HIGH SECURITY NUMBER PLATE IN TG
మీరు 2019కి ముందు బండి వాడుతున్నారా? - అయితే నంబర్ ప్లేట్ మార్పించాల్సిందే - లేదంటే?
పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ - సెప్టెంబరు 30లోగా బిగించుకోవాల్సిందే - లేదంటే బీమా సహా అన్ని సేవలూ బంద్
TS Govt Makes Compulsory Of High Security Number Plate : మీరు పాత వాహనాలను ఉపయోగిస్తున్నారా? అది 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైన వాహనమా? అయితే మీ పాత వాహనానికి కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందే. పాత వాహనాలకూ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ నిబంధనను అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. సెప్టెంబరు 30వ తేదీలోగా ఏర్పాటు చేసుకోవాలని గడువు విధించింది.
పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) ఇకపై తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ధరల్ని కూడా ఖరారు చేసింది. వాహన రకాన్ని బట్టి కనిష్టంగా రూ.320 నుంచి గరిష్ఠంగా రూ.800గా ఈ ఛార్జీలను రవాణా శాఖ నిర్ణయించింది. నకిలీ నెంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు, రహదారి భద్రత లక్ష్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కొనాలన్నా, అమ్మేయాలన్నా కుదరదు :
పాత బండ్లకు హెచ్ఎస్ఆర్పీ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ స్పష్టం చేసింది. వాహన యజమానులతో పాటుగా వాహన తయారీ సంస్థలకు, డీలర్లకు, బీమా కంపెనీలు, పొల్యూషన్ టెస్టింగ్ కేంద్రాలకు మార్గదర్శకాలను ఖరారు చేసింది. గడువులోగా పాత వాహనాలకు హెచ్ఎస్ఆర్పీని ఏర్పాటు చేసుకోకుంటే రవాణా శాఖ నుంచి సేవలు అందవు. మీ పాత బండిని ఎవరికైనా అమ్మాలన్నా, ఇతరుల నుంచి కొనాలన్నా రవాణా కార్యాలయంలో యజమాని పేరు మార్చుకోవడం సాధ్యం కాదు.
ఆ తేదీ ముందు వాటికి కచ్చితంగా ఉండాలి :
అదే విధంగా వాహనానికి బీమా చేయించడం, పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవడం వంటివి హెచ్ఎస్ఆర్పీ ఉంటేనే సాధ్యం అవుతాయి. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకుండా రహదారులపై తిరిగే వాహనాలపై కేసులు పెట్టాలని పోలీసు, ఆర్టీఏ అధికారులకు రవాణా శాఖ సూచించింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్ నిబంధన ఇప్పటికే అమలవుతోంది. పాత వాహనాలకూ 'హై సెక్యూరిటీ' ఉండాల్సిందే అని రవాణా శాఖ స్పష్టం చేస్తోంది.
వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్ బిగించే సదుపాయాన్ని కల్పించాలి. ఈ సమాచారం, నెంబర్ ప్లేట్ ధరలు డీలర్ల దగ్గర కనిపించేలా ప్రదర్శించాలి. వాహనదారులు హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్ కోసం వెబ్‌సైట్‌లో వాహన వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి. వాహనానికి హెచ్ఎస్ఆర్పీ బిగించాక ఈ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని రవాణా శాఖ స్పష్టం చేసింది.
రిజిస్ట్రేషన్ చేయకపోతే సేవలు బంద్ :
పాత వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్ ఉంటేనే పాత బీమా పాలసీ రెన్యువల్, కొత్తగా వాహన బీమా పాలసీ చేయాలని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎస్ఆర్పీ లేని పాత వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్లు జారీ చేయవద్దు అని రవాణా శాఖ స్పష్టం చేసింది. పాత వాహనాలకు సరైన హెచ్ఎస్ఆర్పీ లేకుంటే జిల్లా రవాణా అధికారులు, ఇతర అధికారులు ఎలాంటి సేవలు అందించొద్దని రవాణా శాఖ ఆదేశించింది. సెప్టెంబరు 30వ తేదీ తర్వాత హెచ్ఎస్ఆర్పీ లేకుండా తిరిగే వాహనాలు రోడ్లపై తిరిగేందుకు పోలీసు, రవాణా శాఖ అధికారులు అనుమతించొద్దు అని, అలాంటి వాహనాలపై కేసులు నమోదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
ధరలు ఇలా : ఒక్కో రకం వాహనానికి ఒక్కో రుసుం చెల్లించేలా రవాణా శాఖ నిర్ణయించింది. ద్విచక్ర వాహనికి రూ.320లు - రూ.380లు, ద్విచక్ర వాహనం (ఇంపోర్టెడ్)కు రూ.400లు - రూ.500లు, కార్లు రూ.590లు - రూ.700లు, కార్లు(ఇంపోర్టెడ్) రూ.700లు - రూ.860లు, త్రీవీలర్ వాహనం - రూ.350లు - రూ.450లు, కమర్షియల్ వాహనం - రూ.600లు - రూ.800లు చెల్లించేలా రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
COMMENTS