KANTAR WORK FROM HOME FRAUD
రూ.6000 చెల్లిస్తే రోజుకు 200, లక్ష కడితే 5వేలు - వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట మరో భారీ మోసం.
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట యాప్ - వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి లక్షలు దోచుకున్న నిందితులు - మెదక్ జిల్లాలో ఘటన.
Kantar Work From Home Fraud in Medak : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట యాప్ క్రియేట్ చేసి వందల మంది నుంచి లక్షలు దోచుకున్న ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కౌడిపల్లి మండలంలో కాంతర్ అనే యాప్‌లో అందరిని యాడ్ చేశారు. అందులో జాయిన్ అయిన వారిని జీ1, జీ2, జీ3, జీ4, జీ5 పేరిట ఐదు వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి వారిని అందులో చేర్చారు.
ఒక్కసారి చెల్లిస్తే ఏడాది పాటు డబ్బులు : ఒక్కో గ్రూపులో సుమారుగా 500 మందికిపైగా సభ్యులు ఉన్నారు. ఒక్కో సభ్యుడు సుమారుగా రూ.6000 చెల్లిస్తే రోజుకు రూ.200 చొప్పున ఏడాది పాటు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. అంటే సంవత్సరానికి రూ.73వేలు వస్తాయని ఆశ చూపించారు. అలాగే రూ.20వేలు చెల్లిస్తే రోజూ రూ.700, రూ.50వేల చెల్లిస్తే రోజూ రూ.2వేలు, రూ.లక్ష కడితే రూ.5వేలు చొప్పున తిరిగి ఇస్తామనడంతో చాలా మంది ఈ యాప్‌లో జాయిన్ అయ్యారు.
మొదట దీంట్లో చేరిన వారికి మొదట్లో డబ్బులు చెల్లించారు. వారికి డబ్బులు రావడంతో వాటిని స్క్రీన్ షాట్లు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడంతో మిగతావారు కూడా నమ్మి దీంట్లో జాయిన్ అయ్యారు. మొదటగా వారికి డబ్బులు చెల్లించి, ఉన్నట్లుండి డబ్బులు చెల్లించడం ఆపేశారు.
"మా ఇంటి దగ్గర ఒక ఆమె ఇందులో జాయిన్ అవ్వండి రోజుకు రూ.200 వస్తాయని చెప్పారు. అందుకు ఇంట్లో ఉన్న వెండి అమ్మి మరి కట్టాము. మొదలు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదని అడిగేసరికి మా ఇంటికి వెళ్తే నాకు కట్టారా డబ్బులు యాప్‌కు కట్టారు. మీపైనే పోలీస్ కేసు పెడతామని మమ్మల్నే అంటుంది." - బాధితురాలు
ఈజీ మనీకి అలవాటు పడొద్దు :
మోసపోయామని గ్రహించిన వారు కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని గ్రూపు అడ్మిన్ అంతా యుకే నుంచి కొనసాగుతుందని కౌడిపల్లి ఎస్సై తెలిపారు. మెదక్ జిల్లా కౌడిపల్లి, నర్సాపూర్, కొల్చారం, మెదక్ పలు మండలాలకు చెందిన బాధితులు ఉన్నారని తెలిపారు. ఎవరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడి ఇలాంటి యాప్‌లను నమ్మి మోసపోవద్దని వారు తెలిపారు.
COMMENTS