NOIDA DATING APP SCAM
డేటింగ్ యాప్‌లో 'అనిత' హనీ ట్రాప్- వ్యాపారికి రూ.6.5 కోట్లు టోకరా!
ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడుల పేరిట మోసం- వ్యాపారవేత్తను బురిడి కొట్టించిన మహిళ- రూ.6.5 కోట్లు కొల్లగొట్టిన మహిళ.
Noida Dating App Scam : ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన ఓ సంస్థ డైరెక్టర్‌ను డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ మహిళ బురిడి కొట్టించింది. మాయ మాటలు చెప్పి బిజినెస్ మ్యాన్ నుంచి ఏకంగా రూ.6.5 కోట్లు నొక్కేసింది. ఆఖరికి తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు నొయిడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే?
గతేడాది డిసెంబర్లో డేటింగ్ యాప్ ద్వారా నోయిడాకు చెందిన ఓ సంస్థ డైరెక్టర్‌కు అనిత అనే మహిళను పరిచయమైంది. తాను హైదరాబాద్‌కు చెందినదానినని చెప్పింది. ఈ క్రమంలో మాటలు కలిసి ఇద్దరూ స్నేహితులు అయ్యారు. తనను పూర్తిగా బాధితుడు నమ్ముతున్నాడని నిర్ధారించుకున్నాక ఆమె తన పథకాన్ని అమలులో పెట్టింది. ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపింది. తన బంధువులు, పరిచయస్తులు ఈ ట్రేడింగ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి నెలకు రూ.లక్షల్లో అర్జిస్తున్నారని నమ్మబలికింది. ఈ క్రమంలో మూడు వెబ్‌సైట్ల పేర్లను వ్యాపారవేత్తకు సూచించింది. ఆమె సిఫార్సు మేరకు బాధితుడు పలు టెలిగ్రామ్ గ్రూపులలో చేరారు.
మొదట లాభాలు- తర్వాత మోసం
బాధితుడు మొదట్లో ఒక వెబ్సైట్లో రూ.3.2 లక్షలు పెట్టుబడి పెట్టారు. వెంటనే రూ. 24,000 లాభం పొందారు. తన అకౌంట్ నుంచి రూ.8వేలు విత్ డ్రా చేశారు. అనిత మాటలపై ఇంకా నమ్మకం పెరిగి తాను దాచుకున్న రూ.4.5 కోట్ల సేవింగ్స్‌తోపాటు మరో రూ.2 కోట్లు లోన్ తీసుకొని మొత్తం రూ.6.5 కోట్లు పెట్టుబడి పెట్టారు. 30కిపైగా లావాదేవీల్లో 25 వేర్వేరు ఖాతాలకు ఈ నగదును బదిలీ చేశారు.
ఇలా బయటపడిందీ అసలు నిజం?
యాప్, వెబ్సైట్లో బాధితుడు రూ.2 కోట్ల లాభం పొందినట్లు చూపించింది. తన డబ్బును విత్ డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు ముందుగా మొత్తంపై 30శాతం పన్ను చెల్లించమన్నారు. అందుకు బాధితుడు నిరాకరించారు. ఆ తర్వాత అనిత సూచించిన 3 వెబ్‌సైట్లు డౌన్ అయిపోయాయి. అనిత ఫోనూ మూగబోయింది. మోసపోయినట్లు గ్రహించిన ఆ వ్యక్తి నొయిడా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
చాకచక్యంగా వ్యవహరించిన మహిళ
బాధితుడు అనితను బహుళ ఖాతాలకు డబ్బు ఎందుకు పంపమంటున్నారని ప్రశ్నించారు. అప్పుడు పెట్టుబడిదారుల లాభాలను పెంచడానికి ఇది పన్ను ఆదా చేసే పద్ధతి అని ఆమె నమ్మించింది. మోసపోయానని గ్రహించిన తర్వాత బాధితుడు సోషల్ మీడియాలో అనిత ప్రొఫైల్ కోసం శోధించారు. ఆమె పేరుతో అనేక ఖాతాలు ఉన్నాయి. తర్వాత ఇదే విధంగా స్కామ్‌కు గురైన మరో ఇద్దరు వ్యక్తులను సంప్రదించారు. మోసగాళ్లు ఇదే పద్దతిలో వారిని బురిడి కొట్టించారని తెలుసుకున్నారు. కాగా, ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని నొయిడా సైబర్ క్రైమ్ డీసీపీ ప్రీతి యాదవ్ తెలిపారు. లావాదేవీలను ట్రాక్ చేయడానికి సంబంధిత బ్యాంకుల నుంచి సమాచారాన్ని కోరామని చెప్పారు.
COMMENTS