ACB OFFICIALS ARRESTED ENC HARIRAM
రూ.100 కోట్ల అవి'నీటి' తిమింగలం! - కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ అరెస్ట్
కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు - కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్ - కాళేశ్వరం అనుమతులు, రుణాల్లో కీలకంగా వ్యవహరించిన హరిరామ్.
ACB Officials Arrested ENC Hariram : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటి పారుదల శాఖ గజ్వేల్ ఈఎన్‌సీ భుక్యా హరిరామ్‌ను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టిన ఏసీబీ, సాయంత్రం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం రాత్రి వరకూ గుర్తించిన అక్రమాస్తుల విలువ సుమారు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశముందని, అక్రమాస్తుల వాస్తవ విలువ భారీగా ఉంటుందని ఏసీబీ వివరించింది.
ఈ ప్రాంతాల్లో ఆస్తులు :
షేక్‌పేట, కొండాపూర్‌లో రెండు విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్‌లో మూడు ఫ్లాట్లు, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్‌చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ నివాసాలు, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల్లో ఫామ్‌హౌస్ మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం, మిర్యాలగూడలో ఖాళీ స్థలం, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు అధికారులు గుర్తించారు.
హరిరామ్ నివాసాలు, కార్యాలయాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు మొదలయ్యాయి. షేక్‌పేటలోని ఆదిత్య రాయల్ ఫామ్‌లోని హరిరామ్ విల్లాకు చేరుకున్న ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు మొదలుపెట్టింది. దీనికి సమాంతరంగా రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. జలసౌధ మొదటి అంతస్తులోని ఈఎన్సీ కార్యాలయం, కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు కార్పొరేషన్ కార్యాలయంలో కొన్ని బృందాలు తనిఖీ చేశాయి. మూడు ఆస్తులకు చెందిన పన్ను రసీదులు, పలు ధ్రువపత్రాలు, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన పత్రాలను గుర్తించినట్లు తెలిసింది. వీటితోపాటు పలు దస్త్రాలను సీజ్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.
హరిరామ్ బినామీ ఆస్తుల వివరాలనూ రాబట్టేందుకు అనిశా సోదాలు కొనసాగిస్తోంది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో వ్యవసాయ భూమి ఉందని గుర్తించిన ఏసీబీ, తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాలను పరిశీలించి స్వాధీనం చేసుకుంది. ఉదయం 9 గంటలకు నాలుగు వాహనాల్లో వచ్చిన అధికారులు రాత్రి 9 గంటల వరకు తనిఖీలు కొనసాగించారు.
వారింట్లో కూడా సోదాలు :
2017 నుంచి 2022 వరకు జరిగిన రిజిస్ట్రేషన్ దస్తావేజులను పరిశీలించారు. వాటిలో హరిరామ్‌కు సంబంధించిన వ్యక్తుల పేరున పలు డాక్యుమెంట్లు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఆయనకు బినామీగా ఓ స్థిరాస్తి వ్యాపారి వ్యవహరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మిగిలిన ఆస్తులకు ఎవరెవరు బినామీగా ఉన్నారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో హరిరామ్ సోదరుడు, విశ్రాంత సింగరేణి ఉద్యోగి భూక్య జోషిరామ్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది.
COMMENTS