HUGE DEMAND FOR AC TRAINS
సమ్మర్‌లో కూల్‌గా వెళ్లేందుకు ప్లాన్ - ఏసీ రైలు టికెట్లకు భారీగా డిమాండ్
ఏసీ బోగీలకు పెరుగుతున్న డిమాండ్ - మే రెండో వారం వరకు వెయిటింగ్ లిస్టూ దొరకని పరిస్థితి.
Huge Demand For AC Trains In Telangana : రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి కారణంగా రైళ్లలోని ఏసీ బోగీల్లో బెర్తులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. కొన్నింట్లో వెయిటింగ్ లిస్టు పరిమితి కూడా దాటేసీ రిగ్రెట్‌కు చేరింది. మే రెండో వారం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుంచి దిల్లీ, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై ఇలా ఏ మార్గంలో చూసినా ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. ఏసీ రిజర్వేషన్ వెయిటింగ్ జాబితా 100-150 దాటుతోంది.
ఎండాకాలం సెలవులు రావడంతో ప్రజలు చల్లటి ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిలోని శిమ్లా, కులు-మనాలి వంటి ప్రదేశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. వీటికి దిల్లీ పైనుంచే రాకపోకలు సాగించాలి. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ థర్డ్ ఏసీలో ఏప్రిల్ 23 నుంచి మే 16 వరకు (మధ్యలో మే 13 మినహా) 23 రోజుల పాటు ‘రిగ్రెట్’ కనిపిస్తోంది. ఇక తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సెకండ్ ఏసీ బోగీ టికెట్లకు మే 3 వరకు ‘రిగ్రెట్’ ఉంది. వారానికి మూడు రోజులే నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ థర్డ్, సెకండ్ ఏసీ రైళ్లో ఏప్రిల్ 25, 28, 30, మే 5, 7, 9 తేదీల్లో రిగ్రెట్ కనిపిస్తోంది.
ఎక్కడ చూసినా రిగ్రేట్ కనిపిస్తూ :
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడల నుంచి తిరుపతి వైపు వెళ్లే రైళ్లలోనూ ఏసీ టికెట్ల వెయిటింగ్ లిస్టు 100కుపైనే ఉంది. ‘శబరి’లో థర్డ్ ఏసీ ఏప్రిల్ 23 నుంచి మే 3వ తేదీ వరకు (ఏప్రిల్ 25న ఒక్కరోజు మినహా) 10 రోజులపాటు ‘రిగ్రెట్’ వస్తోంది. వెంకటాద్రి, పద్మావతి, నారాయణాద్రి, సెవెన్‌హిల్స్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌సహా పలు రైళ్లలో ఏసీ ప్రయాణానికి భారీగా నిరీక్షణలో ఉన్నారు. ఒక్క వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఊరట కలిగిస్తున్నా అందులో ఛార్జీలు భారీగా ఉంటాయి. రేణిగుంట నుంచి కోయంబత్తూర్ పై నుంచి మంగళూరు, ఉడిపి మీదుగా వెళ్లే కాచిగూడ-మురుడేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లోనూ థర్డ్ ఏసీ టికెట్లకు మే 9వ తేదీ వరకు ‘రిగ్రెట్’ వస్తోంది. ఊటీ, కొడైకెనాల్‌కు వెళ్లేవారు కోయంబత్తూరు మీదుగా ప్రయాణిస్తారు.
అదనంగా ఏసీ బోగీలను పెంచితే :
సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో నడిచే రైళ్లలో ఏసీ టికెట్ల కోసం నిత్యం వేలాది మంది ప్రయాణికులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఒక్క గరీబ్‌రథ్‌లోనే ఈ సంఖ్య రోజుకు సగటున 150పైగా ఉంటోంది. గోదావరి, గౌతమి, కోణార్క్, ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్, జన్మభూమి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లలో ఏసీ ప్రయాణానికి భారీ సంఖ్యలో నిరీక్షణ జాబితా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు, చెన్నై, విశాఖ మార్గాల్లో అదనపు రైళ్లను, అదనపు ఏసీ బోగీలను ఏర్పాటు చేస్తేనే ప్రయాణికులకు ఉపశమనం కలిగే అవకాశముంది.
COMMENTS