసవి సీజన్లో మాత్రమే లభించే అరుదైన తాటిముంజలకు ఎంతో ప్రత్యేతక ఉంది. జెల్లీలాగా మృదువుగా ఉండే వీటిని ఐస్ యాపిల్ అంటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి. నాడు పల్లెల్లో ఉచితంగా లభించే తాటి ముంజలకు నేడు నగరంలో భలే గిరాకీ ఉంది. డజను ముంజలు 100 రూపాయలైనా పెట్టి కొంటున్నారు. ఎండాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ముంజలకు చిన్నా పెద్దా ఆందరూ ఫిదా అవ్వాల్సిందే. ఒంటికి చలువ చేస్తుందని అందరూ కొంటుండటంతో డిమాండ్ పెరిగి ధరలు బాగా పెరిగాయి. దీంతో గౌడ సోదరులకు ఈ వేసవి సీజన్లో మంచి గిరాకీ రావడంతో హైదరాబాద్ నగరంలోని పలు కూడళ్లలో వాటిని అమ్ముతూ కనిపిస్తున్నారు. కేవలం తినటానికి బాగుంటాయని, చలువ చేస్తుందనే మాత్రమే కాదు దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
తాటి ముంజలు వేసవి సీజన్లో మాత్రమే లభిస్తోంటాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వీటి కోసం పొలం గట్లపైకి వెళ్లి గెలలు గెలలు కోసుకుని లొట్టలేసుకుని తింటారు. తినగా మిగిలిన గెలలను ఊర్లో పిల్లలకు పెద్దలకు మహిళలకు ఉచితంగా ఇస్తుంటారు. అయితే నగరాల్లో ఉండే వారికి వీటి రుచులను ఆస్వాదించే అవకాశం చాలా అరదుగా ఉంటోంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో తాటిముంజులు దొరగడం అంటే గగనమనే చెప్పుకోవచ్చు.
సిటీల్లో గిరాకీ ఎక్కువ :
నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి తాటికాయలను కోసుకొచ్చి హైదరాబాద్ నగరంలో పలు కూడళ్ల వద్ధ విక్రయిస్తున్నారు. వాటిని కొనేందుకు నగర ప్రజలు సైతం మొగ్గు చూపిస్తున్నారు. వేసవి కాలంలో వీటిని తింటే శరీరానికి మంచి చలవ చేస్తూ దాహార్తిని తీర్చుతుందని అందరూ కొనుక్కుని తినడానికి మక్కువ చూపుతున్నారు. నగరం చుట్టు పక్కల పల్లెల నుంచి ఉదయమే వందలాది మంది తాటి కాయలను తీసుకుని నగరంలో పలు చోట్ల విక్రయిస్తున్నారు. ఇవి 1-2 నెలలు మాత్రమే లభ్యం కావడంతో సిటీల్లో గిరాకీ ఎక్కువగా ఉంటోంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా రోడ్ల పక్కన వీటిని అమ్ముతున్నారు.
సులభంగా జీర్ణం :
ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటంతో వీటిని తింటే డీ హైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలను ఇవి బ్యాలన్స్ చేస్తాయని ఇప్పటికే పలువురు న్యూట్రిషన్ లు సైతం చెబుతున్నారు. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం లభిస్తుందని చెబుతున్నారు. ఇవి సులభంగా జీర్ణం కావడమే కాకుండా రుచిలో కూడా లేత కొబ్బరిలా ఉండటంతో వీటిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటున్నారు. సీజనల్‌గా మాత్రమే లభించడంతో వీటిని ఏడాదికి ఓ సారి అయిన రుచి చూడాల్సిందేనని ప్రజలు చెబుతున్నారు.
మంచి గిట్టుబాటు కూడా అవుతుంది :
జిల్లాలనుంచి తాటికాయలను ఉదయాన్ని నగరానికి తీసుకొచ్చి ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, నాగోల్, పలు కూడళ్ల వద్ధ విక్రయిస్తున్నారు. వీటిని రుచి చూసేందుకు నగర వాసులు సైతం అంతే మొగ్గుచూపుతూ కనిపిస్తున్నారు. వేసవిలో మాత్రమే నగరంలో చాలా అరదుగా దొరికే తాటి ముంజలు తినటానికి రుచికరంగాను ఆరోగ్యానికి మేలు చేసేవిగాను ఉంటాయని, ఎండ నుంచి ఉపసమనం కూడా లభిస్తోందని విక్రయదారులు చెబుతున్నారు. వీటిని తినటానికి చిన్నా, పెద్దా అందరూ ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. రెండు నెలల పాటు మంచి గిరాకీ ఉంటుందని, నాలుగు రాళ్లు సంపాదించుకుంటామని, మంచి గిట్టుబాటు కూడా అవుతుందని వ్యాపారులు అంటున్నారు.
COMMENTS