BIOFUEL BRICKS IN ADILABAD
పత్తి కట్టెలను పొలంలోనే కాల్చేస్తున్నారా? - వీరికి ఇచ్చి రూ.వేలల్లో ఆదాయం పొందండి.
రైతులకు ఆదాయ వనరుగా మారిన పత్తి కట్టె - ఎకరాకు రూ.1000 చెల్లించి కొనుగోలు చేస్తున్న కంపెనీ - ఎకరా పొలం నుంచి తయారవుతున్న 6 క్వింటాళ్ల బ్రిక్స్
Biofuel Bricks in Adilabad : పత్తి పంట చేతికొచ్చిన తర్వాత వ్యర్థంగా పొలంలో పడి ఉండే పత్తి కట్టె ఇప్పుడు రైతులకు ఆదాయవనరుగా మారింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ కంపెనీ బయో ఫ్యూయల్ బ్రిక్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. దీంతో ఆ కంపెనీ అవసరం మేరకు పత్తి కట్టెను కొనుగోలు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 11 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. దాదాపు 3.60 లక్షల మంది రైతులు సాగుచేస్తుండగా, పంట అనంతరం టన్నుల కొద్దీ పత్తి కట్టె వ్యర్థంగా పోగవుతోంది.
ఎకరాకు రూ.1000 చొప్పున : సాధారణంగా రైతులు ఈ కట్టెను పొలాల్లోనే కాల్చేస్తుంటారు. అయితే బయోఫ్యూయల్ కంపెనీ ప్రతినిధులే పొలాలకు వెళ్లి పత్తి కట్టెను సేకరిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో రోజుకు 70 టన్నుల పత్తి కట్టెను కొనుగోలు చేస్తోంది. ఇలా గత ఏడాది 9 వేల టన్నులు కొనుగోలు చేసినట్లు కంపెనీ వారు చెప్పారు. రైతులకు ఎకరాకు రూ.1000 చొప్పున చెల్లించి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. రైతుల పొలాల్లోకి ఒక యంత్రాన్ని పంపించి, అక్కడే పత్తి కట్టెను పిప్పిగా మార్చి తీసుకెళుతున్నారు.
పర్యావరణ పరిరక్షణ : ఈ పిప్పిని యంత్రాల ద్వారా బ్రిక్స్‌గా తయారు చేసి, సంచుల్లో నింపి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎకరా పొలం నుంచి సేకరించిన కట్టెతో తేమ శాతం, వృథా పోను సుమారు 6 క్వింటాళ్ల ఇటుకలు తయారవుతాయి. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా అనేక పరిశ్రమలు ఈ బ్రిక్స్ కొనుగోలుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. పత్తి బ్రిక్స్ వినియోగిస్తే పొగ రాకపోవడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుండటంతో ఎక్కువగా డెయిరీ, ఫార్మసీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని పలు ఇండస్ట్రీలకు వీటిని రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఇటుకలు కిలో ధర రూ.6 నుంచి 7 వరకు ఉంది.
భూసారం దెబ్బ తినకుండా : రైతులు పత్తి పంట పూర్తి కాగానే కట్టెను తొలగించి పొలంలోనే నిప్పు పెట్టి కాల్చేస్తుండటంతో వాతావరణ కాలుష్యంతో పాటు భూసారం దెబ్బ తింటుందని, మిత్ర పురుగులు చనిపోతున్నాయని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. పొలం నుంచి వ్యర్థంగా ఉన్న పత్తి కట్టెను పూర్తిగా తరలించడంతో గులాబీ పురుగు వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు.
COMMENTS