CAREERS IN ONLINE GAMING INDUSTRY
ఆన్‌లైన్ గేమింగ్ తయారీపై మీకు ఆసక్తి ఉందా? - ఇక మీ దశ తిరిగినట్లే!
రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్న గేమింగ్ రంగం - మరో నాలుగేళ్లలో గేమింగ్ సంస్థల ఆదాయం రూ.80వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా - గేమింగ్ పరిశ్రమలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలం
Careers In Online Gaming Industry : 20 ఏళ్ల కింద ఆన్‌లైన్ గేమింగ్ అంటే చెడు వ్యసనంగా పరిగణించేవారు. ఆ దశ నుంచి నేడు ఎక్కువమంది ఆమోదించే స్థాయి వరకు ఇది చేరుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌లో ప్రయోజనాలు కనిపిస్తుండటం వల్ల దీన్ని చూసే దృష్టిలో క్రమంగా మార్పు వచ్చింది. నేడు ఇది ఉద్యోగాల కల్పతరువుగానూ అవతరించింది!
మనదేశంలో 59 కోట్ల మంది ఆన్‌లైన్ గేమర్లు ఉన్నారు. వీరంతా కలిసి వివిధ గేమ్ యాప్‌ల నుంచి 1120 కోట్ల డౌన్‌లోడ్లు చేసుకున్నారంటే ఈ పరిశ్రమ ఎంత శరవేగంగా వృద్ధి చెందుతోంది అనే విషయం తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 1900 గుర్తింపు పొందిన గేమింగ్ కంపెనీల్లో లక్షా 30 వేల మంది ఐటీ నిపుణులు విధులు నిర్వర్తిస్తున్నారు. 2024లో దేశ గేమింగ్ సంస్థల ఆదాయం అక్షరాల రూ.32 వేల కోట్లు. మరో నాలుగేళ్లకు ఇది రూ.80 వేల కోట్లకు చేరుకోవచ్చనే అంచనా ఉంది. దీనికి తగ్గట్టుగా గేమింగ్ పరిశ్రమలో యువతకు ఉద్యోగావకాశాలు పుష్కలంగా రానున్నాయి.
ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ వృద్ధికి కారణాలెన్నో :
ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ పురోగతికి కారణాలు తెలుసుకుంటే ఈ రంగంలో ప్రవేశించాలనుకునేవారు ఏ కంటెంటుపై దృష్టి పెట్టాలి అనే విషయం స్పష్టమవుతుంది.
మేధాపరమైన మేలు : గేమింగ్ వల్ల కీడు కంటే మేలే ఎక్కువ జరుగుతోందని కొన్ని రిపోర్ట్లు వెల్లడించాయి. కంటికీ- చేతికీ మధ్య సమన్వయాన్ని పెంచడంతో పాటు సమస్యా పరిష్కార నైపుణ్యం, సమాచారాన్ని విశ్లేషించే సామర్ధ్యాలు పెరుగుతాయని నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఒత్తిడి చిత్తు : మన దైనందిన జీవితంలో విసిగి వేసారినప్పుడు కొన్ని ఇంటరాక్టివ్ గేమ్స్ అనేవి మనసును తేలిక పరచి ఒత్తిడిని పారదోలుతాయని నిరూపితమయింది.
జ్ఞాపకశక్తి పెరుగుదలకు : కొన్ని రకాల గేమ్స్‌తో జ్ఞాపకశక్తినీ, చురుగ్గా ఆలోచించే శక్తినీ పెంపొందిస్తున్నాయని గుర్తించారు.
సృజనాత్మక ఆలోచనా ధోరణి : ఉన్నత స్థాయికి చెందిన గేమ్స్ వాటిని ఆడేవారికి పలు సవాళ్లు విసురుతాయి. వినూత్న పంథాలో వాటికి పరిష్కారాలను వేగంగా ఆలోచింపజేస్తాయి. వీటివల్ల మూస దారిలో కాకుండా కొత్తగా ఆలోచించే శక్తి మెరుగవుతుంది.
విద్య, అభ్యసన : ఎడ్యుకేషన్ గేమ్స్ అనేవి విజ్ఞానదాయకంగా ఉండి కొత్త కొత్త విషయాలను తెలుసుకునేలా, నూతన నైపుణ్యాల సాధనను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయి.
ఆన్‌లైన్ గేమింగ్‌లో కీడు చేసే ప్రమాదకరమైనవి కొన్ని ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తతో ఎంచుకుంటే గేమింగ్ అలవాటును కెరియర్ ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ నైపుణ్యాలను పెంచే కంటెంటుతో వచ్చే గేమ్స్ మంచి ఆదరణ పొందుతున్నాయి.
యువజనులదే హవా : గేమింగ్ ఇండస్ట్రీకి యువతే పెట్టుబడి. 140 కోట్లు ఉన్న మన దేశ జనాభాలో 45 శాతం మంది అంటే 60 కోట్ల మంది 35 ఏళ్ల వయసులోపు ఉన్నవారే ఉన్నారు. మరే దేశానికీ లేనటువంటి సౌలభ్యం మనదేశానికి ఉండటంతో గేమింగ్ పరిశ్రమ మూడు పువ్వులు- ఆరు కాయలుగా అలరారుతోంది. మరో పక్క దేశ జనాభాలో 75 శాతం మంది ఫోన్లను ఉపయోగిస్తున్నారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇంకోపక్క వైఫై సౌకర్యం దేశం నలుమూలలకూ శరవేగంగా విస్తరిస్తోంది. ఇవన్నీ గేమింగ్ రంగ వికాసానికి పునాదులు వేస్తున్నాయి. దీంతో కొత్త కంపెనీలు ఉత్సాహంగా గేమింగ్ రంగంవైపు క్రమంగా అడుగులు వేస్తున్నాయి.
ఆటలు ఆదాయ మార్గాలు : దేశ గేమింగ్ పరిశ్రమకు వచ్చే ఆదాయంలో 90 శాతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నుంచే. మొబైల్ గేమింగ్‌లో ఉచితంగా లభించేవీ, కొనుగోలు చేయాల్సినవీ కూడా ఉన్నాయి. యాప్ అన్నే-2023 రిపోర్ట్ ప్రకారం ఫ్రీ డౌన్‌లోడ్ గేమ్స్ ముమ్మరంగా ఉన్నప్పటికీ మొబైల్ గేమర్స్‌లో 70 శాతం మంది కొనుగోలు చేసేందుకు వెనుకాడటం లేదు. భారీ పెట్టుబడితో వేలల్లో ఐటీ నిపుణులను నియమిస్తూ మార్కెట్లోకి ప్రవేశించాలనుకునే గేమింగ్ కంపెనీలకు ఇది శుభవార్తే అని చెప్పాలి!
పెరుగుతున్న పీసీ మార్కెట్ : పర్సనల్ కంప్యూటర్లో(పీసీ) మాత్రమే ఆడే గేమ్స్ మార్కెట్ కూడా క్రమేపీ పుంజుకుంటోంది. 2023లో గేమింగ్ ల్యాప్‌టాప్ ధరలు 10 శాతం తగ్గాయి. దీంతో అప్పటివరకూ ప్రియంగా భావించిన యువ కొనుగోలుదారులు ఇటువైపు ఆసక్తి చూపుతున్నారు.
ఈ-స్పోర్ట్స్ మున్ముందుకు : గేమింగ్ ఇండస్ట్రీలో భాగంగా పరిగణిస్తున్న ఈ - స్పోర్ట్స్ వీడియో గేమింగ్ మార్కెట్ క్రమేపీ విస్తరిస్తోంది. మైదానాల్లో స్పోర్ట్స్ నిర్వహించడానికి బదులు వర్చువల్‌గా ప్రొఫెషనల్ క్రీడాకారులు పాల్గొనే విధంగా ఈ- స్పోర్ట్స్ నిర్వహించడం మనదేశంలో ఇటీవల కాలంలో పెరిగింది. దీనికి నిర్వాహకులు ప్రైజ్ మనీ కూడా ప్రకటిస్తుండటం వల్ల యువత ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెషనల్ ఈ-గేమర్స్ 2028 నాటికి రెండున్నరరెట్లు పెరిగి 1250 మందికి చేరతారన్న అంచనాల మధ్య గేమింగ్‌లో ఈ విభాగం వృద్ధి ఖాయమని అంచనాలున్నాయి.
గేమింగ్ పరిశ్రమలోని వివిధ ఉప విభాగాల వృద్ధి కారణంగా భవిష్యత్తులో యువతకు ఉద్యోగావకాశాలకు ఢోకా లేదని తెలుస్తోంది. గేమింగ్‌లో ప్రధానమైన కంటెంట్, టెక్నాలజీ పరంగా ఏ నైపుణ్యాలతో ప్రవేశం సులభతరమవుతుందో అవగాహన పెంచుకోవటమే ప్రస్తుత కర్తవ్యం!.
COMMENTS