MAN TRIED SURGERY WATCHING YOUTUBE
యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేసుకున్న యువకుడు- ఆ తర్వాత ఏం జరిగిందంటే?
యూట్యూబ్ వీడియోలు చూసి తనకు తాను శస్త్రచికిత్స - సర్జరీ విఫలమై ఆస్పత్రిపాలైన యువకుడు.
Man Tried To Surgery Watching Youtube : తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు చూసి తనకు తానే ఆపరేషన్ చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో పొట్టను కోసి సర్జరీ చేసేందుకు ప్రయత్నించగా విఫలమై తీవ్ర రక్తస్రావమైంది. అతడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ మథురలో జరిగింది.
యూట్యూబ్ వీడియోలు చూసి సర్జరీ
మథురలోని సున్ రాఖ్ గ్రామానికి చెందిన రాజా బాబు (32) గత కొద్దికాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లినా ఆ నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలోనే తనకు తానే స్వయంగా ఆపరేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం సర్జరీ ఎలా చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూశాడు. ఆపరేషన్ కోసం మథురకు వెళ్లి సర్జికల్ బ్లేడ్‌లు, కుట్లు వేసుకునే పరికరాలు, మత్తు ఇంజెక్షన్లు తెచ్చుకున్నాడు.
విఫలమైన సర్జరీ
బుధవారం రాజబాబు ఒక గదిలో సర్జరీకి ఏర్పాట్లు సైతం చేసుకున్నాడు. ఆపరేషన్ ప్రారంభించే ముందు తనకు తాను మత్తు ఇంజెక్షన్ చేసుకున్నాడు. ఆ తర్వాత కడుపు కుడివైపున 7అంగుళాల గాటు పెట్టాడు. అది అనుకున్నదాని కంటే ఎక్కువ గాటు పడి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అప్రమత్తమై సూది, దారంతో కుట్లు వేసుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే, కొంత సమయం తర్వాత మత్తు ఇంజెక్షన్ ప్రభావం తగ్గిపోయి నొప్పి మరింత పెరిగింది. ఇంకా రక్తస్రావం కూడా ఆగకపోవడం వల్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్నంతా చెప్పాడు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, రాజ బాబును హుటాహుటిన మథుర జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
"రాజా బాబుకు దాదాపు 18 ఏళ్ల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. గత కొన్ని రోజులుగా ఆయనకు కడుపు నొప్పి వస్తోంది. చాలా మంది వైద్యులను సంప్రదించినా ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన తనకు తానే స్వయంగా ఆపరేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం మథుర జిల్లా ఆస్పత్రిలో రాజబాబు చికిత్స పొందుతున్నాడు. " అని రాజా బాబు మేనల్లుడు రాహుల్ తెలిపాడు.
COMMENTS