CYBER FRAUD IN KAMAREDDY DISTRICT
విద్యార్థిని ఆటలోకి దింపి ఖాతా ఖాళీ చేశాడు - ఎలాగంటే?
ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్న ఓ విద్యార్థికి సైబర్ నేరగాడి వల - తల్లి అకౌంట్లోంచి డబ్బు మాయం
Cyber Crime Case Registered in Kamareddy District : మొబైల్లో ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్న ఓ విద్యార్థికి సైబర్ నేరగాడు వల వేశాడు. విద్యార్థి తల్లి అకౌంట్లోంచి నగదు మాయం చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
కేసు నమోదు : ఎస్సై సురేశ్ వివరాల ప్రకారం పాల్వంచ మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన విద్యార్థి (14) స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న తన తల్లి మొబైల్లో ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఆటలో మీరు గెలిస్తే రెట్టింపు మొత్తం ఇస్తామని బెట్టింగ్‌కు పురిగొల్పాడు. ఇది వాస్తవమని నమ్మిన ఆ బాలుడు, తన తల్లి అకౌంట్లోంచి రూ.10,000 పందెం కాసి ఓడిపోయాడు. ఇది ఇంట్లో తెలిస్తే తిడతారని, కోల్పోయిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవాలనే భయంతో ఇలా పలుమార్లు రూ.58,000 పందెం కాశాడు. ఆ మొత్తాన్ని ఓడిపోయాడు. చివరకు జరిగినదంతా ఇంట్లో చెప్పడంతో వారు స్థానిక పోలీసులను గురువారం ఆశ్రయించారు. విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు సురేశ్ తెలిపారు.
సైబర్ నేరగాళ్ల బారిన పడినప్పుడు గంటలోపు మేల్కోంటే సాధ్యమైనంత వరకు ప్రమాదం నుంచి బయటపడవచ్చని సైబర్ క్రైం పోలీసులు అంటున్నారు. ఆలోపు నేరగాళ్లు నగదు విత్ డ్రా చేసుకుంటే మాత్రం తిరిగి రప్పించడం కష్టం అవుతుందని అంటున్నారు.
ఎలా ఫిర్యాదు చేయాలంటే :-
https:cybercrime.gov.in పోర్టల్‌ను క్లిక్ చేయాలి.
హోం పేజీలోకి వెళ్లి ఫైల్ ఏ కంప్లైంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.అక్కడ కొన్ని నియమాలు, నిబంధనలు, సూచనలు పూర్తిగా చదవాలి.
రిపోర్ట్ అదర్ సైబర్ క్రైం బటన్‌పై క్లిక్ చేస్తే, తరువాత సిటిజన్ లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పేరు, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ తదితరాలు నమోదు చేయాలి.
రిజిస్టరు ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన అనంతరం క్యాప్చర్ కోడ్ పొందుపరచాలి.
తరువాత పేజీలోకి వెళ్తుంది. సైబర్ నేరం గురించి పూర్తిగా వివరించాలి. అక్కడ సెక్షన్లుగా విభజించి ఉంటుంది. సాధారణ వివరాలు, సైబర్ నేరానికి సంబంధించి వివరాలు, ప్రివ్యూ అని ఉంటాయి.
ప్రతి సెక్షన్‌లో అడిగిన వివరాలు నమోదు చేస్తూ ప్రక్రియను పూర్తి చేయాలి. 3 సెక్షన్లు పూర్తి అయ్యాక ప్రివ్యూ పరిశీలించాలి.
అన్ని వివరాలు సక్రమంగా ఉంటే సబ్మిట్ చేయాలి. తరువాత ఘటన ఎలా జరిగిందో పూర్తిగా వివరించాలి. సైబర్ నేరానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు అకౌంట్ లావాదేవీలు వంటి ఆధారాలు, సాక్ష్యాలు అందులో జత చేయాలి.
అన్ని మరోసారి పరిశీలించి సబ్మిట్ చేస్తే కన్షర్మేషన్ సమాచారం వస్తుంది. కంప్లైంట్ ఐడీతో పాటు ఇతర వివరాలు ఈ-మెయిల్ ఐడీకి వచ్చేస్తాయి. ఆ తరువాత అధికారులు దర్యాప్తు మొదలుపెడతారు.
ఫిర్యాదు చేయడం ఆలస్యం అయితే దుండగులు వేరు వేరు అకౌంట్‌ల్లోకి డబ్బు బదిలీ చేస్తారు. లేకుంటే క్రిప్టో కరెన్సీగా ఆపై డాలర్లుగా మార్చుకునే అవకాశం ఉంది.
COMMENTS