CAN LOAN RECOVERY AGENTS VISIT HOME
లోన్ రికవరీ ఏజెంట్స్ మిమ్మల్ని వేధిస్తున్నారా? లీగల్‌గా వారికి చెక్ పెట్టండిలా!
రుణ రికవరీ ఏజెంట్లు మీ ఇంటికి, ఆఫీస్‌కు వచ్చిన ఇబ్బందిపెడుతున్నారా? మీ లీగల్ రైట్స్ గురించి తెలుసుకోండి!మిమ్మల్ని లోన్ రికవరీ ఏజెంట్స్ ఇబ్బంది పెడుతున్నారా?
ఇంటికి, ఆఫీస్‌కు వచ్చి పది మంది ముందు మిమ్మల్ని కించపరుస్తూ, గౌరవం లేకుండా మాట్లాడుతున్నారా? శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.
ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు కచ్చితంగా సకాలంలో రుణాలు చెల్లించాలి. లేని పక్షంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రికవరీ ఏజెంట్లను మీ వద్దకు పంపించవచ్చు. అయితే ఆ ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీలులేదు. ఒక వేళ మీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, వాళ్లపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఆఫీస్‌కు వచ్చి ఇబ్బంది పెడుతున్నారా?
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, లోన్ రికవరీ ఏజెంట్లు నిర్దేశిత సమయాల్లో మాత్రమే మీ ఇంటికి రావచ్చు. అంతేకానీ ఎప్పుడుబడితే అప్పుడు మీ ఇంటికి, ఆఫీస్‌కు రావడానికి వారికి అనుమతి లేదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో, ఆఫీస్ సమయం తరువాత వచ్చి రుణ గ్రహీతలను ఇబ్బంది పెట్టకూడదు. అంతేకాదు ఆ లోన్ రికవరీ ఏజెంట్లు మీ పరువు, మర్యాదలకు, గోప్యతకు భంగం కలిగించకూడదు. మీ ప్రాథమిక హక్కులకు, విధులకు ఆటంకం కలిగించకూడదు. అనాగరికంగా, అనైతికంగా ప్రవర్తించకూడదు. ఒక వేళ లోన్ రికవరీ ఏజెంట్లు అనుచితంగా ప్రవర్తిస్తే, కచ్చితంగా వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు.
శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారా?
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, లోన్ రికవరీ ఏజెంట్లు కచ్చితంగా బ్యాంక్ గుర్తింపు కలిగి ఉండాలి. మీరు తీసుకున్న రుణం, రుణ స్థితి, వడ్డీ, ఈఎంఐ బకాయిలు మొదలైన వాటి గురించి మీకు స్పష్టంగా వాళ్లు వివరించి చెప్పాలి.
అంతేకానీ రుణగ్రహీతలను కొడతామని, ప్రాణాలు తీస్తామని బెదిరించకూడదు. తిట్టడం, తప్పుడు మాటలు మాట్లాడడం, మానసికంగా మిమ్మల్ని వేధించడం చేయకూడదు. రుణాలు తీర్చమని బలవంతం చేయడం, బెదిరించడం చేయకూడదు. ఒక వేళ అలా చేస్తే కచ్చితంగా వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు.
రుణగ్రహీతలకు ఉన్న చట్టబద్ధమైన హక్కులు ఇవే!
1. మీ ప్రైవసీకి భంగం కలిగించకూడదు : భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, జీవించే హక్కుకు, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకూడదు. దీని ప్రకారం, లోన్ రికవరీ ఏజెంట్లు మీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదు. అంటే అందరి ముందు (పబ్లిక్‌గా) మీ రుణం, మీ రుణ స్థితి, చెల్లించాల్సిన వడ్డీ మొదలైన వివరాల గురించి మాట్లాడకూడదు. అలాగే మీ వ్యక్తిగత వివరాలను, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, అప్పుల వివరాలను ఇతరులకు చెప్పకూడదు. ఒకవేళ లోన్ రికవరీ ఏజెంట్లు మీ గోప్యతకు భంగం కలిగిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు.
2. మీ గౌరవానికి భంగం కలిగించకూడదు : భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 - చట్టం ముందు సమానత్వాన్ని, ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు తీసుకునే ఏకపక్ష చర్యల నుంచి రక్షణను కల్పిస్తుంది. దీని ప్రకారం, లోన్ రికవరీ ఏజెంట్లు రుణ గ్రహీతల గౌరవ, మర్యాదలకు ఎలాంటి భంగం కలిగించకూడదు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు లేదా పరస్పరం అంగీకరించిన సమయాల్లో మాత్రమే లోన్ రికవరీ ఏజెంట్లు- రుణగ్రహీతలను సంప్రదించాలి.
3. కచ్చితంగా నోటీస్ ఇవ్వాలి : రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ ప్రకారం, చట్టబద్ధమైన అధికారం (అథారిటీ ఆఫ్ లా) ద్వారా తప్ప ఏ వ్యక్తీ తన ఆస్తిని కోల్పోకూడదు. దీని ప్రకారం, బ్యాంకులు, రుణ గ్రహీతల నుంచి లోన్ రికవరీ చేయాలంటే, ముందుగా పూర్తి వివరాలతో వారికి నోటీస్ పంపించాల్సి ఉంటుంది. ఇలా పంపిన నోటీసును రుణగ్రహీతలు చదువుకోవడానికి, ఆలోచించుకోవడానికి, బ్యాంక్‌తో ఈ విషయంగా చర్చించడానికి తగిన సమయం ఇవ్వాలి. ఒకవేళ లోన్ డిఫాల్ట్ అయితే ఆస్తి వేలం వేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా ముందుగా రుణ గ్రహీతకు ఆ విషయం చెప్పాలి. మొత్తం అప్పు, వేలం వేయాలని అనుకుంటున్న ఆస్తి విలువ మొదలైన వాటి గురించి వివరంగా సమాచారం ఇవ్వాలి.
4. ఫిర్యాదు చేసే హక్కు : ఒకవేళ లోన్ రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, ముందుగా మీకు రుణం ఇచ్చిన బ్యాంక్‌కు ఫిర్యాదు చేయాలి. అక్కడ కూడా మీ సమస్య తీరకపోతే, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాలి. అక్కడ కూడా సరైన స్పందన రాకపోతే, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేయవచ్చు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం, ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఎవరైనా వేధిస్తుంటే, దానిపై ఫిర్యాదు చేసే హక్కు, చట్టబద్ధమైన పరిష్కారాన్ని కోరే హక్కు కూడా ఉంటుంది.
లీగల్ యాక్షన్ తీసుకోండిలా!
మీరు ఎంత చెప్పినా వినకుండా, లోన్ రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని భౌతికం, శారీరంగా వేధిస్తూ, బెదిరిస్తూ ఉంటే; ఎప్పుడుబడితే అప్పుడు ఫోన్ కాల్స్ చేస్తుంటే; సమయం, సందర్భం లేకుండా ఎక్కడబడితే అక్కడకు వస్తుంటే- అప్పుడు ఏం చేయాలి?- లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల గురించిన ఆధారాలు, రికార్డ్‌లు సిద్ధంగా ఉంచుకోవాలి
- రుణదాత ఫిర్యాదుల పరిష్కార బృందం (లెండర్స్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ టీమ్)కు ఫిర్యాదు చేయాలి.
- బ్యాంక్‌కు ఫిర్యాదు చేస్తూ పంపిన ఈ-మెయిల్ ఐడీ కాపీని మీ దగ్గర ఉంచుకోవాలి.
- బ్యాంక్ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే, వెంటనే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాలి.
- అలాగే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయించండి. అప్పుడు మీ సమస్య తీరే ఛాన్స్ ఉంటుంది.
- లోన్ రికవరీ ఏజెంట్లపై నిఘా ఉంచడంలో, వారిని నియంత్రించడంలో విఫలమైన బ్యాంకులను లేదా రుణ సంస్థలను శిక్షించే అధికారం ఆర్‌బీఐకి ఉంది. అంతేకాదు సదరు లోన్ రికవరీ ఏజెంట్లపై పరిమితిలు లేదా నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక, న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఆర్థిక, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
COMMENTS