IS ALUMINUM COOKWARE SAFE TO USE
ప్రతీ ఇంట్లో ఈ గిన్నెల్లోనే వంట - కిడ్నీ, మెదడు, క్యాన్సర్ ముప్పు! - మనదేశంలోకి అలా చొరబడ్డాయి!
- వంటింటిని ఆక్రమించేసిన అల్యూమినియం పాత్రలు - రాతెండి గిన్నెల వాడకంలో జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు.
Is Aluminum Cookware Safe to Use?: ఒకప్పుడు వంటలు చేయాలంటే మట్టి పాత్రలమే ఉపయోగించేవారు. కానీ జనరేషన్లు మారుతున్న కొద్దీ అల్యూమినియం, రాగి, ఇత్తడి, స్టీల్, నాన్‌స్టిక్ వంటి రకరకాల వంట పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇందులో నూటికి 90 శాతానికి పైగా వంటిళ్లను అల్యూమినియం పాత్రలు ఆక్రమించేశాయంటే అతిశయోక్తి కాదు.
ఇవి అందుబాటు ధరలోనే ఉండటం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు వీటినే ఎక్కువగా వాడుతున్నారు. అన్నం, కూర, పప్పు, రసం ఇలా వంటకం ఏదైనా ఈ అల్యూమినియం గిన్నెలు ఉండాల్సిందే. అంతగా ఇవి మనలో భాగం అయ్యాయి. అయితే ఈ పాత్రలు ఉపయోగించడం వరకు బానే ఉన్నా, ఎంతవరకు సేఫ్ అన్నది చాలా మంది తెలియదు. అయితే ఆరోగ్యం కోసం అల్యూమినియం పాత్రల వాడకంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
మన దేశంలోకి అలా వచ్చాయి :
రెండొందల ఏళ్ల క్రితం అంటే 1825లో అల్యూమినియం అనే లోహం ఒకటి ఉందని డెన్మార్క్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త కనుగొన్నారు. 1938లో "ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్" సంస్థ భారత్‌లో అల్యూమినియం ఉత్పాదనను ప్రారంభించింది. అప్పటినుంచి వీటి వాడకం విస్తృతమైంది. దీంతో మట్టి, ఇత్తడి, కంచు, రాగి పాత్రలు అరుదుగా మారిపోయాయి. ఈ పాత్రల్లో చేసే వంటకాల్లో అతిసూక్ష్మ మోతాదుల్లో అల్యూమినియం కరిగి ఉంటుంది. తద్వారా అది ఆహారం తీసుకున్న వారి శరీరాల్లోకి ప్రవేశించి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ జబ్బులు ఎటాక్ :
సాధారణంగా ఈ లోహానికి శరీర నిర్మాణంలో ఎలాంటి పాత్రా లేదని, అందుకే అధికభాగం మూత్ర విసర్జన రూపంలో బయటికి వెళ్లిపోతుందని అంటున్నారు. కడుపులోకి వెళ్లిన అల్యూమినియంలో 0.01% నుంచి 1% వరకూ జీర్ణకోశం శోషించుకుంటుందని, దీన్ని మూత్ర పిండాలు బయటకు వెళ్లగొడతాయని అంటున్నారు. ఇంతవరకూ బానే ఉన్నా, ఈ రాతెండికి కణజాలాల్లో పేరుకునే స్వభావం ఉండటం వల్ల ఎముకలు, మెదడు వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీజబ్బుతో బాధపడేవారికి మరింత ఎక్కువ హాని చేయొచ్చని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పలు వివరాలను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన పలువురు నిపుణులు "ది నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియా"లో ప్రచురించారు(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సాధారణ పదార్థాలతో పోలిస్తే, టమాటా, నిమ్మ, చింతపండు వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుందని అంటున్నారు. ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకు చాలా అవసరం. అయితే శరీరంలో పేరుకుపోయిన అల్యూమినియం ఇటువంటి ఉపయోగకరమైన లోహాలును దెబ్బతీస్తుందని, తద్వారా రక్తహీనత, ఎముక మెత్తబడటం (ఆస్టియోమలేషియా), డయాలిసిస్ ఎన్‌కెఫలోపతి (ఇది దీర్ఘకాలంగా డయాలిసిస్ చేయించుకునేవారిలో వచ్చే సమస్య) అనే నాడీ మండల వ్యాధులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
క్యాన్సర్‌కు అవకాశం:
మెదడులో అల్యూమినియం మోతాదుకు మించి పేరుకుపోతే ‘‘డయాలిసిస్ ఎన్‌కెఫలోపతి’ లేదా ‘‘డయాలసిస్ డిమెన్షియా’’ అనే వ్యాధికి గురయ్యే ప్రమాదముందని వైద్య శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఈ స్థితికి చేరిన వ్యక్తి మాట సరిగ్గా రాకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం, శరీర కదలికల్లో మార్పు, ప్రవర్తనలో తేడా వంటి దుష్ప్రభావాలకు లోనవుతాడని అంటున్నారు. అంతేకాకుండా అల్జీమర్స్ వ్యాధి, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా సత్తు కారణమవుతోందని చెబుతున్నారు.
ఎంత వరకు తీసుకోవచ్చు :
ఒక మనిషి ఒక వారానికి వారి బరువులో ప్రతి కిలోకు 2 మిల్లీ గ్రాముల వరకు అల్యూమినియం తీసుకున్నా శరీరం తట్టుకోగలదని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO), ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా నిర్ణయించాయి. అంతకు మించితే మాత్రం ప్రమాదం తప్పదని హెచ్చరించాయి.
ఎలా ఉండాలంటే:
మనిషి శరీరంలోకి ఈ రాతెండి చేరడానికి అతిపెద్ద కారణం వంట పాత్రలు, అల్యూమినియం ఫాయిల్సే అంటున్నారు. స్టీల్ పాత్రలతో పోలిస్తే అల్యూమినియం గిన్నెలు మూడో వంతు సాంద్రత కలిగి ఉండి చాలా తేలిగ్గా ఉంటాయి. దీనికి మాంగనీసు, రాగి, జింక్ వంటివి జతచేసి మిశ్రమ లోహంతో తయారు చేస్తే మన్నిక ఉంటుందని అంటున్నారు.
అల్యూమినియం వంటపాత్రలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కొన్ని ప్రమాణాలను సూచించిందని, పాత్రలు కొనేటప్పుడు వాటిని గమనించాలని అంటున్నారు.
వంటపాత్రల కోసం ఉపయోగించే అల్యూమినియం, దాని మిశ్రమ లోహాలు దళసరిగా, నునుపుగా ఉండాలని సూచిస్తున్నారు.
పాత్రల ఉపరితలం నున్నగా ఉండటానికి వాటిపై అల్యూమినియం ఆక్సైడ్‌తో పైపూత పూసి ఉండాలని లేదంటే యానోడైజేషన్ ప్రక్రియ ద్వారా పాత్రల్ని మందంగా మార్చి ఉండాలని అంటున్నారు.
ఆ పాత్రలన్నీ ప్రమాదకరమా?: పాత్రలో వండుతున్న పదార్థాల ఆమ్లత లేదా క్షారత (పీహెచ్), ఎంత ఉష్టోగ్రతపై వంట చేశారు, ఏ నూనె వాడారు, పాత్రను ఎంత సేపు పొయ్యిపై ఉంచారు వంటి అంశాలు వంటకంలో కలిసే అల్యూమినియం మోతాదును నిర్ణయిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా పుల్లటి పదార్థాల్లో ఈ లోహం ఎక్కువగా కరుగుతుందని చెబుతున్నారు.
కిడ్నీ జబ్బు బాధితులకు ప్రమాదమే: దీర్ఘకాలం కిడ్నీజబ్బులతో బాధపడేవారు అల్యూమినియం పాత్రలకు దూరంగా ఉండడమే మేలని హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రికి చెందిన సీనియర్ నెఫ్రాలజిస్ట్ డా. కె.వి. దక్షిణామూర్తి చెబుతున్నారు. వీటిల్లో వండినప్పుడు అల్యూమినియం వంటకాల్లోకి లీక్ అవుతుందని, ఆహార పదార్థాలతో పాటే ఇదీ కడుపులోకి వెళ్తుందని అంటున్నారు. అప్పుడు రక్తంలో అల్యూమినియం మోతాదులు పెరుగుతాయని, కిడ్నీజబ్బు గలవారిలో మూత్రపిండాలు దీన్ని సరిగా బయటకు వెళ్లగొట్టలేలవని, అప్పుడది కణజాలాల్లో, అవయవాల్లో పోగవుతోందని అంటున్నారు.
అలా ఎముకల్లో పేరుకుపోతే ఎముకల జబ్బు, ఎముకమజ్జలో చేరుకుంటే రక్తహీనత, నాడీకణజాలంలో పేరుకుంటే డిమెన్షియా వంటి జబ్బులకు దారితీస్తుందని అంటున్నారు. వంటపాత్రలు ఒక్కటే కాకుండా, చాలా రకాల యాంటాసిడ్ మాత్రల్లోనూ అల్యూమినియం ఉంటుంది. కాబట్టి కిడ్నీజబ్బు గలవారు ఇలాంటివి వాడకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS