Bhu Bharati Portal Services Telangana Govt
Bhu Bharati Portal: ‘భూ భారతి’ సేవలు ఏమిటి ? ఛార్జీలు ఎంత ?
Bhu Bharati Portal: భూ భారతి చట్టం అమలుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఏప్రిల్ 14 నుంచే దీనికి సంబంధించిన ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. bhubharati.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఇక నుంచి మనం భూముల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే అన్ని మండలాలకు భూభారతి పోర్టల్ సేవలను విస్తరించనున్నారు. ఇంతకీ ఈ పోర్టల్ ద్వారా అందే సేవలు ఏమిటి ? ఛార్జీలు ఎంత ? తెలుసుకుందాం..
అంచెల వారీగా అప్పీళ్లకు ఛాన్స్
భూభారతి(Bhu Bharati Portal) పోర్టల్ ద్వారా పట్టాదారులకు కొత్త పాస్ పుస్తకాలను జారీ చేయనున్నారు. భూమి యజమాని రూ.300 చెల్లించి దరఖాస్తు చేస్తే, సర్వే చేసి, మ్యాప్‌ను రూపొందించి పట్టా పాస్‌బుక్‌ను అధికారులు జారీ చేస్తారు. వివరాల్లో ఏవైనా లోపాలు ఉంటే ఎమ్మార్వో సరిదిద్దుతారు. ఆయన తీసుకునే నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ఆర్డీవోకు, తదుపరిగా కలెక్టర్ స్థాయిలో అప్పీల్ చేయొచ్చు. కలెక్టర్ తీసుకునే నిర్ణయంపైనా అభ్యంతరాలుంటే భూ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించొచ్చు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చి ధరణి పోర్టల్ వ్యవస్థలో అప్పీళ్లకు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో చాలా మంది కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది.మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచిత న్యాయసహాయం అందించేందుకు భూభారతి చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలను చేర్చారు. అవసరమైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు రూ.100 జరిమానా చెల్లిస్తే, వాటిని లీగల్‌గా చేర్చే అవకాశం కల్పించారు.మొత్తం మీద భూభారతి పోర్టల్ ద్వారా భూ వివాదాలకు తక్షణ పరిష్కారం లభిస్తుంది.
భూమి రికార్డులు పొందడం ఈజీ
bhubharati.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి భూమి ఉన్న జిల్లా, మండలం, గ్రామం వివరాలు లేదా పాస్‌బుక్ నెంబర్ ఎంటర్ చేసి భూమి రికార్డులన్నీ పొందొచ్చు. యజమాని పేరు, భూమి పరిమాణం, లొకేషన్, రిజిస్ట్రేషన్ వివరాలు, ల్యాండ్ మ్యుటేషన్ స్థితి వంటి సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు భూభారతిలో ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ప్రతి ఏడాది డిసెంబర్ 31న గ్రామ రికార్డులను భూభారతి పోర్టల్‌లో అప్‌డేట్ చేసి భద్రపరుస్తారు. అత్యంత సరళమైన భాషతో పాటు తక్కువ మాడ్యూల్స్ తో సేవలు అందుబాటులో ఉంటాయి. భూ- భారతి చట్టం ప్రకార ప్రతి భూకమతానికి భూ ఆధార్ ఇస్తారు.
భూ భారతి సేవలు, ఫీజులివీ..
భూమి యజమాని రూ. 300 చెల్లించి దరఖాస్తు చేస్తే పట్టాదారు పాసుపుస్తకం ఇస్తారు.
భూ భారతి పోర్టల్ లో నిర్దేశించిన నమూనాలో మ్యుటేషన్ దరఖాస్తు కోసం ఎకరానికి రూ. 2500 చొప్పున చెల్లించాలి. ఈ లెక్క ప్రకారం గుంటకు రూ. 62.50 ఛార్జీ పడుతుంది.
రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన స్టాంప్ డ్యూటీ ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. ఇది ఏరియాను బట్టి మారుతుంది.
భూ యజమాని రికార్డుల్లో తప్పుల సవరణ దరఖాస్తుకు రూ. 1000 ఫీజు చెల్లించాలి.
భూ హక్కులతో పాటు అధికారులు ఇచ్చిన రికార్డుల్లో తప్పులుంటే అప్పీల్ కు వెళ్లొచ్చు. ఇందుకోసం రూ. 1000 చొప్పున చెల్లించాలి.
స్లాట్ బుకింగ్ ద్వారానే భూ భారతి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అనుకున్న సమయానికి స్లాట్ రాకపోతే మార్పులు చేసుకోవచ్చు. మొదటిసారి ఉచితంగానే మార్పు చేసుకోవచ్చు. రెండోసారి స్లాట్ మార్చుకునేందుకు రూ. 500 చెల్లించాలి. మూడోసారి అయితే రూ. 1000 చెల్లించాలి.
COMMENTS