THE IMPACT OF BETTING APPS ON YOUTH
ఇన్‌ఫ్లూయెన్సర్ల మాటలు నమ్మి అప్పుల ఊబిలో యువత!
బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడి యువత విలవిల - ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రభావంతో భారీగా రుణాలు - అప్పులు తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్యలు.
Impact Of Betting Apps On Youth : బెట్టింగ్ యాప్‌లు ఎంతో మంది యువత ఉసురు తీస్తున్నాయి. ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. సినీ, టీవీ నటులు, సామాజిక సేవకుల ముసుగులో ఇన్‌ఫ్లూయెన్సర్లు పలు బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్నారు. వీటికి ఆకర్షితులై ఎంతోమంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నారు. కొందరు లోన్ యాప్‌లను ఆశ్రయించి ఆ ఉచ్చులో చిక్కుతున్నారు. చివరికి అసలు, వడ్డీ చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో 2 ఏళ్లలో సుమారు 10 మంది బెట్టింగ్ ఉచ్చులో పడి బలవన్మరణం చెందినట్లుగా అంచనా. ఆయా కుటుంబాలు వారి బిడ్డల జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్నాయి. వారిలో ఏ ఒక్కరిని కదిలించినా కన్నీళ్లు ఉబికివస్తున్నాయి.
కడుపుకోత మిగిల్చాడు :
బాలానగర్ పరిధిలోని వినాయకనగర్‌కు చెందిన డి.తరుణ్‌రెడ్డి(21) బీటెక్ పూర్తి చేశాడు. ఎంఎస్ విద్య చదివేందుకు అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రముఖ వర్సిటీలో సీటు కూడా సంపాదించాడు. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తుండగా రూ.6 లక్షల ప్యాకేజీతో జాబ్ లభించింది. అతడి తల్లిదండ్రులు పొంగిపోయారు.
బీటెక్ చదివేటప్పుడు సరదాగా మొదలైన ఆన్‌లైన్ బెట్టింగ్‌లు అలవాటుగా మారాయి. రెండు సంవత్సరాలు పందేలు కాసేందుకు క్రెడిట్ కార్డుతో రూ.3 లక్షలు, పర్సనల్ లోన్ కింద రూ.4 లక్షలు తీసుకొని నష్టపోయాడు. అప్పులన్నీ తీర్చిన తండ్రి కుమారుడిని సున్నితంగా మందలించాడు. గతేడాది డిసెంబర్‌లో అప్పులు తీరగానే ఈ ఏడాది జనవరి 13వ తేదీన మళ్లీ బెట్టింగ్‌లతో క్రెడిట్ కార్డుతో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసేలోగా జనవరి 22న ఉరేసుకున్నాడు.
ఆర్థికంగా చితికిపోయి కొడుకుని కోల్పోయి :
గుడిమల్కాపూర్‌నకు చెందిన బాలకృష్ణ కుమారుడు శీలం మనోజ్ గతేడాది బీటెక్ మూడో ఏడాది చదువుతున్నప్పుడు ఆన్‌లైన్ బెట్టింగులకు దగ్గరయ్యాడు. ఈజీగా డబ్బు సంపాదించవచ్చంటూ మనోజ్‌ను రొంపిలోకి లాగారు. లోన్ యాప్‌లు, ఇతర మార్గాల్లో అప్పులు చేశాడు. ఆ సొమ్మంతా నష్టపోవడం వల్ల ఆందోళనకు గురయ్యాడు.
నెల వాయిదాలు చెల్లించట్లేదంటూ ఒత్తిడి చేయడం వల్ల అప్పుల విషయం బయటకు తెలిస్తే బంధువుల్లో తన పరువు పోతుందని భావించాడు. మనస్తాపంతో గతేడాది ఫిబ్రవరి 26న ఉరి వేసుకొని చనిపోయాడు. మనోజ్ చేసిన రూ.5 లక్షల అప్పును అతడి తండ్రే తీర్చాడు. ఆర్థికంగా చితికిపోయి కొడుకును కోల్పోయి తల్లిదండ్రులు కన్నీటి మధ్య జీవనం సాగిస్తున్నారు.
బిడ్డకు దూరమై కోలుకోలేని తల్లి :
ఎదిరే కొమరయ్య, లక్ష్మి దంపతులకు సాయికిరణ్(21) ఏకైక సంతానం. తల్లి కూలీకెళుతూ తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. కుమారుడిని నారాయణగూడలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీలో చేర్చారు. రూ.1.50 లక్షల బైక్ కొనిచ్చారు. ఏడాది క్రితం స్నేహితుల ప్రభావంతో బెట్టింగ్ యాప్‌లకు దగ్గరయ్యాడు. రూ.2 లక్షలు అప్పు చేశాడు. బైక్ వాయిదాలు సక్రమంగా చెల్లించలేదు. తప్పటడుగు వేశాడని గ్రహించిన తల్లిదండ్రులు రూ.రెండు లక్షల అప్పు తీర్చారు. బెట్టింగ్ వ్యసనంతో మరోసారి రూ.4.5 లక్షలు అప్పు చేశాడు. బైక్ తాకట్టు పెట్టాడు. చేసిన అప్పులు, కన్నవారి మనోవేదన చూసి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుంగిపోయిన తల్లి మూడు నెలలుగా మంచానికే పరిమితమైంది.
COMMENTS