No tax up to Rs.12 lakhs
Income Tax: రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్.. మరి ఆ కింది శ్లాబులు ఎందుకు?
Income Tax: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో 2025 బడ్జెట్ (2025 Budget) ప్రవేశపెట్టారు. మధ్య తరగతి, రైతులు సహా పలు వర్గాల కోసం కీలక ప్రకటనలు చేశారు. అందులో అత్యంత ముఖ్యమైనది ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax) విధానంలో మార్పులు. మధ్య తరగతి, ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే విధంగా కొత్త పన్ను విధానంలో సవరణలు చేశారు.
బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ప్రకటించిన ప్రకారం.. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇది రిబేట్ మాత్రమే. మినహాయింపు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. శ్లాబుల విషయంలోనూ మార్పులు చేశారు. ఇక స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు కూడా కలిపితే మొత్తం రూ.12,75,000 వార్షికాదాయం వరకు పన్ను ఉండదు. కొందరికి అర్హతల మేరకు మరో రూ.30,000పై కూడా రిబేట్ వర్తిస్తుంది. ఇది కూడా పరిగణనలోకి తీసుకుంటే కొంత మంది రూ.13 లక్షల వార్షికాదాయం వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
* కొత్త పన్ను విధానంలో మార్చిన శ్లాబులు
రూ.0- 4 లక్షలు - ఎలాంటి పన్ను ఉండదు
రూ.4- 8 లక్షలు - 05 శాతం
రూ.8-12 లక్షలు - 10 శాతం
రూ.12-16 లక్షలు - 15 శాతం
రూ.16-20 లక్షలు - 20 శాతం
రూ.20-24 లక్షలు - 25 శాతం
రూ.24 లక్షల పైన - 30 శాతం
ఈ శ్లాబులను గమనిస్తే రూ.0- 4 లక్షలు, రూ.4- 8 లక్షలు, రూ.8-12 లక్షలకు సైతం పన్ను రేటును నిర్ణయించారు. మరి ముందు చెప్పినట్లుగా రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదనుకున్నాం. మరి రూ.12 లక్షల కంటే తక్కువ ఆదాయానికి రేట్లను ఎలా నిర్ణయించారనే అనుమానం వచ్చి ఉండొచ్చు. రూ.12 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 87A ప్రకారం రిబేట్ వర్తిస్తుంది. తద్వారా ఎలాంటి పన్ను ఉండదు. ఒక వేళ ఆ పరిమితి గనక దాటితే మొత్తం రూ.12 లక్షలకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్, రూ.30,000 రాయితీ కూడా కలిపితే మొత్తం రూ.13 లక్షలపైన ఆదాయం ఉన్నవాళ్లు రూ.12 లక్షల మొత్తంపై పన్ను కట్టాల్సిందే.
ఉదాహరణకు ఆదాయం మొత్తాన్ని తొలుత శ్లాబు రేట్ల ప్రకారం డివైడ్ చేస్తారు. సురేశ్ అనే వ్యక్తి ఏటా రూ.16 లక్షలు సంపాదిస్తున్నాడనకుందాం. అప్పుడు అతడి ఇన్‌కమ్‌ని రూ.0-4 లక్షలు, రూ.4-8 లక్షలు, రూ.8-12 లక్షలు, రూ.12-16 లక్షలుగా విభజిస్తారు. మొదటి శ్లాబుపై ఎలాంటి పన్ను ఉండదు. అంటే ఇది మినహాయింపు. ఎంత ఆదాయం ఉన్నాసరే తొలి రూ.4 లక్షలకు అసలు పన్ను వర్తించదు.
రెండో శ్లాబు ప్రకారం 5 శాతం చొప్పున రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.8-12 లక్షల ఆదాయ శ్లాబుపై 10 శాతం లెక్కన రూ.40 వేలు, రూ.12-16 లక్షల ఆదాయంపై 15 శాతం చొప్పున రూ.60 వేలు చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన రూ.16 లక్షల ఆదాయం ఉన్న సురేశ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,20,000 పన్ను కట్టాల్సి ఉంటుంది. గత పన్నుల రేట్లు, శ్లాబులతో పోలిస్తే రూ.50 వేలు మిగులుతుండడం విశేషం.
* రూ.12 లక్షల కంటే కింద ఉన్న పన్ను శ్లాబులు దేనికి
ఈ నేపథ్యంలో రూ.12 లక్షల కంటే కింద ఉన్న పన్ను శ్లాబులు ఆ పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో సంపాదించే వారికి మాత్రమే వర్తిస్తుంది. మరోవైపు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. గత పన్ను విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటిన వారంతా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉండేది. ఈసారి రూ.16-20 లక్షలు, రూ.20-24 లక్షలు, రూ.24 లక్షలు.. ఆ పైన.. శ్లాబులు కూడా తెచ్చిన నేపథ్యంలో కొంత వరకు పన్ను భారం తగ్గుతుంది. మరోవైపు కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.
COMMENTS