Houses and Godowns Will be Seized For Illegal Activities
ఇళ్లు, షాపులు అద్దెకు ఇస్తున్నారా? - ఇవి చూడకుండా ఇస్తే ప్రాపర్టీ సీజ్ తప్పదు.
ఇళ్లు, షాపులు అద్దెకు ఇస్తున్నవారికి అలర్ట్ - వ్యవస్థీకృత నేరాలు చేసే వారికి ఇస్తే కేసులతో పాటు ప్రాపర్టీ సీజ్
Houses and Godowns Will be Seized For Illegal Activities : ఇళ్లు అద్దెకు ఇచ్చేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఇళ్లు, గోదాంలు అద్దెకు తీసుకుని ఎవరైన వాటిలో వ్యవస్థీకృత నేరాలు చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు సదరు ఇళ్లు, గోదాములు సైతం పోలీసులు సీజ్ చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడానికి కఠినంగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మట్కా, ఇతర జూద కేంద్రాలు నిర్వహించటానికి, నిషేధిక మద్యం, మాదక ద్రవ్యాలు, రాయితీ బియ్యం నిల్వ చేయటానికి వినియోగించే గోదాములకు ఎవరైనా తమ గృహాలు అద్దెకు ఇచ్చినా సదరు ఇళ్లు, గోదాములు రెవెన్యూ అధికారులకు నివేదించి జప్తు చేయించనున్నారు. చట్ట విరుద్ధంగా వ్యవస్థీకృత నేరాలు చేయడానికి వినియోగించే ఇళ్లను పోలీసులు గుర్తిస్తే మొదట కేసు నమోదు చేస్తారు. తర్వాత ఇళ్లను, గోదాములను సీజ్ చేయడానికి ఆర్డీవోకు నివేదిక సమర్పిస్తారు. ఆర్డీవో 152 బీఎస్‌ఎస్‌ఎస్ (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత - ఇండియన్ సిటీజన్ సేఫ్టీ కోడ్) ప్రొసీజర్ ప్రకారం సదరు గృహాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేస్తారు.
నకిలీ విత్తనాలు తయారు చేస్తూ : ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్‌లో ఒక షెడ్డును కిరాయికి తీసుకొని కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు తయారు చేస్తుండగా గతేడాది పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా వాటిని తయారు చేస్తున్న ముగ్గురు వ్యాపారులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. అద్దెకు ఇచ్చిన షెడ్డును సైతం రెవెన్యూ అధికారులతో సీజ్ చేయించారు.
గుట్కా నిల్వలు చేయగా సీజ్ : గతేడాది అదే జిల్లాలోని పురపాలక సంఘం కార్యాలయ సమీపంలోని ఒక గోదాంలో భారీగా గుట్కా నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా నిల్వ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. అంతేకాక నిషేధిత ఉత్పత్తులను నిల్వ చేయడంతో సదరు గోదాంను అప్పట్లో సీజ్ చేశారు.
చట్టవిరుద్ధంగా ఆవుల సరఫరా : ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పల్లి కాలనీలో ఒక పశువుల పాకను ఆవులను ఉంచటానికి అద్దెకిచ్చారు. పలు గ్రామాల నుంచి గోవులను కొనుగోలు చేసి ఆ పశువుల పాకలో ఉంచి ఇతర ప్రాంతాలకు చట్టవిరుద్ధంగా తరలిస్తుండేవారు. ఈ విషయం తెసులుకున్న పోలీసులు వ్యక్తిపై ఆదివారం కేసు నమోదు చేశారు. పశువుల పాకను అద్దెకు ఇచ్చిన వ్యక్తిపైనా కేసు నమోదు చేశారు.
మట్కా, ఇతర జూదం, చట్ట విరుద్ధ కార్యక్రమాలకు ఎవరైనా ఇళ్లను అద్దెకిస్తే సీజ్ చేయిస్తామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. ఇంటి యజమానులపైన కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు
COMMENTS