CBSE PARENTS HANDBOOK CAREERS
టెన్త్ తర్వాత ఏం చేయాలి? - విద్యార్థుల భవిష్యత్ పై CBSE సూపర్ బుక్!
- పాఠశాల తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా "హ్యాండ్‌బుక్" - ఎంట్రన్స్ టెస్ట్‌లు, బెస్ట్ కాలేజీల వివరాలతో సమగ్ర సమాచారం!
CBSE Parents Handbook Careers: విద్యార్థి దశలో పదవ తరగతి, ఇంటర్ రెండూ కీలకమైనవే. ఎందుకంటే పై చదువులు చదవడానికైనా లేదంటే ఏదైనా ఉద్యోగం సంపాదించడానికైనా ఇవి ముఖ్యం. అయితే టెన్త్, ఇంటర్ తర్వాత చాలా మంది "ఏం చేయాలి?" అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. పేరెంట్స్, బంధువులు, ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కరూ ఒక్కో సలహా ఇస్తుంటారు. దీంతో భవిష్యత్తులో ఏం చేయాలనే దాని గురించి ఆలోచించి సతమతమవుతుంటారు. తాజాగా ఇలాంటి వారి కోసం CBSE ఓ హ్యాండ్ బుక్‌ను సిద్ధం చేసింది. విద్యార్థుల భవిష్యత్ కెరీర్ అవకాశాలను వివరిస్తూ తల్లిదండ్రుల కోసం ఈ హ్యాండ్ బుక్‌ను ప్రిపేర్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పాఠశాల తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా తల్లిదండ్రుల కోసం ఒక హ్యాండ్ బుక్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సిద్ధం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు గురించి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి, సాధికారత కల్పించడంలో కెరీర్ గైడెన్స్ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకున్న బోర్డు, దీనికి సంబంధించి వారికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే హ్యాండ్ బుక్‌ను తల్లిదండ్రుల కోసం రూపొందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మోహిత్ మంగళ్ రచించిన "పేరెంట్స్ హ్యాండ్ బుక్ ఆన్ కెరీర్స్ ఆన్ స్కూల్ ఇన్ ఇండియా"ను సీబీఎస్ఈ తీసుకొచ్చింది.
ప్రవేశ పరీక్షల కోసం:
ఈ సమగ్ర గైడ్ - పాఠశాలలు, తల్లిదండ్రులు, సంరక్షకులకు వారి పిల్లలు కెరీర్ ఎంపికలను సమర్థవంతంగా అన్వేషించడంలో సహాయపడటానికి విలువైన ఇన్సైట్స్ను, ఆచరణాత్మక సలహాలను అందిస్తుందని అధికారిక నోటీసులో పేర్కొన్నారు. అదనంగా, ప్రవేశ పరీక్షలు 2025 గైడ్, 22 హయ్యర్ ఎడ్యుకేషన్ వర్టికల్ పుస్తకాలను అవసరమైన రిఫరెన్స్‌లుగా రూపొందించారు.
అలాగే ఈ హ్యాండ్ బుక్‌లో అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్, బిజినెస్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, డిఫెన్స్, ఎకానమిక్స్, ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్, లా, మెడిసిన్ ఇలా పలు రకాల కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే కోర్స్ ఎన్ని సంవత్సరాలు, కోర్సులో జాయిన్ అయ్యేందుకు ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించిన వివరాలు, బెస్ట్ కాలేజీల లిస్ట్‌ను ఈ హ్యాండ్‌బుక్‌లో పొందుపరిచారు. మరింత సమాచారం కోసం ఈ లింక్‌పై లేదా సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
COMMENTS