HOW TO GET IMPORTANT CERTIFICATES
మీ పిల్లల ఉన్నతవిద్య ప్రవేశాలకు ఈ ధ్రువపత్రాలు అతిముఖ్యం - ముందుగానే దరఖాస్తు చేసుకోండిలా!
బీటెక్, మెడిసిన్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు తప్పనిసరి - ముందుగానే దరఖాస్తు చేసుకుంటే మేలంటున్న అధికారులు.
How To Apply For Caste Income Certificate : రెండు రోజుల క్రితం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. త్వరలోనే పదో తరగతి ఫలితాలు రానున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు బీటెక్, మెడిసిన్, బీఫార్మసీ, తదితర డిగ్రీ కోర్సుల్లో చేరుతుంటారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు పాలిటెక్నిక్, ఇంటర్ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు. ఇందుకోసం విద్యార్హత పత్రాలతో పాటు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలనేవి తప్పనిసరిగా అవసరం. జూన్‌లో అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది. అంతకంటే ముందే ధ్రువపత్రాలను పొందితే అడ్మిషన్ల సమయంలో ప్రశాంతంగా ఉండొచ్చు. చివరలో తొందరపడకుండా ఇప్పటినుంచే ఉన్నత విద్యకు అవసరమయ్యే ధ్రువపత్రాల కోసం దరఖాస్తులు చేసుకుంటే మేలని అధికారులు సూచిస్తున్నారు.
అవసరమైన ధ్రువపత్రాలు కావాలంటే :
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 1-10 తరగతులకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లు, కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు. ఇంటర్, డిగ్రీ పూర్తయినటువంటి విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలతో పాటు విద్యాపరంగా గ్యాప్ ఉంటే దానికి సంబంధించి మండల తహసీల్దార్ జారీ చేసే పత్రం కావాలి. ఇందుకోసం విద్యార్థులు తమ పరిధిలోని ఠాణా నుంచి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ, నివాస ధ్రువపత్రాలను అవసరం మేరకు ప్రతి ఏటా తీసుకోవాల్సి వస్తుంది.
దరఖాస్తు ఇలా చేసుకోవచ్చు :
క్యాస్ట్, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం మీ సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్, రేషన్‌కార్డులతో పాటు ఇతర డాక్యుమెంట్లను జత చేయాలి. ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) వర్గాలకు చెందిన విద్యార్థులు ఆధార్, రేషన్‌కార్డుతో పాటు న్యాయవాది అఫిడవిట్, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల హామీ పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఈ కేటగిరికి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 100 చదరపు అడుగుల స్థలం కూడా ఉండకూడదు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్ఐ), నాయబ్ తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు రిపోర్టును తహసీల్దార్ లాగిన్‌కు పంపిస్తారు. అన్ని పత్రాలను మండల తహసీల్దార్ పరిశీలించి సక్రమంగా ఉంటే డిజిటల్ సంతకం చేస్తారు. అనంతరం సంబంధిత విద్యార్థి సెల్‌ఫోన్ నంబరుకు సంక్షిప్త సందేశం వస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిందని మెసేజ్ వచ్చిన వెంటనే సంతకం చేసిన ధ్రువపత్రాన్ని మీ సేవ కేంద్రంలో పొందొచ్చు. ప్రతి ఏటా మే నెలాఖరు నుంచి జూన్ మాసంలో విద్యార్థులు ధ్రువపత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. రద్దీ నేపథ్యంలో డిజిటల్ సంతకాలు ఆలస్యమవ్వడంతో అడ్మిషన్లు పొందేందుకు ఇబ్బందులు పడుతుంటారు.
"మీ సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే ధ్రువపత్రాలు అందిస్తాం. అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందుగానే దరఖాస్తు చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం ఏడు రోజుల్లోనే ధ్రువపత్రాలు అందిస్తున్నాం. అత్యవసరమైతే తక్షణమే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం" - రాజు, తహసీల్దార్, నిర్మల్ అర్బన్
COMMENTS