ONE RUPEE LUNCH IN HYDERABAD
కేవలం ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం - ఎక్కడో తెలుసా?
అన్నార్తులకు ఆకలి తీర్చుతున్న కరుణ కిచెన్ - ఒక్క రూపాయికే మధ్యాహ్నం భోజనం.
One Rupee Lunch : ఆకలితో ఉన్నవాళ్ల ఆర్తిని తీర్చడం కంటే మంచిపని ఇంకోటి ఉండదు. పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చే వలస కార్మికులు, దినసరి కూలీలు ఎవరైనా సరే సికింద్రాబాద్ ప్రాంతంలో సరిగ్గా మధ్యాహ్నం 12 కాగానే అక్కడకి చేరుకుంటారు. ఆకలి తీర్చుకుని తిరిగి పనులకు వెళ్తుంటారు. ఇంతకీ వాళ్లందరి ఆకలి తీరుస్తున్నది ఎవరో ? ఒకసారి చూద్దామా?
సికింద్రాబాద్ మనోహర్ టాకీస్ సమీపంలో కరుణ కిచెన్. ఆ పేరు అక్కడి కార్మికులకు గత నెలన్నర రోజులుగా సుపరిచితం. కేవలం ఒక రూపాయికే భోజనం అందిస్తూ గుడ్ సమ్మరిటీస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ దాతృత్వాన్ని చాటుకుంటోంది. జార్జ్ రాకేష్ బాబు ఆధ్వర్యంలో రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అందరిలా వ్యాపారం చేస్తే ఏం ప్రత్యేకత ఏముంటుందనుకొని, నగరానికి వచ్చే వారి ఆకలి తీర్చాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఒక్క రూపాయికే భోజనం అందిస్తున్నారు.
రోజుకు 300 మందికి భోజనం :
కేవలం ఒక్క రూపాయికే భోజనం అందిస్తున్న తమకు దాతలు ప్రత్యేక రోజుల్లో ఒక్కో ప్లేట్‌కు రూ.10 చొప్పున దానం చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వారంలో రెండ్రోజుల పాటు రైస్, టమాట చారు ఇస్తున్నట్లు, మిగతా రోజుల్లో బగారా రైస్, కిచిడితో పాటు వివిధ రకాల ఆహారం అందిస్తున్నారు. ఇంటి వద్ద వండుకొని వచ్చి రోజుకు 300 మందికి భోజనం అందిస్తున్నట్లు రాకేశ్ పేర్కొన్నారు. ఒక్క రూపాయి భోజనానికి ఎక్కువగా వలస కార్మికులు వస్తున్నట్లు చెబుతున్నారు.
"అనాథ వృద్ధుల గురించి చేస్తున్నప్పుడు ఎక్కువగా వలస కార్మికులు ఇబ్బంది పడేవారు. గౌతమ్ గంభీర్ ఒక్క రూపాయికే భోజనం పెట్టడం మమ్మల్ని ఆకట్టుకుంది. ఆ ఆలోచనను హైదరాబాద్‌లో ప్రవేశపెట్టాలని అనుకున్నాం. ఆకలి దగ్గరకే మనుషులు వస్తున్నారు. మనుషుల దగ్గరకు అది పోవడం లేదు. గత నెల రోజుల నుంచి నడిపిస్తున్నాం. ఇప్పుడిప్పుడే మనుషులకు తెలుస్తోంది. హైదరాబాద్‌లో చాలా మంది వలస కార్మికులు ఉన్నారు. వారికి రీచ్ అవుతుందో లేదో అనుకున్నాము కానీ ఈ కిచెన్ వలస కార్మికులకు మంచి ఉపయోగంగా ఉంది." - జార్జ్ రాకేశ్‌బాబు, నిర్వాహకుడు
భవిష్యత్తులో సేవలు విస్తరిస్తాం :
అక్కడ భోజనం బాగుంటుందని తింటున్నవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆకలి బాధను అర్థం చేసుకొని రూపాయికే భోజనం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇప్పటికైతే నగరంలో ఒక్కటే నడుపుతున్నామని నిర్వాహకుడు జార్జ్ తెలిపారు. భవిష్యత్‌లో సేవలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
COMMENTS