ADULTERATED TEA POWDER SALES IN HYD
రోడ్ సైడ్ టీ సూపర్ టేస్టీగా ఉంటోందా? - సీక్రెట్ తెలిస్తే జన్మలో బయట చాయ్ తాగరు!
హైదరాబాద్‌లో పెరుగుతున్న నకిలీ టీ పౌడర్ - తనిఖీల్లో పలుచోట్ల రంగు కలిపిన పొడి గుర్తింపు - హానికరమైన రంగులు కలుపుతూ విక్రయాలు - దీర్ఘాకాలిక రోగాలకు కారణం అంటున్న నిపుణులు.
Adulterated Tea Powder Sales Increasing in Hyderabad : తిండి మానేస్తారేమో గానీ టీ తాగకుండా రోజు గడవని వారు హైదరాబాద్‌లో అడుగడుగునా కనిపిస్తారు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయే వరకు తేనీటిని తాగుతుంటారు. చాయ్ ప్రియులారా ఇక నుంచి కాస్త జాగ్రత్త పడాలంటూ జీహెచ్‌ఎంసీ ఇటీవల చేపట్టిన పరీక్షలు స్పష్టం చేస్తున్నాయి. సికింద్రాబాద్, చందానగర్, ఫతేనగర్ తదితర ప్రాంతాల్లో గుట్టలుగా స్వాధీనం చేసుకున్న నకిలీ టీ పొడిని నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాలలో పరీక్షించగా, అందులో హానికర సింథటిక్ రంగులు వాడినట్లు వెల్లడైంది. టీ పొడితో పాటు మంచి ఆరోగ్యం కోసం తినే ఎండు కివీ పండు ముక్కులు, బెల్లంలోనూ హానికర రంగును కలిపినట్లు పరీక్షల్లో తేలింది.
కొబ్బరి చిప్పల పొడి కావొచ్చు : రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. పోలీసులు, ఆహార భద్రతాధికారులు ఇప్పటి వరకు రెండు నుంచి మూడు టన్నుల నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అక్టోబరు 2024లో ఫతేనగర్‌లో 300 కేజీల కల్తీ టీ పౌడర్, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వాధీనం చేసుకున్నారు. జగన్నాథ్ కోణార్క్ టీ పొడి పేరుతో ప్యాకింగ్ చేసినట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు. డిసెంబరు 2024లో చందానగర్‌లోని ఓ ఇంట్లో 150 కేజీల నకిలీ పౌడర్‌ను పట్టుకున్నారు.
చందానగర్‌లో పట్టుకున్న నకిలీ పొడి.
దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం : 500 గ్రాముల ఇడకోల్ సన్‌సెట్ ఎల్లోకలర్, 500 గ్రాముల నీల్ కియాన్ కలర్, 12 ఇలాచి వాసన వచ్చే ద్రవం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకోగా, చందానగర్ సర్కిల్ ఆహార భద్రతాధికారి హృదయ ఆ నమూనాలను ప్రయోగశాలకు పంపారు. టీ పొడిలో హానికర రంగును కలిపినట్లు తేలింది. ఎల్బీనగర్‌లో ఈ ఏడాది మార్చిలో చేపట్టిన తనిఖీల్లోనూ నకిలీ పౌడర్ పెద్ద ఎత్తున దొరికింది. అందులోనూ రంగు ఉన్నట్టు పరీక్షల్లో గుర్తించారు. నామమాత్రపు పొడి రంగుతో ఎక్కువ తేనీటిని తయారు చేసేందుకు సింథటిక్ రంగులను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాంటి తేనీటితో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు గురవుతారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రంగులో ముంచి, చక్కెర చల్లి : 2025 ఫిబ్రవరి 1న చందానగర్‌లోని ఓ సూపర్ మార్కెట్లో లూజ్ డ్రైడ్ కివీ ముక్కలను స్వాధీనం చేసుకుని, ప్రయోగశాలకు పంపించగా, వాటిలో సింథటిక్ రంగును పెద్ద ఎత్తున ఉపయోగించినట్టు ప్రయోగ శాల తేల్చింది. ఎండిన కివీ ముక్కలు ముదురు పసుపు రంగులోకి మారుతాయి, వాటిని ఆకుపచ్చ రంగులో ముంచి, స్వల్పంగా వాటిపై చక్కెర ద్రవాన్ని పిచికారీ చేసినట్లు అధికారులు వివరించారు.
ఏం వాడాలో సూచిస్తూ : చాలా మంది వ్యాపారులు ఆహార పదార్థాల తయారీలో రంగుల వినియోగాన్ని ఆపేశారు. తనిఖీలకు వెళ్లినప్పుడు వంట మనుషులు, హోటళ్ల యాజమాన్యాలకు రంగుల వాడకం వల్ల వినియోగదారులకు తలెత్తే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నట్టు ఎఫ్‌ఎస్‌ఓ హృదయ ‘ఈటీవీ భారత్’తో తెలిపారు. సింథటిక్ రంగులకు బదులు, కశ్మీరీ మిరప పొడి ద్రవం, కుంకుమ పువ్వు ద్రవం, హల్దీ పొడిని ఉపయోగించాలని సూచిస్తున్నామన్నారు. సింథటిక్ రంగులతో చేసే ఆహారోత్పత్తులను తింటే దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
COMMENTS