HOW TO BOOK VIP NUMBER FOR VEHICLE
మీ బైక్/కార్‌కు VIP నంబర్ కావాలా? సింపుల్‌గా బుక్ చేసుకోండిలా!
మీ బైక్/కార్ కోసం మంచి VIP నంబర్ బుక్ చేయాలా? ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అవ్వండి!
How To Book VIP Number For Vehicle : మీరు మీ బైక్/స్కూటర్/కార్ కోసం మంచి వీఐపీ నంబర్ కావాలని అనుకుంటున్నారా? కానీ ఆ వీఐపీ నంబర్ ఎలా పొందాలో తెలియదా? అయితే ఇది మీ కోసమే. ఇంట్లోనే ఉండి, చాలా సులువుగా వీఐపీ నంబర్ ఎలా పొందాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మనలో కొంత మంది న్యూమరాలజీని బాగా నమ్ముతారు. కొందరు తమ లక్కీ నంబర్‌తో నంబర్ ప్లేట్ తీసుకోవాలని అనుకుంటారు. మరికొందరు తమ వెహికల్ నంబర్‌తోనే, తమ ఐడెంటిటినీ అందరూ గుర్తించాలని కోరుకుంటారు. ఇంకొందరు తమ దగ్గర ఉన్న వాహనాలు అన్నింటికీ ఒక ప్రత్యేకమైన ప్యాట్రన్ ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి వారందరూ తమ వాహనాలకు ఫ్యాన్సీ/ యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి మీరు కూడా ఇలానే ఓ మంచి వీఐపీ నంబర్ ప్లేట్ కావాలని అనుకుంటే, అందుకు ఫాలో కావాల్సిన ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా కాస్ట్‌లీ!
రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్‌టీఓ) వాళ్లు నిర్వహించే ఈ-ఆక్షన్ ద్వారా వీఐపీ నంబర్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ వీఐపీ నంబర్లు కావాలంటే చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకు మీరు సిద్ధపడితే, బిడ్ వేయాలి. మీలానే చాలా మంది బిడ్స్ వేస్తారు. అందరిలో హయ్యెస్ట్ బిడ్ వేసిన వారికి ఈ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ను అలాట్ చేస్తారు.
ఫీజులు ఎలా ఉంటాయ్?
వీఐపీ నంబర్ కావాలంటే ముందుగా మీరు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అలాగే మీరు కావాలని అనుకుంటున్న ఫ్యాన్సీ నంబర్ బేస్ ధరను 'కాషన్ మనీ'గా డిపాజిట్ చేయాలి. ఒక వేళ మీకు వీఐపీ నంబర్ అలాట్ అయితే మిగిలిన మొత్తాన్ని నిర్దిష్ట కాలపరిమితిలోగా ఆర్‌టీఓకు చెల్లించాలి. అప్పుడు ఆ నంబర్ ప్లేట్ మీ సొంతం అవుతుంది. ఒకవేళ గడువులోగా మీరు ఆ డబ్బు చెల్లించకపోతే, మీ దరఖాస్తు రద్దు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ముందుగా మీరు చెల్లించిన కాషన్ మనీని మీకే ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం తిరిగి ఇవ్వరు.
వీఐపీ నంబర్ కోసం దరఖాస్తు చేయండిలా!
ముందుగా మీరు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
వెబ్‌సైట్‌లో పబ్లిక్ యూజర్‌గా మీ పేరున అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
మీ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)ను ఎంచుకోవాలి.
అక్కడ ఫ్యాన్సీ నంబర్ల జాబితా ఉంటుంది. అందులో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవాలి. లేదా
మీరు కోరుకున్న ఫ్యాన్సీ నంబర్‌ను ఎంటర్ చేసి, చెక్ చేసుకోవాలి. ఒక వేళ ఉంటే, దానిని ఎంచుకోవాలి.
ప్రతి నంబర్‌కు రిజర్వేషన్ రుసుము ఉంటుంది. అది అక్కడే కనిపిస్తుంది.
వెంటనే సదరు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, మీకు కావాల్సిన నంబర్‌ను రిజర్వ్ చేసుకోవాలి.
ఇలా చేసిన తరువాత ఆర్‌టీఓ వాళ్లు నిర్వహించే ఆక్షన్ (వేలం)లో పాల్గొనాలి.
అక్కడ చాలా మంది బిడ్స్ వేస్తూ ఉంటారు. అందులో హయ్యెస్ట్ బిడ్ వేసేవాళ్లకు ఆ నంబర్‌ను అలాట్ చేస్తారు. కనుక మీ ఆర్థిక పరిస్థితులను బట్టి మీరు బిడ్ వేయవచ్చు.
మీరు కనుక హయ్యెస్ట్ బిడ్ వేస్తే, ఈ-వేలం పూర్తయిన తరువాత, ఆ డబ్బులు మొత్తం చెల్లించాలి. మీకు ఏదైనా రిఫండ్ వస్తే, దానిని తీసుకోవాలి.
డబ్బులు చెల్లించిన వెంటనే మీ పేరు మీద ఒక అలాట్‌మెంట్ లెటర్ వస్తుంది. దానిని ప్రింట్ తీసుకోండి. అంతే సింపుల్. మీ పేరున వీఐపీ నంబర్ వచ్చినట్లే.
వీఐపీ నంబర్‌లను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండిలా!
మీరు కనుక వీఐపీ నంబర్ కావాలనుకుంటే, అది అందుబాటులో ఉందా? లేదా? అనేది ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది ఏమిటంటే?
ముందుగా మీరు MoRTH వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. పేజీ దిగువన ఉన్న 'ఛాయిస్ నంబర్' బటన్‌పై క్లిక్ చేయండి.
తరువాత మీ రాష్ట్రం, మీ ఆర్‌టీఓ కార్యాలయాలను ఎంచుకోండి.
అక్కడ అందుబాటులో ఉన్న వీఐపీ, ఫ్యాన్సీ నంబర్లు అన్నీ కనబడతాయి. లేదా
మీ మదిలో ఉన్న ఫ్యాన్సీ నంబర్‌ను ఎంటర్ చేయండి. అంతే సింపుల్!
మీరు కోరుకున్న నంబర్ కనుక ఉంటే, వెంటనే దానికోసం బిడ్ వేసి, సొంతం చేసుకోండి.
COMMENTS