PLASTIC CONTAINER USAGE TIPS
కిచెన్‌లో ప్లాస్టిక్ డబ్బాలకు ఎక్స్పైరీ డేట్ - ఇలా కనిపిస్తే బయట పడేయాల్సిందే!
- ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్స్ ఎక్స్పైరీ డేట్ గుర్తించండిలా!
Avoid Plastic Containers to Store Food : నార్మల్‌గా అందరి ఇళ్లలో వంటగదిలో ప్లాస్టిక్ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్లు కనిపిస్తుంటాయి. పప్పుల నుంచి పచ్చళ్లు, కూరగాయలు, ఆహార పదార్థాల నిల్వ కోసం వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు మెజార్టీ పీపుల్. వీటిని వాడడం వెనుక తక్కువ ధరకు లభించడం, తేలికగా ఉండడం, ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడానికి అనువుగా ఉండడం ఇలా అనేక కారణాలు ఉండొచ్చు. అందరిలాగే మీరూ ఆహార పదార్థాల నిల్వ కోసం ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారా? అయితే, అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు.
ఎందుకంటే అన్ని వస్తువుల మాదిరిగానే ఇవి శాశ్వతంగా ఉండవు. వీటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందంటున్నారు. మీరు ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసినప్పటికీ దాని ఎక్స్పైరీ డేట్ ముగిశాక వాడడం ఆరోగ్యానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, అలాంటి వాటిని వెంటనే బయట పారేయాలని సూచిస్తున్నారు. మరి, అలాంటి డబ్బాలను ఎలా గుర్తించాలనే కదా మీ సందేహం? అయితే, మీ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
యూఎస్‌లోని పీడియాట్రిక్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ స్పెషాలిటీ యూనిట్(PEHSU) ప్రకారం, ప్లాస్టిక్‌లో రెండు రసాయనాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి థాలేట్స్ కాగా, మరొకటి బిస్ఫెనాల్ ఏ(BPA). ఇవి కంటైనర్ల ఆకారాన్ని సరిగ్గా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి "ఎండోక్రైన్ డిస్రప్టర్లు"గా ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రెండు రసాయనాలు ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల పనితీరును ప్రభావితం చేస్తాయని శాస్త్రీయ ఆధారాలు సూచిస్తున్నాయి. అంటే ఈ రెండూ పునరుత్పత్తి హార్మోన్లు, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. పిల్లల పెరుగుదల, అభివృద్ధిపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఆరోగ్యానికి నష్టం కలిగించే ఎక్స్పైరీ డేట్ ముగిసిన, కెమికల్స్‌తో కూడిన ప్లాస్టిక్ కంటైనర్లను వెంటనే పారవేయడం మంచిదని సూచిస్తున్నారు. రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిల్లో ఈ ఐదు సంకేతాలు ప్రధానంగా కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
పగుళ్లు : మీరు ఫుడ్ స్టోరేజ్ కోసం వాడే ప్లాస్టిక్ కంటైనర్ వంగినట్లు లేదా ఆకారంలో ఏదైనా మార్పు కనిపిస్తే దాన్ని వెంటనే పక్కన పెట్టాలంటున్నారు నిపుణులు. అలాగే, డబ్బాపై పగ్గళ్లు ఏర్పడినట్లు కనిపించడం, మూత సరిగ్గా పట్టకపోయినా దాన్ని బయటపడేయాలంటున్నారు. ఎందుకంటే పగుళ్లు, వంపులు కూడా బ్యాక్టీరియాను కలిగే ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే, వాటిని క్లీన్ చేయడం కష్టమవుతుందంటున్నారు.
మొండి మరకలు : కొన్నిసార్లు ప్లాస్టిక్ కంటైనర్లు మనం ఇంతకుమునుపు స్టోర్ చేసిన ఆహారం రంగు, వాసనను కలిగి ఉంటుంటాయి. ఇలా ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ ఎంత శుభ్రం చేసినా, గతంలో స్టోర్ చేసినా ఆహార పదార్థాల స్మెల్ వస్తున్నా, ఆరెంజ్ కలర్ మరకను కలిగి ఉన్నా వాటిని పక్కన పెట్టేయాలంటున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వాసనలు వస్తూ, రంగు మారడం కనిపిస్తుందంటే ఆ డబ్బాలో ప్లాస్టిక్ విచ్ఛిన్నమవుతుందని అర్థం చేసుకోవాలంటున్నారు.
మూత సరిగ్గా పట్టదు : ఏదైనా ప్లాస్టిక్ డబ్బా మూత మునుపటిలా సరిగ్గా పట్టకపోయినా దాని ఎక్స్పైరీ డేట్ ముగిసిందని అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిల్లో ఆహారం నిల్వ చేయడం కారణంగా గాలి చొరబడి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, అలాంటి డబ్బాలను వాడకపోవడమే మంచిదంటున్నారు.
ఈ గడుపు దాటాక వాడకపోవడం మంచిది : తరచుగా వాడటం, వేడికి గురికావడం వల్ల ప్లాస్టిక్ కాలక్రమేణా క్షీణిస్తుంది. ఎక్కువ రోజులు వాడడం వల్ల కంటైనర్లలో చిన్న గీతలు ఏర్పడవచ్చు. అవి బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతాయి. దాంతో వాటిల్లో స్టోర్ చేసిన ఆహారం తినడం ఆరోగ్యానికి నష్టం కలిగించవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ పాతవైతే వాటిని వెంటనే పక్కన పెట్టేయాలంటున్నారు. అవి బాగా కనిపించినప్పటికీ, కొత్త కంటైనర్లకు మారడం మంచిదంటున్నారు.
BPA రహితం కానివి వాడొద్దు : మీరు వాడే కంటైనర్లు BPA రహితం కాని పాత ప్లాస్టిక్‌తో తయారు చేసినవైతే వాటిని వెంటనే పారవేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఇక్కడ BPA అంటే బిస్ఫెనాల్-ఏ అని అర్థం. ఇది కొన్ని ప్లాస్టిక్‌లలో కనిపించే కెమికల్. ముఖ్యంగా వేడి చేసినప్పుడు ఈ కెమికల్ ఆహారంలోకి లీక్ అవుతుంది. అందుకే, ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న అన్ని డబ్బాలు BPA రహితంగా లేబుల్ చేసి వస్తున్నాయి. ఎందుకంటే ఇది ఆహార నిల్వను సురక్షితంగా చేస్తుంది. కాబట్టి, మీరు వాడే ప్లాస్టిక్ కంటైనర్ దిగువన రీసైక్లింగ్ కోడ్‌ని చెక్ చేస్తే అది BPA రహితమైందో లేదో తెలిసిపోతుందంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS